విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరం : బండి సంజయ్ - Hyderabad Liberation Day 2024
Published : Sep 18, 2024, 9:17 PM IST
Bandi Sanjay on Hyderabad Liberation Day : తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న పార్టీలు విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు ఎందుకు రాలేదు? అందుకు కారకులెవరు? తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందనేది నేటి తరానికి తెలియకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని చెప్పారు.
ఎంఐఎంకి భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపట్లేదని విమర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఫొటోఎగ్జిబిషన్‌ను బండి సంజయ్ ప్రారంభించారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తికి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను ప్రజలకు గుర్తు చేయడమే ఆ ఫొటో ఎగ్జిబిషన్ లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు.