ETV Bharat / state

ముఖ్యనగరాల్లో నీటి కొరత - చర్యలు చేపట్టకపోతే అంతే సంగతి - Water Crisis in India

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 25, 2024, 1:55 PM IST

Water Problem in India
India Popular Cities Facing Water Crisis

India Popular Cities Facing Water Crisis : వేసవి వచ్చిందంటే ప్రధానంగా వినిపించే సమస్య నీటి కొరత. ముఖ్యంగా నగరాలు ఎండాకాలంలో నరకం చవి చూడాల్సిందే. వేసవి రాకముందే బెంగళూరు మహా నగరం ఎదుర్కొంటున్న సమస్య అంతా చూస్తున్నదే. అయితే ఒక్క బెంగళూరు మాత్రమే కాదు, దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో నీటి కొరతతో సతమతం అవుతున్నాయి. గత వర్షాకాల సీజన్‌లో వానలు సరిగా కురవకపోవడం, ఆ తర్వాత కూడా వరుణుడు కరుణించకపోవడంతో అనేక నగరాలు నీటి సంక్షోభం ముంగిట నిలిచాయి. మరి ఎండలు దంచికొడుతున్న తరుణంలో నీటి కొరతను అధిగమించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ప్రత్యామ్నాయాలతో నీటి సంక్షోభాన్ని అధిగమించవచ్చు.

భారత్​ ముఖ్యనగరాల్లో నీటి కొరత చర్యలు చేపట్టకపోతే అంతే సంగతి

India Popular Cities Facing Water Crisis : మనిషి కనీస అవసరాల్లో ఒకటైన నీరు పేరు చెబితే ప్రజలకు కన్నీరు వస్తోంది. నీటి కొరతతో బెంగళూరు పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నా దేశంలోని అనేక నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. దేశ రాజధాని దిల్లీ సహా ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, జైపూర్ సహా అనేక నగరాల్లో ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోకుంటే జల ఘోషతో దేశంలోని అనేక నగరాలు విలవిలలాడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

దేశానికి వాణిజ్య రాజధాని ముంబయి. ఈ నగరానికి చుట్టుపక్కల ఏడు చెరువుల నుంచి నీటి సరఫరా జరుగుతుంది. అయితే అవి అడుగంటిపోవడంతో ముంబయి నగరం నీటి కొరత ముప్పున నిలిచి ఉంది. గత ఏడాది వానాకాలంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో జలాశయాలు నిండలేదు. దీంతో ఇప్పటి వరకు ఉన్న నిల్వలు అన్నింటినీ వాడుకోవడంతో అవి ఖాళీ అయ్యాయి. నిల్వలన్నీ చివరి దశకు చేరుకోవడంతో బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు సరఫరాలో కోతలు విధిస్తున్నారు. దీనికి తోడు పెరిగిన పట్టణీకరణ, మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా మారడంతో ముంబయిలో నీటి కొరత ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

Water Problem in Rajasthan : ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర రాజధాని జైపూర్‌ ఇప్పటికే నీటి కొరతతో అల్లాడుతోంది. జైపూర్‌ నీటి అవసరాల కోసం రామ్‌ఘర్‌ జలాశయంపై ఆధారపడుతోంది. 20శతాబ్దంలో నిర్మించిన ఈ డ్యామ్‌ కాలక్రమంలో దెబ్బతింటూ వస్తోంది. ఎక్కువ నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో సాధారణ సమయంలోనే నీటి కొరత ఏర్పడుతుండగా, ఇప్పుడు వేసవి రావడంతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

ఆ కాలనీలో 25 ఏళ్ల నుంచి నో వాటర్ ప్రాబ్లమ్ - ఎందుకో తెలుసా? - Precautions to Avoid Water Crisis

తమిళనాడు రాజధాని చెన్నై నగరం కూడా నీటి సంక్షోభం ముంగిట నిలిచింది. 14వందల మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం కురిసినా ఇటీవల కాలంలో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ పెరగడంతో నీటి కష్టాలు పెరిగాయి. ప్రతి నిత్యం పది మిలియన్‌ లీటర్లను సరఫరా చేస్తుండగా అవి నగరవాసుల అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. చెన్నై మహానగరానికి నీరు అందించే ఆరు జలాశయాల్లో 8వేల 384మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల కంటే ఎక్కువ నీరు ఉందని, 8నెలల వరకు అవసరాలు తీరుతాయని చెన్నై జలమండలి అధికారులు తెలిపారు. ఇటీవల నెమ్మెలిలో 150 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసే కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి ఇలా ఉన్నా ఎండలు ముదిరితే చెన్నైలో నీటి కొరత ముదిరే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.

రాజధానిలో ఇది పరిస్థితి : దేశానికి రాజధాని అయినా దిల్లీ నగరాన్ని నీటి కొరత వీడడం లేదు. దిల్లీకి 60శాతం నీటిని యమునా నది నుంచి జల్‌బోర్డు సరఫరా చేస్తోంది. మిగతా అవసరాలకు బోర్లపై ఆధారపడతారు. అయితే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అనేక బోర్లలో నీరు రావడం లేదు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూకు కూడా నీటి కొరత ప్రమాదం ఏర్పడింది. లఖ్‌నవూకు గోమతి, దాని ఉప నదుల నుంచి నీటి సరఫరా జరుగుతూ ఉండగా అవి ఎండిపోయాయి.

పంజాబ్‌లోని భటిండా నగరం కూడా తీవ్ర తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. అయితే సాగు అవసరాలకు ఎక్కువ నీటిని వినియోగిస్తూ ఉండడంతో తాగు నీటికి కొరత ఏర్పడింది. ఇలా దేశంలోని ఆరు ప్రధాన నగరాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఎండలు పెరిగితే సమస్య ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తోంది.

కేంద్ర జలసంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 150 జలాశయాల్లో నీటి నిల్వలు వాటి సామర్థ్యంలో 38శాతానికి పడిపోయాయి. ఇది గత దశాబ్ద కాలపు సగటు కంటే తక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 150 రిజర్వాయర్ల పూర్తి సామర్థ్యం సుమారు 178 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు కాగా ప్రస్తుతం 67బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు మాత్రమే ఉంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర, బిహార్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడులోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గత ఏడాది ఈ సమయంతో పోలిస్తే పడిపోయాయి. దేశవ్యాప్తంగా జలాశయాల్లో గత ఏడాదితో పోలిస్తే 84శాతం, దశాబ్ద కాలపు సగటుతో పోలిస్తే 93శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

నీటితోనే శాంతి సాకారం అంటున్న ఐరాస - మరి రాష్ట్రంలో నీటి సరఫరా వ్యవస్థల సామర్థ్యం ఎంత? - Prathidhwani Debate on Water Issue

వెేలల్లో ఎండిపోయిన బోర్లు : దక్షిణ భారతంలోని 42 ప్రధాన జలాశయాల్లో నిల్వ సామర్థ్యం 53 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు. కాని ప్రస్తుతం 12 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతున్న బెంగళూరులో రోజువారీ నీటి డిమాండ్‌ 2వేల 6వందల మిలియన్‌ లీటర్లు కాగా, ప్రస్తుతం 2వేల 120మిలియన్‌ లీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది. బెంగళూరులో 14వేల బోరుబావులు ఉండగా, అందులో ఇప్పటికే 6వేల 9వందల బోరు బావులు ఎండిపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాలు కూడా నీటి కొరతతో అల్లాడుతున్నాయి. విజయవాడ, ఒంగోలు, అనంతరపురం, కడప పట్టణాల్లో బిందె నీరు దొరికితే గగనం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కృష్ణా నది చెంతనే ఉన్నా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. జక్కంపూడి జేఎస్​ఎస్​యూఆర్​ఎమ్​ కాలనీకి నీరు రావడం లేదని ఇటీవల స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుణదల ప్రాంతంలోనూ తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.

'సగం బోర్లు ఎండిపోయాయి, రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత'- బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం

కడపలో నీటి సమస్యపై ఏకంగా అధికార వైకాపా కార్పొరెటర్లే ఉద్యమ బాట పట్టారు. మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నీళ్లు రావడం లేదని నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కడపలో నాలుగు లక్షల జనాభాకు రోజూ 52మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేయాలి. తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం అమృత్‌-2లో భాగంగా రూ.68కోట్లను కేటాయించింది. 2017లో గుత్తేదారుకు పనులు కేటాయించినా ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం బిల్లులను సరిగా చెల్లించకపోవడంతోనే పరిస్థితి ఇలా తయారైంది.

దేశవ్యాప్తంగా వేసవిలో నీటి కొరత అన్నది ప్రతి ఏటా ఉండేదే. ఈ సమస్య వస్తుంది అని తెలిసినా ముందుచూపులేని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య ప్రతి ఏడాది ఉత్పన్నం అవుతోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే దేశంలోని అనేక నగరాలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. తమ నిర్లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజలను బలి చేస్తున్నాయి.

మరి ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరాన్ని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి. ప్రధానంగా బెంగళూరు నగరంలోని నీటి ఎద్దడి మాత్రమే పైకి కనిపిస్తున్నా దేశంలోని అనేక ప్రధాన నగరాలు సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకపోతే భవిష్యత్తుల్లో సమస్య మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజలు కూడా తమ వంతుగా బాధ్యత తీసుకుని నీటి పొదుపును పాటిస్తే సమస్య ఎంతో కొంత తీరేందుకు అవకాశం ఉంది.

జల సంరక్షణపై బాధ్యత గుర్తు చేసిన హైకోర్టు - ప్రభుత్వం ఏ విధమైనా చర్యలు తీసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.