తెలంగాణ

telangana

ఆరోసారి నిర్మలమ్మ పద్దు- చరిత్రలో రెండో మహిళ- మొరార్జీ దేశాయ్‌ తర్వాత ఈమే!

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 5:32 PM IST

Nirmala Sitharaman Budget 2024 : భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించనున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మల రికార్డు నెలకొల్పనున్నారు. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించిన ఆమె, ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఘనత సాధించనున్నారు.
ఇప్పటికే వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్‌సింగ్‌ను నిర్మలా సీతారామన్​ అధిగమించనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుంది. తద్వారా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు నిధులను వెచ్చించడానికి సర్కార్‌కు వెసులుబాటు ఉంటుంది.
ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌లో విధానపరమైన ప్రకటనలేమీ ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈవిషయాన్ని సీతారామన్‌ గతనెల ఓ సందర్భంలో స్పష్టంచేశారు.
ఓటాన్‌ అకౌంట్‌కు ఆమోదం లభిస్తే ఏప్రిల్-జులై కాలానికి కావాల్సిన నిధులను ప్రో-రేటా ప్రాతిపదికన భారత సంఘటిత నిధి నుంచి ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది.
కొత్త ప్రభుత్వం కొలువుదీరాక 2024-25కు గానూ జూన్‌లో తుది బడ్జెట్‌ను తీసుకొస్తారు.
2014లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్‌ జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
2014-15 నుంచి 2018-19 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి నెల చివరిరోజున బడ్జెట్‌ను తీసుకొచ్చే బ్రిటిష్‌ కాలం నాటి సంప్రదాయానికి స్వస్తి పలికి ఒకటో తారీఖుకు మార్చిన ఘనత జైట్లీదే.
ఆ తర్వాత జైట్లీ అనారోగ్యానికి గురవటం వల్ల పీయూష్‌ గోయల్‌ ఆర్థికమంత్రి బాధ్యతలు తీసుకుని 2019-20 మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందుంచారు.
2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు.
ఎప్పటిలా సూట్‌కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
కొవిడ్‌ సంక్షోభ సమయంలో పేద వర్గాల కోసం అనేక ఉపశమన పథకాలను ప్రవేశపెట్టారు.
ఆమె హయాంలో అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ కొనసాగుతోంది.
మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఆర్థికశాఖ మంత్రి ఆర్‌.కె.షణ్ముగం చెట్టి తొలి బడ్జెట్‌ను పార్లమెంట్‌ ముందుకుతీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details