తెలంగాణ

telangana

నవ భారత నిర్మాత - భాగ్యవిధాత @ పీవీ నరసింహారావు

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 2:04 PM IST

PV Narasimha Rao Bharat Ratna : సంస్కరణల పథంతో దేశ గతిని మార్చిన సమున్నత వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. ఆర్థికవ్యవస్థ దివాళా అంచున ఉన్న సమయంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు కీర్తి శిఖరం. అనేక సవాళ్లను ఒంటిచేత్తో ఎదుర్కొన్న అపర చాణక్యుని శత జయంతుత్సవాలను జరుపుకోవడం తెలుగువారికే కాక దేశ ప్రజలందరికీ గర్వకారణమే.

Bharat Ratna New Awards
PV Narasimha Rao Bharat Ratna

PV Narasimha Rao Bharat Ratna :పరాయి పాలనకు, పీడనకు చరమగీతం పాడి దేశమాతకు రాజకీయ స్వాతంత్య్రం సాధించిన మహోద్యమ సారథ్యం మహాత్మాగాంధీది అయితే, లైసెన్స్‌ పర్మిట్‌ రాజ్‌ చెరలో మగ్గుతున్న జాతికి ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించి భారతావని స్థితిని గతిని మార్చిన ధన్యజీవి- మన పీవీ! దేశం నాకేమిచ్చిందన్నది కాదు, దేశానికి నువ్వేం చేశావన్నదే ప్రధానమన్న జాన్‌ ఎఫ్‌ కెనెడీ మాటే గీటురాయి అనుకుంటే- కొత్త సహస్రాబ్ది సవాళ్లకు దీటుగా ఇండియా దశ దిశలను మార్చి, ఆర్థిక సంస్కరణలే దిక్సూచిగా వృద్ధిరేట్లకు కొత్త రెక్కలు తొడిగిన పీవీ, భరతమాత రుణం తీర్చుకొన్న కర్మయోగి!.

'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు'

రాజనీతిజ్ఞత..

మూడు దశాబ్దాల క్రితం 70 ఏళ్ల వయసులో రాజకీయ వానప్రస్థానానికి సిద్ధమైన పీవీ ఇదే నెలలో దేశ తొమ్మిదో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. తమిళ పులుల రక్తదాహానికి రాజీవ్‌గాంధీ బలైపోయి శతాధిక వర్షీయసి కాంగ్రెస్‌(Congress) నిశ్చేతనమైన వేళ, దేశార్థికమూ దివాలా అంచులకు చేరిన సమయంలో పీవీ దార్శనికతే చుక్కానిగా ఇండియా తెరిపిన పడింది. పీవీ జమానాకు ముందు రెండు, దరిమిలా నాలుగు మైనారిటీ ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్పకూలిన వాస్తవాన్ని గమనిస్తే, అంతర్గత ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంఖ్యాబలం లేని సర్కారుతోనే సంస్కరణల తెరచాపలెత్తి దేశాన్ని విజయతీరాలకు చేర్చడంలో పాములపర్తి వారి రాజనీతిజ్ఞత అబ్బురపరుస్తుంది.

నాడు ద్రవ్యలోటు స్థూలదేశీయోత్పత్తిలో తొమ్మిది శాతానికి, ద్రవ్యోల్బణం 16 శాతానికి ఎగబాకి, విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి, బంగారం కుదువ పెట్టాల్సిన దౌర్భాగ్యస్థితి నుంచి- అయిదేళ్ల వ్యవధిలో ఏడు శాతం వృద్ధి రేటు నమోదు చేసేలా దేశ పథ గమనాన్ని తీర్చిదిద్దింది పీవీయే! ఆర్థిక వేత్త మన్‌మోహన్‌ సింగ్‌ను విత్తమంత్రిగా నియమించి, రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షణ కల్పించి పీవీ కనబరచిన దార్శనికత వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా, అత్యధిక విదేశీ నిల్వలుగల (60 వేల కోట్ల డాలర్ల) నాలుగో దేశంగా విరాజిల్లుతోంది. భారతావని భాగ్యరేఖల్ని ఇలా తీర్చి దిద్దిన ఆ తెలుగుఠీవికి శతవసంతాల వేళ ఇది!

పీవీ దేశాన్ని సమూలంగా మార్చిన తపస్వి: వెంకయ్య

సంస్కరణాభిలాష..

సమస్య మూలాలకు సంస్కరణల చికిత్స చేయడంలో ఆది నుంచీ పీవీది అందెవేసిన చేయి!. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా అనంతపురంలో ఆరు బయలు జైలు, ఆరోగ్య మంత్రిగా వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై వేటు, దేవాదాయ శాఖ చూసేటప్పుడు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం, విద్యామంత్రిగా ఆదర్శ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం- పీవీ(PV Narasimha Rao) సంస్కరణాభిలాషకు అద్దం పట్టాయి. అయిదు దశాబ్దాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టం తెచ్చి తన సొంత భూమి 500 ఎకరాల్ని ధారాదత్తం చేసిన పీవీ- స్వీయ ఆదర్శానికి కట్టుబాటు చాటిన వితరణ శీలి!.

పీవీ జీవితం: సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా...

బహుభాషా కోవిదుడిగా వాసికెక్కినా, అరవయ్యోపడిలో కంప్యూటర్‌ కోడింగ్‌ నేర్చుకొన్నపీవీజిజ్ఞాస నేటి తరానికి ఆదర్శప్రాయం. కేంద్రంలో విదేశీ, హోం, రక్షణ, మానవ వనరుల అభివృద్ధి శాఖల్ని నిభాయించిన పూర్వ అనుభవం భిన్నరంగాల్లో కొత్త పుంతలు తొక్కడానికి పీవీకి ఎంతగానో అక్కరకొచ్చిందన్నది నిజం. చిరమిత్ర దేశం సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన నేపథ్యంలో తూరుపు వాకిలి (లుక్‌ ఈస్ట్‌ పాలసీ) తెరిచి, ఇజ్రాయెల్‌తో చెలిమికి మొగ్గి, అమెరికాకు దగ్గరగా జరిగి విదేశాంగ విధానాన్నీ సంస్కరించిన ఘనత పాములపర్తి వారిదే. సంస్కరణలతో సంపద పెంచి, పేదసాదల అభ్యున్నతికి విశిష్ట పథకాలు రూపొందించాలన్న ఆలోచనా ఆయనదే.

'1991 తరవాత మొత్తం ప్రపంచమే మారిపోయింది ప్రస్తుత తరం ఉద్దేశాలేమిటో గ్రహించి వాటికి అనుగుణంగా మనమే మారాలి.. చూడబోతే గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా ఉంది' అని సరళీకరణ విధానాల అమలుపై 2003లో పీవీ ఆవేదనతో స్పందించారు. జాతిహితమే పరమావధిగా సాగాల్సిన సంస్కరణలకూ రాజకీయ గ్రహణం పడుతున్న దురవస్థే కళ్లకు కడుతోందిప్పుడు! సహస్ర చంద్రోదయాల్ని చూసి, అశేష శేముషీ విభవంతో జీవితాన్ని పండించుకొని దేశ పథగమనాన్నే అనుశాసించిన పీవీ- తెలుగు జాతి అనర్ఘరత్నం; ఆయన ఖ్యాతి అజరామరం.

చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ'

ABOUT THE AUTHOR

...view details