How to Avoid Insurance Scams :సాంకేతికత పెరగడంతో మోసగాళ్లు ఇన్సూరెన్స్‌లను కూడా వదలట్లేదు. దాంతో చాలా మంది అమాయకులు బీమా(Insurance) స్కామ్‌లతో తీవ్రంగా నష్టపోతున్నారు. మరి.. ఏంటీ బీమా స్కామ్? వాటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్లెయిమ్ స్కామ్ :ఇది హెల్త్ ఇన్సూరెన్స్, వెహికిల్ ఇన్సూరెన్స్ విషయంలో ఎక్కువగా జరుగుతుంది. ఈ స్కామ్‌లో దొంగలు బాధితుడి సమాచారాన్ని సేకరించి, అతడి పేరుతో మోసపూరిత క్లెయిమ్‌లు చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు మీరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే.. మీకు సహాయం చేస్తామని చెప్పి.. మీ బీమాకు సంబంధించిన పత్రాలను తీసుకుంటారు. వాటితో మీకు తెలియకుండానే క్లెయిమ్ చేసుకుంటారు. కాబట్టి.. మీ ఆధార్ నంబర్, ట్రీట్మెంట్ రికార్డులు, ఇతర వ్యక్తిగత వివరాలను ఎవరికిపడితే వారికి ఇవ్వకూడదు. మీ ఈ-మెయిల్ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. అనుమానాస్పదంగా వచ్చిన ఈ-మెయిల్ లింక్‌లపై క్లిక్ చేయకూడదు.
నకిలీ వాగ్దానాలు :మీరు ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు.. ఏజెంట్ చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మొద్దు. ఏం జరిగినా.. మొత్తం మీ పాలసీ పరిధిలోకి వస్తుందని మాటలు చెబుతుంటారు. ఇలా చెబితే జాగ్రత్త వహించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. బీమా పాలసీలు కొన్ని మినహాయింపులను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా బీమా ప్లాన్‌ను కొనుగోలు చేసే ముందు.. కంపెనీ వెబ్సైట్ లేదా బ్రోచర్లో ఆ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోండి.
గుర్తింపు కార్డు అడగండి :బీమా ఏజెంట్ అంటూ మీకు చాలా మంది ఎదురుపడి.. పాలసీల గురించి వివరిస్తుంటారు. మరి.. వాళ్లు నిజంగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లేనని మనం ఎలా నమ్మాలి? అంటే.. వాళ్ల ఐడీ కార్డును చూపించమని అడగాలంటున్నారు నిపుణులు.
తప్పుడు లెక్కలు :మీరు ఏదైనా బీమా పాలసీ తీసుకునేటప్పుడు.. తప్పనిసరిగా కంపెనీ స్టాండర్డ్ బ్రోచర్స్లో డీటెయిల్స్ చూడాలి. సదరు బీమా కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి సమాచారాన్ని చూసుకొని.. ఇతర కంపెనీలతో పోల్చి చూడాలి. ఏజెంట్లు చేత్తో రాసిన లెక్కలు చూసి నిజమేనని నమ్మకూడదు. అవి మోసపూరితమైనవి కావొచ్చు.