మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్ - పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి
Palavai Sravanthi Resigned To Congress Party : మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె అయిన స్రవంతి.. 2014 ఎన్నికల్లో మునుగోడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండో స్థానంలో నిలిచారు. గత ఏడాది కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిన సమయంలో ఉపఎన్నిక రాగా.. ఆ పార్టీ నుంచి స్రవంతి పోటీ చేసి, 23వేలకు పైగా ఓట్లు సాధించారు.
Palavai Sravanthi To Join BRS : తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్(Congress Munugodu MLA Candidate)ను స్రవంతి ఆశించారు. కానీ, మారిన రాజకీయ పరిణామాలు, రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంతగూటికి రావటంతో పార్టీ.. ఆయనకే టికెట్ కేటాయించింది. పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న స్రవంతి.. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ, తాను పార్టీలోనే ఉంటానని ఆమె స్పష్టతనిచ్చారు.
ఇటీవల రాజగోపాల్‌రెడ్డితో కలిసి ఆత్మీయ సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకత్వంతో చర్చలు జరిపిన పాల్వాయి స్రవంతి.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజీనామా(Palavai Sravanthi Resign Congress) లేఖను పంపించారు. త్వరలోనే స్రవంతి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది.