తెలంగాణ

telangana

ఆస్ట్రేలియా వీసాల కోసం ఇక టోఫెల్ స్కోర్ ఓకే- విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ - Australia Valids TOEFL Score

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 7:10 PM IST

Australia Valids TOEFL Score : టోఫెల్ స్కోర్లు ఇకపై అన్ని ఆస్ట్రేలియన్ వీసాల జారీ ప్రక్రియలో చెల్లుబాటు కానున్నాయి. ఈ విషయాన్ని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. 2024 మే 5న లేదా ఆ తర్వాత రాసిన టోఫెల్ పరీక్షల స్కోర్లను వీసాల జారీ విషయంలో పరిగణనలోకి తీసుకుంటామని ఈటీఎస్ వెల్లడించింది.

Australia Valids TOEFL Score
Australia Valids TOEFL Score (ANI)

Australia Valids TOEFL Score :ఆంగ్ల భాషా సామర్థ్య పరీక్ష 'టోఫెల్' (TOEFL) స్కోర్లు ఇకపై అన్ని ఆస్ట్రేలియన్ వీసాలకు చెల్లుబాటు అవుతాయని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. వాస్తవానికి టోఫెల్ స్కోర్ల చెల్లుబాటును గతేడాది జులైలో ఆస్ట్రేలియా హోం శాఖ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీంతో ఇప్పటివరకు వీసాల జారీలో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చారు. 2024 మే 5న లేదా ఆ తర్వాత రాసిన టోఫెల్ పరీక్షల స్కోర్లను వీసాల జారీ విషయంలో పరిగణనలోకి తీసుకుంటామని ఈటీఎస్ వెల్లడించింది.

'టాప్​100 గ్లోబల్​ యూనివర్సిటీల్లో 9 ఆస్ట్రేలియావే'
"గత సంవత్సరం నాటికి ఆస్ట్రేలియాలో 1.2 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీల్లో తొమ్మిది ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందిస్తోంది" అని ఈటీఎస్ ఇండియా, దక్షిణాసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ తెలిపారు.

టోఫెల్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు
టోఫెల్ అనేది ఇంగ్లిష్ మాట్లాడే విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ కోరే స్థానికేతరుల ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఒక ప్రామాణిక పరీక్ష. ఈ పరీక్షను 160కి పైగా దేశాల్లోని 12,500 కంటే ఎక్కువ విద్యా సంస్థలు ఆమోదం తెలిపాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​లోని చాలా వర్సిటీలు, బ్రిటన్‌లోని 98 శాతానికిపైగా వర్సిటీల్లో విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే క్రమంలో టోఫెల్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.

పరీక్షల్లో మార్పులు చేసిన ఈటీఎస్​
గతేడాది టోఫెల్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సరళీకృతంతో పాటు పలు మార్పులు చేసింది ఈటీఎస్​. ఈ పరీక్షలో రీడింగ్‌ సెక్షన్‌ను కుదించడమే కాకుండా స్వతంత్రంగా రాసే టాస్క్‌ స్థానాన్ని అకడమిక్‌ డిస్కషన్‌ కోసం రాసే విధానంతో భర్తీ చేసినట్టు తెలిపింది. స్కోరు చేయని ప్రశ్నలను పరీక్ష నుంచి తొలగించనున్నట్లు చెప్పింది. గతంతో పోలిస్తే వేగంగా, మరింత సులభంగా TOEFL iBT పరీక్ష కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ఈటీఎస్​ తెలిపింది.

భారతీయులకు అమెరికా గుడ్‌న్యూస్‌- ఆ వీసాదారులపై ఆంక్షల ఎత్తివేత!

జోరు మీదున్న అమెరికా- ఏడాదిలో భారతీయులకు 14లక్షల వీసాలు జారీ

ABOUT THE AUTHOR

...view details