తెలంగాణ

telangana

మోదీకి భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం- 140కోట్ల మంది భారతీయులకు అంకితం! - modi bhutan visit

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 7:14 PM IST

Modi Bhutan Visit : భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పోను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మేఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ నిలిచారు.

Etv Bharat
Etv Bharat

Modi Bhutan Visit :భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పోను భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. దీంతో ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ఈ అవార్డును స్వీకరించారు.

ఐదు లక్షల టీకాలను అందించినందుకు!
Bhutan Highest Civilian Award To Modi : ప్రధాని మోదీకి ఈ పౌర పురస్కారాన్ని 2021లోనే ప్రకటించింది భూటాన్. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తూ, కొవిడ్‌ సమయంలో ఐదు లక్షల టీకాలను అందజేయడం వంటి చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించింది. ఈ పురస్కారం అందుకోవడం గౌరవంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు.

'భారతీయుడి తరఫున గౌరవాన్ని అంగీకరిస్తున్నా'
"నా జీవితంలో చాలా పెద్ద రోజు. నాకు భూటాన్ అత్యున్నత పౌర గౌరవం లభించింది. ప్రతి అవార్డు ప్రత్యేకమైంది. కానీ మీరు మరొక దేశం నుంచి అవార్డు అందుకున్నప్పుడు, రెండుదేశాలు సరైన మార్గంలో పయనిస్తున్నాయని ఇది సూచిస్తుంది. ప్రతి భారతీయుడి తరఫున నేను ఈ గౌరవాన్ని అంగీకరిస్తున్నాను. అవార్డు ఇచ్చినందుకు కోట్లాది ధన్యవాదాలు" అని నరేంద్ర మోదీ తెలిపారు.

భూటాన్‌ ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు
అంతకుముందు భూటాన్‌ ప్రధాని దాషో షెరింగ్‌ తోబ్గేతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యటకం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు సంబంధించి భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇది మూడోసారి!
అయితే రెండు రోజుల అధికార పర్యటనకు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం భూటాన్‌కు చేరుకున్నారు. వాస్తవానికి గురువారమే ఈ పర్యటన ప్రారంభం కావాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఒకరోజు జాప్యం జరిగింది. 2014లో భారత ప్రధానిగా అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీ, భూటాన్ పర్యటన చేపట్టడం ఇది మూడోసారి. థింపూలో భారత ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభించనున్నారు మోదీ.

పుతిన్​, జెలెన్‌స్కీకు మోదీ ఫోన్​ కాల్- ఎన్నికల తర్వాత రష్యా, ఉక్రెయిన్​కు ప్రధాని!

పార్టీ నేతను గుర్తుచేసుకుని మోదీ ఎమోషనల్- DMK, కాంగ్రెస్​పై నిప్పులు చెరిగిన ప్రధాని!

ABOUT THE AUTHOR

...view details