తెలంగాణ

telangana

లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్న కమలం - కిషన్​ రెడ్డి వైఖరే కారణం! - Lok sabha election 2024

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 9:22 AM IST

Telangana BJP President Kishan Reddy Election Campaign : రాష్ట్రంలో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో కలిసొచ్చే అవకాశాలున్నా, వాటిని అందిపుచ్చుకోవడంలో కమలం పార్టీ విఫలమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వైఖరేనని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రాష్ట్రమంతా తిరగాల్సిన కిషన్ రెడ్డి, కేవలం సికింద్రాబాద్‌కే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో చమటోడుస్తున్న మిగతా 16 మంది అభ్యర్థులు అగ్ర నేతల ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Telangana BJP President Kishan Reddy Election Campaign
Telangana BJP President Kishan Reddy Election Campaign

కిషన్​ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సర్వత్రా విమర్శలు - అసలు కారణం ఏంటి?

Telangana BJP President Kishan Reddy Election Campaign :కేంద్రంలో మూడోసారి అధికారంతో పాటు 400 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ నుంచి రెండంకెల స్థానాలు గెలవాలని భావిస్తోంది. రాష్ట్రం నుంచి ఆశిస్తున్న సీట్లు పొందేందుకు సానుకూల వాతావరణం ఉన్నా, దానిని అభ్యర్థుల విజయం కోసం మలచుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్​ఎస్ (BRS)​ ఈ ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం లేదని, ఆ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కిషన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్, బీఆర్​ఎస్​ మీద ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మల్చుకోవడంలో విఫలమవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిన కిషన్ రెడ్డి, కేవలం తన పార్లమెంట్ (Lok Sabha Election 2024) పరిధికే పరిమితమయ్యారని, ఎన్నికల ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు ఏమాత్రం వెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధ్యక్షుడిపై పార్టీ శ్రేణులు ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్​కే పరిమితమైన కిషన్​ రెడ్డి : అయితే సార్వత్రిక ఎన్నికల్లో కిషన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఇతర లోక్‌సభ స్థానాల్లో ప్రచారానికి సమయం కుదరడం లేదనేందుకు అవకాశం లేకపోలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని కిషన్‌రెడ్డి (Kishan Reddy Campaign) అప్పుడు కూడా గ్రేటర్‌ పరిధి దాటి ప్రచారానికి వెళ్లింది తక్కువేనని పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై అప్పట్లో కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అసెంబ్లీ ఎన్నికల ముందు ఉపన్యాసాలు తప్పితే, హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో జాతీయ స్థాయి నేతల సభలకు మినహా కిషన్‌రెడ్డి పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కిషన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగుతున్నారు. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత వల్ల సికింద్రాబాద్ పరిధి దాటి ఎక్కడికీ వెళ్లడం లేదనే చర్చ జోరుగా జరుగుతోంది.

గ్రౌండ్​ లెవెల్​లో బీజేపీ పట్టు కోల్పోయింది : మంత్రి కొండా సురేఖ

BJP Election Campaign in Telangana : కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆలోచనతో తన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నియోజకవర్గానికే పరిమితమయ్యారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇతర పార్లమెంట్ సెగ్మెంట్లలో కిషన్ రెడ్డి పెద్దగా ప్రచారానికి వెళ్లకపోవడంతో తీవ్రంగా శ్రమిస్తున్న ఆయా అభ్యర్థులు, జాతీయ నేతల ప్రచారం (BJP National Leaders Campaign)పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తమ తమ నియోజకవర్గాలకే పరిమితమైన కమలం నేతలు : ఇటీవల జరిగిన హైదరాబాద్, భువనగిరి పార్లమెంట్ బూత్ స్థాయి సమ్మేళనాలకు కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హాజరుకాలేదు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన సమావేశానికి మాత్రం హాజరయ్యారు. అది కూడా అభ్యర్థి విన్నపం మేరకు హాజరైనట్లు సమాచారం. శాసనసభ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ తన సెగ్మెంట్‌తో పాటు ఇతర సెగ్మెంట్లలోనూ ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో మాత్రం సొంత నియోజకవర్గం కరీంనగర్​కే పరిమితం అయ్యారు.

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం మెదక్ ప్రచారానికి మినహా మరెక్కడికీ వెళ్లలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన కూడా కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నట్లు ఈటల సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇతర సెగ్మెంట్ల ప్రచారానికి వెళ్లకుండా పూర్తిస్థాయిలో ఎవరి ప్రచారంలో వారు నిమగ్నమయ్యారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

2028లో 100కు పైగా సీట్లు గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు

ABOUT THE AUTHOR

...view details