తెలంగాణ

telangana

వారి ఖాతాలు నిలిపియాలని కేంద్రం ఆదేశం! అభ్యంతరం వ్యక్తం చేసిన 'ఎక్స్'

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 12:54 PM IST

Updated : Feb 22, 2024, 3:03 PM IST

X Accounts Suspended : సామాజిక మాధ్యమం ఎక్స్‌లోని రైతుల ఆందోళనలతో సంబంధం కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆ సంస్థ. కేంద్రం ఆదేశాలతో ఆయా ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసిన 'ఎక్స్'- అప్పీలు దాఖలు చేసినట్లు ప్రకటించింది.

X Accounts Suspended
X Accounts Suspended

X Accounts Suspended : సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కొన్ని ఖాతాలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించడంపై ఎలాన్ మస్క్‌ యాజమాన్యంలోని ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం నిర్ణయం భావన ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని పేర్కొంది. కేంద్రం ఆదేశాలతో ఆయా ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఎక్స్ అప్పీలు దాఖలు చేసినట్లు ప్రకటించింది. పంజాబ్‌-హరియాణా సరిహద్దుల్లో రైతుల ఆందోళన నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాలు జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలి
భారత ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకోవాలని తమను ఆదేశించిన్లట్లు సామాజిక మాధ్యమ సంస్థ 'ఎక్స్‌' బుధవారం ఒక పోస్ట్‌లో ప్రకటించింది. అయితే ప్రభుత్వం నిర్ణయంతో ఎక్స్‌ విభేదించింది. తమ వేదికపై ప్రతి ఒక్కరికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపింది. తమ విధానాలకు అనుగుణంగా భారత ప్రభుత్వ ఆదేశాలను సవాలుచేస్తూ రిట్ అప్పీలు దాఖలు చేసినట్లు ఎక్స్‌ పేర్కొంది. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. ఖాతాలు నిలిపివేయడం వల్ల ప్రభావితమైన ఖాతాదారులకు నోటీసులు అందించామని చెప్పింది. చట్టపరమైన పరిమితుల కారణంగా, ప్రభుత్వ ఆదేశాలను బహిర్గతం చేయలేకపోతున్నామని తెలిపింది. కానీ, పారదర్శకత కోసం వాటిని అందరిముందు ఉంచడం అవసరమని పేర్కొంది. లేదంటే జవాబుదారీతనం లోపిస్తుందని, ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుందని భావిస్తున్నట్లు ఎక్స్‌ తన గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్ ఖాతాలో చేసిన పోస్టులో వివరించింది.

177 ఖాతాలు నిలిపివేత
దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలకు సంబంధించిన 177 ఖాతాలను బ్లాక్‌ చేయాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వ శాఖ ఎక్స్‌ను ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అన్నదాతల ఆందోళనతో పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ బుధవారం యుద్ధ భూమిని తలపించింది. చలో దిల్లీకి బయలుదేరిన కర్షకులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, అన్నదాతలు రాళ్లు రువ్వడంలాంటి ఘటనలతో హింస చెలరేగింది. ఈ ఘర్షణల్లో తలకు గాయమై యువరైతు ప్రాణాలు వదిలాడు. పోలీసు కాల్పుల వల్లే తమ సహచరుడు మరణించాడని రైతు సంఘాలు ఆరోపించాయి. మరో ఇద్దరు రైతులూ గాయపడినట్లు తెలిపాయి. 12 మంది పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు ఎక్స్‌ ప్రకటించింది. ఎక్స్‌ చేసిన ప్రకటనపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎక్స్‌లో ఎవరి ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించిందో కూడా అధికారికంగా భారత ప్రభుత్వం వెల్లడించలేదు.

కాంగ్రెస్ రియాక్షన్​
కొన్ని ఖాతాలను నిలిపివేయాలని తమను భారత ప్రభుత్వం ఆదేశించిందని ఎక్స్ చేసిన ప్రకటనతో మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించింది. ఎక్స్ పోస్ట్‌ను ట్యాగ్ చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని రాసుకొచ్చారు. రైతుల ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.

జాహ్నవి కందుల కేసు- తెలుగమ్మాయి మరణానికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

బంగారం గనిలో ప్రమాదం- 14మంది మృతి- లోపల అనేక మంది!

Last Updated : Feb 22, 2024, 3:03 PM IST

ABOUT THE AUTHOR

...view details