తెలంగాణ

telangana

డొనాల్డ్ ట్రంప్​నకు భారీ ఊరట- అనర్హత వేటును ఎత్తేసిన సుప్రీంకోర్టు

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 6:55 AM IST

Trump Colorado Supreme Court : అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో దూసుకెళ్తోన్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడిని ట్రంప్‌ ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని పేర్కొంటూ కొలరాడోలో జరిగే రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గతేడాది ఆయనపై వేసిన అనర్హతను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది.

Trump Colorado Supreme Court
Trump Colorado Supreme Court

Trump Colorado Supreme Court :అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేపట్టాలనుకుంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2021లో క్యాపిటల్‌ భవనంపై దాడికి ప్రేరేపించారన్న కారణంతో కొలరాడో రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీలో పోటీ చేయకుండా ఆ రాష్ట్ర న్యాయస్థానం ఆయనపై విధించిన అనర్హత వేటును సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని సెక్షన్‌ 3 ప్రకారం వేటు వేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని, కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని తొమ్మిది మంది న్యాయమూర్తులు ఏకగ్రీవంగా పేర్కొన్నారు.

ఈ తీర్పుతో ఒక్క కొలరాడోలోనే కాదు, ఇలినోయీ, మైన్‌లో కూడా ట్రంప్‌ అభ్యర్థిత్వంపై ఆంక్షలు తొలగిపోయినట్లైంది. మాజీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా కొలరాడోలో వ్యాజ్యం వేసిన పిటిషనర్లకు మద్దతుగా నిలిచిన సిటిజన్స్‌ ఫర్‌ రెస్పాన్సిబులిటీ అండ్‌ ఎథిక్స్‌ సంస్థ మాత్రం తీర్పుతో ఏకీభవించలేదు. 'క్యాపిటల్‌ భవనంపై హింసకు ట్రంప్‌ ప్రేరేపించారని తీర్మానించేందుకు కోర్టుకు అవకాశం లభించింది. దాన్ని వదులుకొంది. అందుకు బదులుగా 14వ సవరణలోని సెక్షన్‌ 3ని ఉపయోగించే అధికారం రాష్ట్రాలకు లేదని పేర్కొంది' అని తెలిపింది.

ట్రంప్​పై అభియోగాలు
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్‌ ఓడిపోయినప్పుడు బైడెన్‌ను అడ్డుకోవడానికి 2021 జనవరి 6న రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారులు యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడికి దిగారు. వారిని ట్రంప్‌ సమర్థించారని, హింసను ప్రేరేపించారన్న అభియోగాలపై ఇటీవల కొలరాడో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశాధ్యక్ష పదవికి ఆయన అనర్హుడని తేల్చింది.

పోలీసుల ఎదుట లొంగిపోయిన ట్రంప్ మాజీ సీఎఫ్​ఓ
మరోవైపు, డొనాల్డ్ ట్రంప్​ సివిల్ ఫ్రాడ్ కేసులో అసత్య సాక్ష్యం ఇచ్చానని మాజీ సీఎఫ్​ఓ అలెన్ వీసెల్​బర్గ్​ మన్​హట్టన్ ప్రాసిక్యూటర్ ఎదుట అంగీకరించారు. ఈ మేరకు ఆయన న్యూయార్క్ కోర్టులో లొంగిపోయారు. కాగా, ట్రంప్‌ తన ఆస్తుల మొత్తాన్ని వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. కొన్నేళ్ల పాటు ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details