Police Destroyed Silencers : ఇలాంటి సైలెన్సర్లు మీ బైక్‌లకూ ఉన్నాయా.. అయితే మీకూ..!
Published: May 18, 2023, 2:53 PM

Police Destroyed Silencers : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వైలెన్స్‌ను సహించేది లేదని, ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దంతో ఉన్న సైలెన్సర్లను అమర్చితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి కుటుంబ సభ్యులతో కలిపి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో సీపీ సుబ్బారాయుడు వాహనదారులకు క్లుప్తంగా వివరించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో యువకులు శబ్ద కాలుష్యంతో కూడిన సైలెన్సర్లను అమర్చుతున్నారని.. దానికి సహకరిస్తున్న మెకానిక్‌లకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక శబ్దంతో కూడిన సైలెన్సర్లను ఒక్క దగ్గర చేర్చి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. అధిక కాలుష్యంతో కూడిన సైలెన్సర్లను అమ్మిన వారిపై, ఉన్న వారిపై, అమర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మూడుసార్ల కన్నా ఎక్కువ సార్లు పట్టు పడితే జైలు శిక్షలు పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని.. మద్యపానాన్ని సేవించే వారు గ్రహించి మద్యం సేవించకుండా వాహనాలను నడపాలని సీపీ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా.. శబ్ద కాలుష్యంతో కూడిన సైలెన్సర్లను వాహనదారులు అమర్చుకున్నా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు వాహనదారులను హెచ్చరించారు.