తెలంగాణ

telangana

133కు చేరిన రష్యా ఉగ్రదాడి మృతుల సంఖ్య- నెల రోజుల క్రితమే అమెరికా వార్నింగ్​! - Russia Terror Attack Death toll

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 3:56 PM IST

Updated : Mar 23, 2024, 8:13 PM IST

Russia Terror Attack Death Toll : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లో ముష్కరులు జరిపిన అమానవీయ దాడిలో ఇప్పటివరకు 115 మంది మరణించినట్లు సమాచారం. దాడికి సంబంధించి రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఇప్పటివరకు 11 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరోవైపు ఉగ్రదాడి ఘటనపై భారత్‌ సహా ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. ఉగ్రదాడి జరుగుతుందని అమెరికా నెల రోజుల క్రితమే హెచ్చరించడం గమనార్హం.

Russia Terror Attack Death toll
Russia Terror Attack Death toll

Russia Terror Attack Death Toll :రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌హాల్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 115మంది మృతిచెందారు. ఇప్పటికే కాల్పులు జరిపిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకోగా మరో 11 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్‌కు రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ తెలిపింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ దాడులకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రకటన చేసింది.

కాకస్​ సిటీ హాల్​ నుంచి ఎగసిపడుతున్న మంటలు

రష్యాలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అగ్రరాజ్యం అమెరికా నిఘావర్గాలు నెల క్రితమే హెచ్చరించాయి. అఫ్గాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఐసిస్‌ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు రష్యా నిఘావర్గాలకు చేరవేశాయి. రష్యాలోని అమెరికన్లు కూడా జాగ్రత్తగా ఉండాలని, కాన్సర్ట్‌లు, ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నాయి. రష్యా దీన్ని పెడచెవిన పెట్టింది. ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ అమెరికా హెచ్చరికలను బహిరంగంగా ఖండించారు. రష్యా సమాజాన్ని అస్థిరపరచేలా, భయపెట్టేలా అమెరికా దాని మిత్రదేశాలు ప్రకటనలు చేస్తున్నాయని ఆరోపించారు.

కాకస్​ సిటీ హాల్​ వద్ద భద్రతా సిబ్బంది పహారా

మాస్కోలోని 6వేల మంది సామర్థ్యం కలిగిన క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌హాల్‌లో ముష్కరులు చొరబడి ఒక్కసారిగా కాల్పులకు ఒడిగట్టారు. గత 2 దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గురిపెట్టి ముష్కరులు పౌరుల ప్రాణాలు తీశారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. అనంతరం అక్కడ భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. వాటిని అదుపు చేసేందుకు గంటల తరబడి అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. రష్యా వ్యాప్తంగా భద్రతను ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అన్ని ఈవెంట్లను రద్దు చేశామని, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఎలాంటి వేడుకలకు అనుమతి లేదని రష్యా నేషనల్‌ గార్డు ప్రకటించింది.

కాకస్​ సిటీ హాల్​ వద్ద అంబులెన్సులు

ఉక్రెయిన్‌ హస్తముందన్న రష్యా!
ముష్కరులకు ఉక్రెయిన్‌తో పరిచయాలు ఉన్నాయని, దాడుల అనంతరం ఆ దేశం వైపు వెళ్లేందుకు యత్నించారని రష్యా భద్రత సంస్థ (FSB) ఆరోపించింది. అయితే తమకేమీ సంబంధం లేదని ఉక్రెయిన్‌ ఖండించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలేమీ లేవని అమెరికా వెల్లడించింది. దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఇప్పటికే ప్రకటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదుకునేందుకు రక్తం, ప్లాస్మా దానానికి వందల మంది ప్రజలు బారులు తీరారని అధికారులు తెలిపారు.

తీవ్రంగా ఖండించిన భారత్
మాస్కోలో ఉగ్రదాడిని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలకు భారత్‌ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఉగ్రదాడి పిరికి పంద చర్యగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అభివర్ణించింది. క్రాకస్ సిటీ హాల్ దాడిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విచారం వ్యక్తం చేశారు. చైనా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. జాతీయభద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిస్తామని ప్రకటించారు.

'భారత్​ మాకు ఎప్పటికీ మిత్రదేశమే'- మాట మార్చిన మాల్దీవులు- రుణ విముక్తి కోసమే! - Maldives India Debt

మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం- 140కోట్ల మంది భారతీయులకు అంకితం! - modi bhutan visit

Last Updated : Mar 23, 2024, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details