తెలంగాణ

telangana

వివాహ బంధానికి సహనమే పునాది- చిన్న చిన్న గొడవలకు విడాకులు వద్దు!: సుప్రీంకోర్టు - SC Judgement On Marriage

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 6:50 AM IST

SC Judgement On Marriage Relationship : భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని సుప్రీంకోర్టు పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (Getty Images)

SC Judgement On Marriage Relationship :వైవాహిక బంధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులని పేర్కొంది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో, స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని హితవు పలికింది. ఓ మహిళ తన భర్తపై నమోదు చేసిన వరకట్న వేధింపుల కేసును శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టివేస్తూ జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలను చాలా సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు, బంధువులు సున్నితంగా పరిష్కరించకపోవడమే కాకుండా ఇంకా పెద్దది చేస్తుంటారని తెలిపింది.

బాధితులయ్యేది వారి పిల్లలే!
అంతేకాకుండా పోలీస్‌స్టేషన్లలో కేసులతో పరిస్థితి మరింతగా చేయిదాటి పోతోందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వారి వైవాహిక బంధం మరమ్మతుకు వీల్లేనంతగా సమస్యల్లో చిక్కుకుంటోందని తెలిపింది. దంపతులు విడిపోవడం వల్ల మొదట బాధితులయ్యేది వారి సంతానమేనని గుర్తు చేసింది. అందువల్ల దాంపత్య సమస్యలతో వచ్చే కేసులను కోర్టులు యాంత్రికంగా విచారించి విడాకులు మంజూరు చేయడం తగదని కోర్టు స్పష్టం చేసింది.

ప్రతికేసులోనూ వేధింపుల తీవ్రత, ఇరుపక్షాల శారీరక, మానసిక స్థితులను, వారి వ్యక్తిత్వాలను, సామాజిక స్థాయిని సునిశితంగా కోర్టులు గమనించాలని వెల్లడించింది. విడాకుల మంజూరుతో వారి బిడ్డలు ఎదుర్కోబోయే కష్టాల గురించి కూడా ఆలోచించాలని పేర్కొంది. భార్య ఫిర్యాదు చేయగానే గృహ హింస నేరం కింద భర్తపై యాంత్రికంగా కేసు నమోదు చేయడం తగదని చెప్పింది. భార్యాభర్తల మధ్య చోటుచేసుకునే కీచులాటలన్నీ క్రూరత్వం కిందకు రావని వెల్లడించింది. భర్తపై నమోదైన క్రిమినల్‌ కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ పంజాబ్‌, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. భార్య ఫిర్యాదులో చేసిన ఆరోపణలు సాదాసీదాగా ఉన్నాయని, భర్త క్రూరత్వ చర్యలకు ఆధారాలను కానీ, ఏ రోజు ఎలా వేధించాడనే దృష్టాంతాలు కానీ లేవని తెలిపింది. ఈ పరిస్థితుల్లో భర్తపై నమోదైన క్రిమినల్‌ కేసును అనుమతించడం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది.

వివాహమైనా, ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు!
వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ నియమం ఎలా ఉన్నప్పటికీ, వారి వైవాహిక స్థితి ఏదైనప్పటికీ పరస్పర అంగీకారంతో అలాంటి సంబంధాన్ని ఇద్దరు వయోజనులు కలిగి ఉంటే దాన్ని నేరంగా పరిగణించలేమని చెప్పింది. ఫిర్యాదుదారైన మహిళ తనను కలుస్తున్న పురుషుడికి అప్పటికే వివాహమైందని తెలిసినా, ఆ బంధాన్ని ఇష్టపడి కొనసాగిస్తూ అతడు తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించడంలో అర్థంలేదని జస్టిస్‌ అమిత్‌ మహాజన్‌ పేర్కొన్నారు. తనను బలవంతపెట్టాడని ఆమె ఫిర్యాదు చేసినా నేరంగా పరిగణనలోకి తీసుకోలేమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా అరెస్టైన 34 ఏళ్ల వ్యక్తికి మరో మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడిని సంవత్సరానికిపైగా జైలులోనే ఉంచడం సరికాదని అన్నారు. వ్యక్తులను సంస్కరించడంలో భాగంగా ఖైదీగా ఉంచడం ఒక్కటే జైలు ఉపయోగం కాదని, నిందితుడిని సకాలంలో విచారణకు హాజరు పరచాలన్న ఉద్దేశంతోనూ అలా చేస్తారని చెప్పారు.

లైంగిక ఆరోపణలపై బంగాల్​ గవర్నర్​ ఆడియో రిలీజ్​- కేరళకు ఆనంద్​ బోస్​ పయనం - Bengal Governor Molestation Issue

కేజ్రీవాల్​కు ఊరట!- మధ్యంతర బెయిల్​పై విచారణకు సుప్రీం ఓకే - Delhi Liquor Scam Case

ABOUT THE AUTHOR

...view details