ETV Bharat / health

రాత్రి వేళ 'ఈ తప్పులు' చేస్తున్నారా? - కిడ్నీలు ప్రమాదంలో పడ్డట్లేనట!

-కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే - నిద్రపోయే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

కిడ్నీలు
కిడ్నీలు (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : August 29, 2026 at 6:23 PM IST

3 Min Read
Choose ETV Bharat

Best Habits for Kidney Health : శరీరం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాలను తొలగించడం, రక్తంలో నీరు, ఉప్పు, సోడియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడంలో కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే కిడ్నీల పనితీరు దెబ్బతినకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు పలు తప్పులు చేయకూడదని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

డీహైడ్రేషన్‌తో పడుకోవద్దు : పడుకోవడానికి ముందే ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల రాత్రి పదే పదే మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రకు భంగం వాటిల్లుతుంది. దీంతో చాలా మంది పడుకునే ముందు నీళ్లు తాగడం పూర్తిగా తగ్గించేస్తారు. అయితే దీనివల్ల రాత్రి వేళల్లో మూత్రం బాగా చిక్కబడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతుందంటున్నారు. అలాగే, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే పడుకునే ముందు కొద్ది మొత్తంలో నీరు తాగడం ద్వారా, నిద్రపోయే ముందు శరీరంలో సరైన హైడ్రేషన్ స్థాయిలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. రాత్రి సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లేదా శ్రేయస్సు పెరుగుతుందని National Library of Medicine పేర్కొంది.

రోజంతా తగినంత నీరు తీసుకోవడం : పగటిపూట మంచి హైడ్రేషన్ అలవాట్లను కలిగి ఉండటం వల్ల.. రాత్రి వేళల్లో కూడా శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉండటానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఒకే క్రమ పద్ధతిలో తగినంత మొత్తంలో నీరు లేదా ద్రవపదార్థాలను తీసుకుంటే, రాత్రి పూట శరీరానికి సరిపడా నీటిని అందించడం కోసం ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగాల్సిన అవసరం రాదని తెలియజేస్తున్నారు.

మీ శరీరానికి రోజూ సరిపడా ప్రొటీన్ ఇస్తున్నారా? - ఎవరెవరికి, ఎంత అవసరం?

రాత్రిపూట ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహారాలను తినవద్దు : పుచ్చకాయ, సూప్‌ల వంటి ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహార పదార్థాలు కూడా ద్రవాల వినియోగం కిందకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, డయాలసిస్ చేయించుకుంటున్న వారు లేదా శరీరంలో ద్రవాల పరిమాణాన్ని పరిమితంగా ఉంచుకోవాల్సిన ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పడుకునే ముందు ఇలాంటి ఆహారాలను ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారనే విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

రాత్రి వేళల్లో కెఫెన్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు : చాలా రకాల పానీయాలలో కెఫెన్, చక్కెర ఉంటాయి. టీ, కాఫీలలో ఉండే డ్యూరెటిక్ లక్షణాల (ఎక్కువగా మూత్రం వచ్చేలా చేయడం) వల్ల రాత్రి నిద్రకు భంగం కలగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలా సరిగ్గా నిద్రలేకపోవడం, శరీరంలో నీటి శాతం తగ్గడం రెండూ కలిసి కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయంటున్నారు. శరీరంలో చేరే ద్రవ పరిమాణంతో పాటు కెఫెన్ మూత్రవిసర్జనను ప్రేరేపించే గుణాలు, కిడ్నీల వడపోత ప్రక్రియ జీవ గడియారాన్ని (circadian rhythm) మారుస్తాయని National Library of Medicine పేర్కొంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిల సమతుల్యత : శరీరంలో తగినంత నీటి శాతం ఉండటానికి ఎటువంటి ఫ్లేవర్లు లేని సాధారణ నీరు ఎంతగానో అవసరమని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనితో పాటు శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలు సమతుల్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యమంటున్నారు.

కిడ్నీ వ్యాధి ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు : దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్న వారు.. ప్రతిరోజూ తమకు డాక్టర్లు సూచించిన ద్రవపదార్థాల పరిమితులను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు కొద్దిగా అదనంగా నీరు తీసుకున్నా కూడా, అది శరీరంలో విపరీతమైన వాపులకు, శ్వాస ఆడకపోవడానికి లేదా తదుపరి డయాలసిస్ చికిత్సకు ముందే కిడ్నీలపై అదనపు భారాన్ని పెంచడానికి దారితీయవచ్చని అంటున్నారు.

మూత్రం రంగును గమనించడం : తగినంత మొత్తంలో ద్రవపదార్థాలు తాగుతున్నారా? లేదా? అని తెలుసుకోవడానికి దాహం వేయడం, మూత్రం రంగు, ఎంత తరచుగా మూత్ర విసర్జన చేస్తున్నారు అనేవన్నీ ముఖ్యమైన సూచికలని నిపుణులు చెబుతున్నారు. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే.. శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉన్నట్లు, అదే ముదురు పసుపు రంగులో ఉంటే.. మరికొంత నీరు లేదా ద్రవపదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

టైమ్​పాస్ కోసం 'సిగరెట్​' తాగుతున్నారా? - ఈ హెచ్చరిక సంకేతాలతో అలర్ట్ కావాల్సిందే!

ఎంతో ఖరీదైన మెదడు వైద్య పరీక్షలు - సెల్​ఫోన్​తో గుర్తించేలా శాస్త్రవేత్తల ఆవిష్కరణ!