తెలంగాణ

telangana

అరేబియా సముద్రంలో నౌక హైజాక్​- రంగంలోకి INS సుమిత్ర- 17 మంది సేఫ్

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 3:13 PM IST

Updated : Jan 29, 2024, 3:46 PM IST

Ship Hijack Somalia : భారత నౌకా దళం మరోసారి తన సత్తాను చాటింది. అరేబియన్‌ సముద్రంలో ఇరాన్‌కు చెందిన మత్స్యకార ఓడను సొమాలియాకు చెందిన సముద్రపు దొంగల బారి నుంచి రక్షించింది. సముద్రపు దొంగలను నిరాయుధులను చేసి వారిని సొమాలియా వైపు తరిమికొట్టింది. ఓడలోని 17 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించింది.

Ship Hijack Somalia
Ship Hijack Somalia

Ship Hijack Somalia :అరేబియన్‌ సముద్రంలో సొమాలియాకు చెందిన సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌కు చెందిన మత్స్యకార ఓడ ఇమాన్‌ను హైజాక్‌ చేశారు. అందులోని 17 మంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న భారత నౌకా దళం వెంటనే ఐఎన్‌ఎస్‌ సుమిత్ర, అడ్వాన్స్‌డ్ లైట్‌ హెలికాప్టర్ ధ్రువ్‌ను రంగంలోకి దించింది.

సోమాలియా వైపునకు వెళ్లగొట్టి!
ఐఎన్‌ఎస్‌ సుమిత్ర, ధ్రువ్‌ హెలికాప్టర్‌ నౌకను చుట్టుముట్టి అందులోని సిబ్బందిని రక్షించింది. సముద్రపు దొంగలను నిరాయుధులను చేసి వారిని సోమాలియా వైపునకు వెళ్లగొట్టింది. అనంతరం ఇరాన్‌ నౌకను తన ప్రయాణానికి అనుమతిచ్చింది. కొచ్చికి 700 నాటికల్‌ మైళ్ల దూరంలో ఓడను సముద్రపు దొంగలు హైజాక్ చేశారని భారత నౌకా దళం తెలిపింది.

సత్తాచ చూపిన మెరైన్ కమాండోలు!
అంతకుముందు అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్‌ కమాండోలు సత్తా చూపారు. సముద్రపు దొంగల ఆట కట్టించారు. ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎం.వి.లీలా నార్‌ఫోక్‌ హైజాక్‌ అయినట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ నుంచి భారత నౌకాదళానికి సమాచారం అందింది. ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు అక్రమంగా నౌకలో ప్రవేశించారని, ఆదుకోవాలని ఆ సమాచార సారాంశం.

భారత్​ హెచ్చరికకు పరార్​!
తక్షణమే భారత నౌకాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై డిస్ట్రాయర్‌ నౌకను, ఓ యుద్ధ విమానాన్ని, డ్రోన్లను రంగంలోకి దింపింది. హైజాక్‌ అయిన నౌకలోని సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకుంది. నౌకను విడిచి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. అనంతరం భారత మెరైన్‌ కమాండర్లు ఎం.వి.లీలా నార్‌ఫోక్‌లోకి ప్రవేశించి ఒక గదిలో దాక్కున్న సిబ్బందిని కాపాడారు. అప్పటికే హైజాకర్లు పారిపోయారని భారత నౌకాదళం తెలిపింది.

కొన్నిరోజుల క్రితం, అరేబియా సముద్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. వాణిజ్య నౌకను హైజాక్ చేసిన సముద్రపు దొంగలు, భారత్ నేవీ చేసిన హెచ్చరికకు భయపడి పారిపోయారు. నౌకను హైజాక్ చేసిన సమాచారం అందిన వెంటనే INS చెన్నై యుద్ధనౌక ద్వారా గాలింపు చేపట్టిన నౌకాదళం నౌకను గుర్తించి పైరెట్లకు హెచ్చరికలు పంపింది. అనంతరం మెరైన్ కమాండోలు నౌకలోకి దిగి అందులో ఉన్న 15 మంది భారతీయులు సహా 21 మంది సిబ్బందిని కాపాడారు. ఈ పూర్తి వార్త కోసంఇక్కడ క్లిక్చేయండి.

Last Updated : Jan 29, 2024, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details