Man Saves Geetha Worker in Bhupalpally : 'నేనున్నానని.. ఆపదలో ఆదుకొని'
Published: May 22, 2023, 10:12 AM

Geetha worker climbed a palm : తోటి వారికి సాయం చేయడంలో వచ్చే కిక్ వేరే లెవల్లో ఉంటుంది. ఇది సినిమాలో వినిపించే డైలాగ్.. మరి తోటి వ్యక్తికి పునర్జన్మ ఇస్తే ఇంకెలా ఉంటుంది. ఒకరి ప్రాణాలు కాపాడితే వచ్చే కిక్కు మామూలుగా ఉండదు కదా.. కిక్ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఇలాంటి కిక్ పొంది ఉండడేమో.. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ గీత కార్మికుడు మాత్రం ఆ అనుభూతి పొందాడు. తోటి వ్యక్తికి ఆయువు పోసి ప్రాణదాత అయ్యాడు. తన తోటి గీత కార్మికుడి కుటుంబానికి దేవుడయ్యాడు.
అసలేం జరిగిందంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని రవి అనే గీత కార్మికుడు రోజులానే కల్లు తీయడానికి తాటి చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కుతున్న సమయంలో మోకు జారిపోయి కింద పడిపోతూ చెట్టు మధ్యలో ఆగిపోయాడు. తల కిందులుగా పడి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా గమనించిన తోటి గీత కార్మికుడు ఆరెల్లి సాంబయ్య.. చెట్టు ఎక్కి ఆయనకు ధైర్యం చెప్పాడు. ఆ తరువాత సురక్షితంగా రవిని కిందకు దింపాడు. ఈ మొత్తం సన్నివేశాలను కొందరు వీడియో తీయగా.. ఆ దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రవికి పునర్జన్మ ఇచ్చిన దేవుడుగా సాంబయ్యను అభినందిస్తున్నారు.