ETV Bharat / bharat

దేశం ఆకలి తీర్చిన శాస్త్రవేత్త- హరిత విప్లవ పితామహుడికి భారత రత్న

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 1:22 PM IST

Updated : Feb 9, 2024, 2:03 PM IST

MS Swaminathan Bharat Ratna : హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్‌ను భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. మరణానంతరం స్వామినాథన్‌కు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఆహార కొరత నుంచి స్వయం సమృద్ది సాధించే దిశగా దేశం తీసుకున్న అనేక నిర్ణయాల్లో స్వామినాథన్‌ కీలకపాత్ర పోషించారు.

ms swaminathan bharat ratna
ms swaminathan bharat ratna

MS Swaminathan Bharat Ratna : ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన వ్యక్తి. రైతులకు గిట్టుబాటు ధర మొదలు, వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణలకు నిరంతరం కృషిచేసిన హరిత విప్లవ పితామహుడు. వ్యవసాయ స్వయంసమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, దేశ వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చిన కర్షక పక్షపాతి. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌. తాజాగా ఆయనకు మరణానంతరం ప్రతిష్ఠాత్మక భారత రత్న పురస్కారం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్థానం ఓసారి చూద్దాం.

వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగానికి
MS Swaminathan Biography : 1925 ఆగస్టు7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు స్వామినాథన్. ప్రాథమిక విద్యను స్థానిక పాఠశాలలో పూర్తిచేశారు. తర్వాత కుంభకోణంలో మెట్రిక్యులేషన్ చదివారు. తండ్రి వైద్యుడు కావడం వల్ల మెడికల్ పాఠశాలలో చేరిన స్వామినాథన్‌, 1943 నాటి భయంకరమైన బంగాల్​ కరవును చూసి చలించిపోయారు. దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వైద్యరంగం నుంచి వ్యవసాయ రంగానికి మారిపోయారు. కేరళ త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో జువాలజీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. తర్వాత మద్రాస్ వ్యవసాయ కళాశాలలో చేరి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేశారు.

1954లో భారత్​కు తిరిగి వచ్చి
MS Swaminathan Education : 1949లో దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో సైటోజెనెటిక్స్‌లో పీజీ చేశారు. యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని వాగెనేంజెన్ అగ్రికల్చర్ యూనివర్శిటీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ విభాగంలో బంగాళాదుంపల జన్యువులపై పరిశోధన చేశారు. సోలానమ్ విస్తృతమైన అడవి జాతుల నుంచి బంగాళాదుంపకు జన్యువులను బదిలీ చేసే విధానాలను ప్రామాణీకరించడంలో స్వామినాథన్​ విజయం సాధించారు. ఆ తర్వాత 1950లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్లాంట్ బ్రీడింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి పీహెచ్​డీ చేశారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం, జెనెటిక్స్ శాఖ వద్ద పోస్ట్ డాక్టరల్ పరిశోధన చేశారు. 1954లో భారతదేశానికి తిరిగి వచ్చి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్తగా పరిశోధనలు మొదలుపెట్టారు.

వరి, గోధుమ మొదలైన పంటలపై
MS Swaminathan Inventions : తన పరిశోధనలతో వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేశారు. వరి, గోధుమ మొదలైన పంటలపై ఆయన చేసిన పరిశోధన వల్ల భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించింది.

ఎన్నో పదవులను అలంకరించి
About MS Swaminathan in Telugu : స్వామినాథన్ ఎన్నో పదవులను సమర్ధంగా నిర్వహించారు. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ జనరల్ డైరక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1979 నుంచి 1980 వరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరక్టర్ జనరల్‌గా పని చేశారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశారు. 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా "టైం 20" లో స్వామినాథన్​ పేరును టైమ్‌ మ్యాగజైన్ ప్రచురించింది.

దేశ అత్యుత్తమ పురస్కారాలను
MS Swaminathan Award List : వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యుత్తమ పురస్కారాలను అందించింది. 1989లో పద్మవిభూషణ్‌ అవార్డును ఆయన అందుకున్నారు. 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్‌ పురస్కారాలతో కేంద్రం సత్కరించింది. 1971లో రామన్‌ మెగసెసే అవార్డును అందుకున్నారు. 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అవార్డు స్వామినాథన్‌ను వరించింది. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 2013లో ఇందిరాగాంధీ సమైక్యత పురస్కారాన్ని స్వామినాథన్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన్ను భారత అత్యున్నత పురస్కారం భారత రత్నతో మరణాంతరం సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

'స్వామినాథన్​ సేవలు అమోఘం'
వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధనతోపాటు ఆధునీకరణకు డాక్టర్ స్వామినాథన్‌ విశేషంగా కృషి చేసినట్లు మోదీ తెలిపారు. "వ్యవసాయ రంగంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్​ స్వామినాథన్​కు భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. వ్యవసాయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు. స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా దేశ ఆహార భద్రతతోపాటు శ్రేయస్సుకు హామీ ఇచ్చింది" అని మోదీ ట్వీట్​ చేశారు.

Last Updated :Feb 9, 2024, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.