తెలంగాణ

telangana

హైదరాబాద్​లో ఇంటి ఓనర్లకు బిగ్ అలర్ట్ - అలా చేశారంటే భారీ జరిమానా చెల్లించుకోక తప్పదు! - GHMC Key Decision for House OWners

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 6:03 PM IST

GHMC Key Decision for House Owners : సమ్మర్ స్టార్ట్ కావడంతో నగరంలో నీటి వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకొని నీటి కొరత ఏర్పడకుండా, బెంగళూరు పరిస్థితులు తలెత్తకుండా జీహెచ్​ఎంసీ అధికారులు అప్రమత్తమయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎవరైతే నీటిని వృథా చేస్తారో ఆ ఇంటి ఓనర్లకు భారీ మొత్తంలో జరిమానా విధించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

House Owners
GHMC

GHMC Ready to Impose Water Waste Fine : రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ లోనే మునుపెన్నడూ లేని విధంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదులు, చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్​కి చేరుకున్నాయి. దాంతో సాగు నీరు సంగతి అటుంచితే.. సమ్మర్​లో తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో చాలా ప్రాంతాలలో ఇప్పటికే నీటి ఎద్దడి నెలకొంది.

ముఖ్యంగా నీటి కొరత కారణంగా పొరుగు రాష్ట్రం కర్ణాటక, బెంగళూరులోని ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. రోజుకు సుమారు 50 కోట్ల లీట‌ర్ల నీటి కొర‌త‌తో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నీటి ఎద్దడి కారణంగా అక్కడి కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నీటిని వృథా చేసినట్టు తెలిస్తే పెద్దమొత్తంలో జరిమానా విధిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్​లోని జీహెచ్​ఎంసీ(GHMC) అధికారులు అప్రమత్తమయినట్లు సమాచారం. ముందే మేల్కొని బెంగళూరు పరిస్థితులు తలెత్తకుండా, నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

బల్దియాలో భారీ కుంభకోణం - బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై అక్రమంగా వాణిజ్య ప్రకటనలు

ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మేలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా చాలా పొదుపుగా నీటిని వాడుకోవాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నా.. నగర వాసుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్​లోని చాలా కాలనీలు, అపార్ట్​మెంట్​లు, బస్తీల్లో రోడ్లపై నీళ్లు చిన్నపాటి కాలువలా వృథాగా పారుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకున్న జీహెచ్ఎంసీ.. నీళ్లు వృథా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణను మొదలు పెట్టినట్లు సమాచారం.

ముఖ్యంగా నగరంలో ఎవరైతే నీళ్లను వృథా చేస్తున్నారో.. ఆ ఇంటికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.5 వేలు ఫైన్ విధించనున్నట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకోవడం కోసం రోజూ ఉదయం పూట కాలనీలు, బస్తీలు, అపార్ట్​మెంట్ల వద్దకు వెళ్తారని సమాచారం. ఎక్కడైతే నీరు వృథాగా పోతున్నట్లు కనిపిస్తే.. ఆ ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫొటోలు తీసి.. ఆ తర్వాత సదరు ఇంటి యజమానులకు జరిమానాను విధిస్తారట. ఈ మేరకు ఇప్పటికే నగరవ్యాప్తంగా అందుకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారని సమాచారం. నీటి వృథాను నివారించకపోతే హైదరాబాద్​లోనూ బెంగళూరు పరిస్థితులు తలెత్తడానికి చాలా కాలం పట్టకపోవచ్చని, అందుకే నీటి వృథాను అరికట్టేందుకు ఈ విధమైన కఠిన చర్యలు తీసుకోవడానికి GHMC, జలమండలి అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ముఖ్యనగరాల్లో నీటి కొరత - చర్యలు చేపట్టకపోతే అంతే సంగతి - Water Crisis in India

ABOUT THE AUTHOR

...view details