తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మొద్దు : కుమార స్వామి
EX Karnataka CM Kumaraswamy Fires on Congress : తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి (EX Karnataka CM Kumaraswamy) అన్నారు. హస్తం పార్టీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటక పథకాలనే తెలంగాణలోనూ అమలు చేస్తామంటున్నారని.. తమ రాష్ట్రంలో చేయలేని వారు తెలంగాణలో చేస్తామనడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని బెంగళూరులో జేడీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kumaraswamy Comments on Congress Guarantee Schemes : కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయని కుమార స్వామి ఆరోపించారు. రూ.లక్ష వరకు రుణాలు రద్దు చేస్తామన్నారని.. కానీ చేయలేదని విమర్శించారు. గ్యారెంటీల పేరుతో దేశ వ్యాప్తంగా ఓట్లు కొల్లగొట్టేందుకు హస్తం పార్టీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. తమ రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు. సాగుకు 5 గంటల కరెంట్ కూడా ఇవ్వట్లేదని.. ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ పేదలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. గృహజ్యోతి, యువనిధి పథకాలు అమలుకావట్లేదని అన్నారు. తెలంగాణలో రైతుబంధు విజయవంతంగా అమలవుతోందని కుమారస్వామి కితాబిచ్చారు.