తెలంగాణ

telangana

హింసతో దద్దరిల్లుతున్న POK- 'భారత్ వెంటనే జోక్యం చేసుకోవాల్సిందే!' - POK Protest Against Pakistan

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 3:15 PM IST

POK Protests : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌-POKలో వరసగా నాలుగో రోజూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి పన్నుల్లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని, గోధుమ పిండిని రాయితీ ధరకు అందించాలని జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ-JAAC చేపట్టిన ఆందోళనలు అంతకంతకూ ఉద్ధృతమవుతున్నాయి. నిరసనకారులతో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడం వల్ల ఆందోళనలు అదుపు చేసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దింపింది.

POK Protests
POK Protests (Source : ANI)

POK Protests : పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌- POK ప్రస్తుతం హింసతో దద్దరిల్లిపోతోంది. ఎలాంటి పన్నులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని దాంతో పాటు గోధుమ పిండిని రాయితీ ధరకు అందించాలని స్థానిక జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ-JAAC చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులు, POK ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగియడం వల్ల పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం నాటి హింసాత్మక ఘటనపై అంతకుముందు స్పందించిన షెహబాజ్ షరీఫ్, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడని నిరసనకారులను కోరారు.

JAAC కోర్ కమిటీ, POK ప్రాంత ప్రధాన కార్యదర్శి దావూద్ బరీచ్ మధ్య చర్చలు జరిగినప్పటికీ అవి ఓ కొలిక్కి రాలేదు. POK ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు విద్యుత్ ధరలను 50 శాతం తగ్గించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను JAAC ఇటీవలె తోసిపుచ్చింది. POKలో జల విద్యుత్ ఉత్పత్తి ధర ఆధారంగా వినియోగదారులకు ఛార్జీ విధించాలని పేర్కొంది. తమ డిమాండ్లను నెరవేర్చకుండా POK ప్రభుత్వం తప్పించుకునే వ్యూహాలు చేస్తోందంటూ ఇటు నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

కోహలా-ముజఫరాబాద్‌ మార్గంలో చాలా చోట్ల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మంగ్లా డ్యామ్‌ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సున్నితమైన ప్రదేశాలు, మార్కెట్లు, వాణిజ్య కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విద్యా సంస్థలు మూసివేశారు. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ-JAAC ఆందోళనకారుల చేతిలో శనివారం ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల్లో దాదాపు 100కి పైగా ఆందోళనకారులు, పోలీసులు గాయపడ్డారు. JAACకి చెందిన డజన్ల కొద్దీ నాయకులు అరెస్టయ్యారు. నిరాయుధులైన ప్రజలపై బలగాలు కాల్పులు జరుపుతున్నాయని ఉద్యమకారుడు అంజాద్‌ అయూబ్‌ మిర్జా ఆరోపించారు. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. POKలో పరిస్థితి చేజారిపోయిందనీ పొరుగు దేశమైన భారత్‌ దీనిలో జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. POKకు స్వాతంత్య్రం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అఫ్గాన్​లో వరద బీభత్సం- 300మందికి పైగా మృతి- వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం - Afghanistan Floods

ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం- మార్కెట్​ నుంచి కొవిడ్ 'వ్యాక్సిన్' ఉపసంహరణ- కారణమిదే! - AstraZeneca Withdraws Covid Vaccine

ABOUT THE AUTHOR

...view details