తెలంగాణ

telangana

తుక్కుగూడ జన జాతర సభ - దేశానికి దిశా నిర్దేశం చేయబోతోంది : భట్టి విక్రమార్క - JANA JATHARA SABHA IN TUKKUGUDA

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 6:54 PM IST

Updated : Apr 4, 2024, 7:26 PM IST

Janagarjana Sabha in Tukkuguda : దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్‌ను గత పాలకులు వ్యక్తిగతంగా వినియోగించారని, భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తుక్కుగూడలో జరిగే జన జాతర సభ దేశానికి దిశా నిర్దేశం చేయబోతోందన్నారు.

Bhatti reacts on Phone tapping
Janagarjana Sabha in Tukkuguda

Janajathara Sabha in Tukkuguda : కదం తొక్కుదాం, కాంగ్రెస్ తడాఖా దేశానికి చాటుదామంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Minister Bhatti) పిలుపునిచ్చారు. తుక్కుగూడలో జరిగే జన జాతర సభ, దేశానికి దిశా నిర్దేశం చేయబోతోందని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ ఆయన తుక్కుగూడలో సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే తుక్కుగూడ సభ చారిత్రాత్మకం కానుందని, లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను జన జాతర సభ నుంచే ఏఐసీసీ ప్రకటించనుందని పేర్కొన్నారు.

పదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా? : భట్టి విక్రమార్క - Bhatti Vikramarka Fires on BRS

Bhatti reacts on Phone tapping : దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను, గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని మంత్రి భట్టి దుయ్యబట్టారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా విన్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు.

అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదని మంత్రి భట్టి ఎద్దేవా చేశారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు, గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని ప్రశ్నించారు. జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కేసీఆర్ ఒడిసి పట్టలేదని, అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందికి వదిలారని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ లోపంతో కాళేశ్వరంలో గోదావరి నీటిని కిందికి వదలాల్సి వచ్చిందని, కేసీఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుందో, తెలంగాణ మోడల్‌గా తుక్కుగూడలో ఏఐసీసీ నాయకత్వం సందేశం ఇవ్వబోతోందని మంత్రి భట్టి పేర్కొన్నారు. హామీల అమలులో ఒక్కరోజు ఆలస్యమైనా ఆలస్యమేనని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చామన్నారు. నిరుపేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్‌లోని థేమ్స్ నదిని మరిపించే ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి భట్టి తెలిపారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టరాని, ధరణి వ్యవస్థను సర్వనాశనం చేసి రైతులను ఇబ్బంది పెడితే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నామన్నారు. కేసీఆర్ ఫామ్​హౌస్​లో మూడు నెలలు పడుకొని బయటికి వచ్చి, కరెంటు లేదంటూ మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్​కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారని మండిపడ్డారు.

"దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను, గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా విన్నారు. ఈవ్యవహారంపై పద్దతి ప్రకారం విచారణ జరుగుతోంది". - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం

తుక్కుగూడ జన జాతర సభ - దేశానికి దిశా నిర్దేశం చేయబోతోంది : భట్టి విక్రమార్క

ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టొద్దు : భట్టి విక్రమార్క

బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ

Last Updated : Apr 4, 2024, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details