ETV Bharat / international

జాహ్నవి కందుల కేసు- తెలుగమ్మాయి మరణానికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 10:05 AM IST

Jaahnavi Kandula Case Update : అమెరికాలో తెలుగమ్మాయి జాహ్నవి మృతికి కారణమైన పోలీసుపై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, న్యాయపరమైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.

Jaahnavi Kandula Case Update
Jaahnavi Kandula Case Update

Jaahnavi Kandula Case Update : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం బుధవారం ప్రకటించింది. సీనియర్‌ అటార్నీలతో సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

'ఆయన అక్కడ లేరు'
జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ లేడని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ లీసా మానియన్ తెలిపారు. ఈ నేపథ్యంలో అడెరెర్‌పై తీసుకోబోయే క్రమశిక్షణా చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపదొద్దనే నిర్ణయంపై ఉండబోదని వెల్లడించారు.

'అవి పోలీసులపై విశ్వాసం తగ్గించే వ్యాఖ్యలు'
అయితే పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రాసిక్యూటింగ్‌ అటార్నీ లీసా మానియన్ తెలిపారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. అతడిపై చర్యల తుది విచారణాంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. పోలీసు చీఫ్ అడ్రియన్ డియాజ్‌ను అడెరెర్‌ కలిసే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన కందుల జాహ్నవి(23) ఉన్నత చదువులకు 2021లో అమెరికా వెళ్లింది. సౌత్‌ లేక్‌ యూనియన్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీలో చేరింది. ఈ ఏడాది జనవరి 23న రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు విడిచింది. ప్రమాద సమయంలో పోలీసు అధికారి కెవిన్‌ డేవ్‌ గంటకు 119 కి.మీ.ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు సియాటిల్‌ పోలీసు విభాగం తెలిపింది.

ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్వారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అవి బయటకొచ్చాయి. "ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువలేదు" అన్నట్లుగా పోలీస్​ మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. అమెరికాలోనూ దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసు అధికారి తీరుపై అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అతడిని సస్పెండ్‌ చేశారు. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.

'నా ఉద్దేశం అది కాదు.. సగం వీడియోనే బయటకు వచ్చింది'.. జాహ్నవి కేసులో పోలీస్​ వివరణ

మరణానంతరం జాహ్నవికి డిగ్రీ.. అమెరికా యూనివర్సిటీ వీసీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.