తెలంగాణ

telangana

'మాకు అంత గొప్ప మనసు లేదులే!'- రామ్​దేవ్​ బాబాకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ - Ramdev Baba Misleading Ads Case

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 1:30 PM IST

Updated : Apr 10, 2024, 2:34 PM IST

Ramdev Baba Misleading Ads Case : పతంజలి ఆయుర్వేద ఔషధాల ప్రకటనల కేసులో యోగా గురు రామ్ దేవ్‌, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెబుతూ దాఖలు చేసిన అఫిడవిట్​ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తాము తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.

Ramdev Baba Misleading Ads Case
Ramdev Baba Misleading Ads Case

Ramdev Baba Misleading Ads Case: తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో బేషరతుగా క్షమాపణలు చెబుతూ యోగా గురువు రామ్‌దేవ్‌, పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ ఎండీ ఆచార్య బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌లను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మళ్లీ నిరాకరించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు అంత ఉదారంగా వ్యవహరించాలనుకోవడం లేదని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పతంజలి ధిక్కరణ కేసులో బుధవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ముగ్గురు అధికారులు సస్పెండ్
తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్‌ లైసెన్సింగ్‌ అథారిటీని సైతం సుప్రీంకోర్టు మందలించింది. పదే పదే ఉల్లంఘనలు జరుగుతున్నా హెచ్చరించి విడిచిపెట్టడం తప్ప అధికారులు చర్యలు తీసుకోకుండా ఎందుకు మిన్నకుండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లైసెన్సింగ్‌ అథారిటీలో ఉన్న ముగ్గురు అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇది కేవలం ఒక ఎఫ్‌ఎంసీజీ కంపెనీకి సంబంధించిన వ్యవహారం కాదని, న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందనే విషయం సమాజంలోకి వెళ్లాల్సిన అవసరం ఉందని ధర్మాసం పేర్కొంది.

మీ క్షమాపణలపై నమ్మకం లేదు
'మీరు కోర్టు పట్ల ఏ విధంగా అయితే అలక్ష్యంగా వ్యవహరించారో అలానే మీ క్షమాపణ పట్ల మేమెందుకు వ్యవహరించకూడదు? మీ క్షమాపణ మీద మాకు నమ్మకం లేదు. దాన్ని తిరస్కరిస్తున్నాం. మాకు క్షమాపణలు చెప్పడానికి ముందే వారు (రామ్​దేవ్‌, బాలకృష్ణ) తమ అఫిడవిట్లను మీడియాకు పంపారు. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు అవి మాకు అప్‌లోడ్‌ అవ్వలేదు. దీనిని చూస్తే ప్రచారం కోరుకుంటున్నారని అర్థం అవుతోంది' అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

నోటీసులకు స్పందించకపోవటమే కారణం
పతంజలి అలోపతి వైద్యవిధానాల గురించి తప్పుదోవ పట్టించేలా మీడియా ప్రకటనలు చేసిందని గతేడాది నవంబర్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్​లో ఆ సంస్థను మందలించింది. మళ్లీ అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. అయితే, ఆ హామీని ఉల్లంఘించడంపై ఫిబ్రవరిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించకపోవడం వల్ల వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అందులో భాగంగానే స్వయంగా రామ్​దేవ్​ బాబా, బాలకృష్ణ ఏప్రిల్ 2న హాజరయ్యారు. అప్పడు కూడా రామ్​దేవ్​ బాబా క్షమాపణలు సుప్రీం కోర్టు అంగీకరించమని స్పష్టం చేసింది.

మోసపోయిన మహిళా లాయర్- నగ్నంగా వీడియో కాల్​, రూ.10లక్షలు లాస్- డ్రగ్స్ టెస్ట్ పేరుతో దోపిడీ - Woman Lawyer Case On Fake Officers

బతికే ఉన్నానని 18ఏళ్లు న్యాయపోరాటం- ఇప్పుడు కాశీలో మోదీపై పోటీ- బరిలో ట్రాన్స్​జెండర్ కూడా! - Man And Transgender Fight On Modi

Last Updated : Apr 10, 2024, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details