తెలంగాణ

telangana

తొలిరోజు 5లక్షల మందికి బాలక్​ రామ్​ దర్శనం- రెండో రోజూ పోటెత్తిన భక్తులు

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 6:41 AM IST

Updated : Jan 24, 2024, 8:45 AM IST

Ayodhya Darshan : ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటి రోజే బాలక్​ రామ్​ను చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. తొలి రోజు సుమారు 5 లక్షల మంది రాముడిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండో రోజు కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం రామమందిరం వద్దకు భారీగా చేరుకున్నారు.

Ayodhya Darshan
Ayodhya Darshan

Ayodhya Darshan : అయోధ్య రామాలయంలో బాల రాముడిని తొలిరోజు సుమారు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆరు గంటలకే పెద్దసంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. మధ్యాహ్నం రెండు గంటల వరకే రెండున్నర లక్షల మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వెల్లువలా భక్తుల రాకతో వారిని నియంత్రించడం అధికారులు, పోలీసులకు కష్టసాధ్యమయ్యింది. ఒక దశలో స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. మధ్యాహ్నం తర్వాత భక్తులను నియంత్రించి, క్రమపద్ధతిలో దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి పది గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించారు.

మరోవైపు, ఆలయం వద్ద పరిస్థితిని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తర్వాత ట్రస్ట్‌ సభ్యులతో చర్చించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండగా దర్శనాలు సజావుగా సాగేలా అధికారులు, పోలీసులకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

ఉదయం 6 నుంచే భక్తులకు అనుమతి
అయితే రెండో రోజు కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రాముడి దర్శనం కోసం చలిని కూడా లెక్కచేయకుండా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌలభ్యం కోసం ఉదయం ఆరు గంటల నుంచే దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. "బాలక్​ రామ్​ను చూసేందుకు భక్తులు మొదటి రోజు నుంచి నాన్​స్టాప్​గా వస్తూనే ఉన్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశాం. నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు దర్శనం కోసం రెండు వారాల తర్వాత వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి" అని పోలీసు అధికారి ప్రవీణ్​ కుమార్​ పేర్కొన్నారు.

250 కోట్ల ఏళ్లనాటి శిలతో బాలరాముడి విగ్రహం
51 అంగుళాల బాలక్​ రామ్ విగ్రహం తయారీకి మైసూరు శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ వినియోగించిన కృష్ణశిల దాదాపు 250 కోట్ల ఏళ్ల నాటిదిగా నిపుణులు తెల్చారు. ఈ విషయాన్ని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రాక్‌ మెకానిక్స్‌ (ఎన్‌ఐఆర్‌ఎం) సంచాలకులు డాక్టర్‌ వెంకటేశ్‌ వెల్లడించారు. నాణ్యమైన గ్రానైట్‌ గనులకు ప్రసిద్ధి చెందిన కర్ణాటక మైసూరు జిల్లాలోని జయపుర హొబిలి గ్రామం నుంచి ఈ రాయిని సేకరించినట్లు తెలిపారు.

"వాతావరణ మార్పులకు లొంగని ఈ రాయి అత్యంత మన్నిక గలది. మన ఉప ఉష్ణమండలంలో కనీస నిర్వహణతో ఇది వేల సంవత్సరాలు మన్నికగా ఉంటుంది. ఏవిధంగా చెక్కడానికైనా ఈ కృష్ణ శిల అనుకూలంగా ఉంటుంది. అధిక సాంద్రత, సూక్ష్మ రంధ్రాలు గల ఈ రాయి నీటిని పీల్చుకోదు, అలానే కార్బన్‌ చర్యలకు స్పందించదు, అంతర్గతంగా పగుళ్లూ కూడా రావు. భూమి ఏర్పడిన తర్వాత కరిగిన లావా చల్లబడి ఇలాంటి గ్రానైట్‌ శిలలు రూపొందాయి. 400 కోట్ల ఏళ్ల కిందటి పూర్వ కేంబ్రియన్‌ శకానికి చెందిన ఈ రాయి భూమి ఏర్పడ్డ తర్వాత జరిగిన కనీసం సగం చరిత్రకు సాక్షీభూతమని చెప్పవచ్చు" అని డాక్టర్‌ వెంకటేశ్‌ వివరించారు.

Last Updated : Jan 24, 2024, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details