తెలంగాణ

telangana

Paytm ఆడిటింగ్​లో నమ్మలేని నిజాలు! మనీలాండరింగ్‌కు అవకాశం!

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 1:13 PM IST

RBI Paytm Issue : ప్రముఖ ఆన్​లైన్ పేమెంట్స్​ సంస్థ పేటీఎంను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో పీపీబీఎల్‌ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా, కంపెనీ పలు అవకతవకలకు పాల్పడిందంటూ ఆర్​బీఐ కొన్ని కీలక విషయాలను బయటపెట్టింది.

RBI Paytm Issue RBI Guidelines On Paytm
RBI Paytm Issue

RBI Paytm Issue :పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు విధించిన వేళ అందుకు గల కారణాలపై మరిన్ని కీలక అంశాలు వెలుగు చూశాయి. సరైన గుర్తింపు లేకుండా పేమెంట్స్ బ్యాంక్‌లో వందలాది బ్యాంకు ఖాతాలను సృష్టించినట్లు తేలడమే ఆర్​బీఐ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిసింది.

ఆడిటింగ్​లో బయటపడ్డ వాస్తవాలు!
ఒకే పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌- పాన్‌ కార్డుతో వెయ్యికి పైగా పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలు లింక్‌ అయినట్లు ఆర్​బీఐ నిర్ధరించింది. ఆడిటింగ్‌కు సంబంధించి పేటీఎం సమర్పించిన రిపోర్టు తప్పులతడకగా ఉన్నట్లు ఆర్​బీఐతో పాటు ఆడిటర్లు తేల్చారు. కేవైసీ సరిపోలని చాలా ఖాతాల నుంచి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు ఆర్​బీఐ గుర్తించింది. ఈ క్రమంలో మనీలాండరింగ్‌ కూడా జరిగి ఉండొచ్చన్న అనుమానాలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు.

ఆడిటింగ్‌ సమాచారాన్ని ఈడీ, కేంద్ర హోంశాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి ఆర్​బీఐ పంపించింది. అక్రమ కార్యకలాపాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే ఈడీ దర్యాప్తు జరగుతుందని అధికారులు వివరించారు. పేమెంట్స్‌ బ్యాంకు, పేటీఎం మాతృసంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ మధ్య అనుసంధానానికి సంబంధించి గవర్నెన్స్‌ స్టాండర్డ్స్‌లో లోపాలు బహిర్గతం అయినట్లు తెలిపారు. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని ఆర్‌బీఐ వెల్లడించింది.

మనీలాండరింగ్‌కు అవకాశం!
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు 35 కోట్ల ఇ-వాలెట్లు ఉన్నాయి. ఇందులో 31 కోట్ల ఖాతాలు ఇన్​ యాక్టివ్​లోనే ఉన్నాయి. మిగిలిన 4 కోట్ల ఖాతాలు కూడా జీరో బ్యాలెన్స్‌, స్వల్ప మొత్తాలను కలిగి ఉన్నాయి. యాక్టివ్​లో లేని ఖాతాలను మనీలాండరింగ్‌ కోసం వినియోగించారనే అనుమానాలను ఆర్​బీఐ వ్యక్తం చేసింది.

మొత్తంగా 70 శాతం పతనం!
మరోవైపు పీపీబీఎల్‌పై ఆర్​బీఐ చర్యల నేపథ్యంలో పేటీఎం స్టాక్‌లు 2 రోజుల్లో 36శాతం క్షీణించాయి. ఫలితంగా పేటీఎం మార్కెట్ విలువలో 2 బిలియన్ల డాలర్లు ఆవిరయ్యాయి. అలాగే మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో 40 శాతం నష్టపోయింది. శుక్రవారం 20 శాతం నష్టంతో రూ.487.05 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ 2 రోజుల్లో రూ.17,378.41 కోట్లు కోల్పోయి రూ.30,931.59 కోట్లకు పరిమితమైంది.

పేటీఎం రియాక్షన్​!
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో 51 శాతం వాటా ఉంది. మిగతా 49 శాతం వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌కు చెందినది. ఇక తాజాగా తమ సంస్థపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలపై విజయ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేసేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని పోస్ట్‌ చేశారు.

ఆర్​బీఐ ఏం చెప్పింది?
Why RBI Ban Paytm : ఆర్​బీఐ ఆదేశాల ప్రకారం, 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటి నుంచి చేయకూడదు.

త్వరలో మార్కెట్​లోకి రానున్న బెస్ట్​ ఈవీ స్కూటర్స్ ఇవే!

గోల్డెన్ ఛాన్స్​ - ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్​ చేస్తే మీ డబ్బులు డబుల్​!

ABOUT THE AUTHOR

...view details