ఈ నెల 22న కన్నడ రైతుల ధర్నా, ఎన్నికల హామీలకు వ్యతిరేకంగా తెలంగాణలో నిరసనగళం
Karnataka Farmers Dharna against Parties Guarantees : జాతీయ పార్టీలు రైతులను మోసం చేసేలా.. హామీలు ఇస్తున్నారని కర్ణాటక రైతులు మండిపడ్డారు. దీనిపై ఈనెల 22న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కర్ణాటక రాజ్య రైతు సంఘ అండ్ గ్రీన్ బ్రిగేడ్ నేతృత్వంలో రైతులు తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రైతులకు అమలు చేయలేని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారని రైతులు ఆరోపించారు. నాడు బీజేపీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి ఇప్పుడు ఆ వ్యవసాయ చట్టాలనే సిద్ధరామయ్య అమలు చేస్తున్నారని అన్నారు.
అన్నదాతలకు ఇచ్చిన హామీలను జాతీయ పార్టీలు అమలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతులను మోసం చేశాయని విమర్శించారు. నేషనల్ పార్టీలను రైతులు తిరస్కరించారని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించడంలో పార్టీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటికే కర్ణాటకలో జాతీయ పార్టీల వల్ల మోసపోయామని అన్నారు. తెలంగాణ రైతులు మోసపోవద్దని వారికి అవగాహన కల్పించడానికి ధర్నా చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం తెలంగాణ సీఈఓ, హైదరాబాద్ సీపీని అనుమతి కోరినట్లు చెప్పారు.