తెలంగాణ

telangana

దిల్లీ మద్యం కేసు - ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు - kavitha Judicial Custody Extended

By ETV Bharat Telangana Team

Published : Apr 23, 2024, 2:59 PM IST

Updated : Apr 23, 2024, 5:12 PM IST

MLC kavitha Judicial Custody Extended : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ ఉంటుందని వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.

kavitha Judicial Custody Extended
MLC kavitha Judicial Custody Extended

MLC Kavitha Judicial Custody Extended in Delhi Liquor Case :దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈడీ, సీబీఐ కేసులో ట్రయల్‌ కోర్టు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియటంతో రెండు దర్యాప్తు సంస్థలు కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించింది.

Kavitha Bail Petition Postponed :మరోవైపు ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. నిన్నటి విచారణకు కొనసాగింపుగా రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 19 అనుగుణంగా కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని కోర్టుకు నివేదించారు. కవితను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్న ఈడీ, 10 రోజుల పాటు సమన్లు ఇవ్వబోమని మాత్రమే ఈడీ 2023 సెప్టెంబర్‌ 26న అండర్‌టేకింగ్‌ ఇచ్చిందని పేర్కొన్నారు.

తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ వేసి, మళ్లీ ఉపసంహరించుకోవడాన్ని చూస్తే అరెస్ట్‌ చట్టవిరుద్దంగా జరగలేదని అర్థమవుతోందని ఈడీ తరఫున న్యాయవాది అన్నారు. కవితకు వ్యతిరేకంగా శరత్‌రెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారని గుర్తు చేశారు. కవితను సూర్యాస్తమయం కంటే ముందు అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.

విచారణ రేపటికి వాయిదా : అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నామన్న ఈడీ తరఫున న్యాయవాది జోయబ్‌ హుస్సేన్‌, అరెస్టు చేసిన 24 గంటల్లోనే కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఈడీ(Enforcement Directorate) తరపున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు తెలపటంతో విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం జరిగే విచారణలో ఈడీ వాదనలనంతరం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​పై నిన్న కోర్టులో విచారణ జరిగింది. కవిత తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆమెను అరెస్టు చేశారని, అప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నా సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాగా దీనికి కొనసాగింపుగా ఇవాళ కోర్టులో విచారణ జరగగా మళ్లీ రేపటి వాయిదా పడింది. దిల్లీ మద్యం కేసులో మార్చి 15న అరెస్టైన కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్నారు.
కవిత సీబీఐ బెయిల్ పిటిషన్‌పై మే 2న తుది ఉత్తర్వులు - ఈడీ బెయిల్ పిటిషన్​ రేపటికి వాయిదా - KAVITHA BAIL PETITION HEARING

Last Updated :Apr 23, 2024, 5:12 PM IST

ABOUT THE AUTHOR

...view details