భూకంపం వేళ మహిళకు డెలివరీ.. ఆస్పత్రి మొత్తం షేక్ అయిపోతున్నా..

By

Published : Mar 22, 2023, 1:14 PM IST

thumbnail

భూకంప సమయంలోనూ ఓ మహిళకు ప్రసవం చేశారు వైద్యులు. భయానక పరిస్థితుల్లో ఓ బిడ్డకు ప్రాణం పోశారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ చిన్నారికి జీవితాన్ని ప్రసాదించారు. జమ్ముకశ్మీర్ అనంత్​నాగ్​ జిల్లాలోని బిజ్​బెహారా ఎస్​డీఎచ్​ ఆసుపత్రిలో వైద్యులు.. మహిళకు మంగళవారం రాత్రి సిజేరియన్​ చేసి చిన్నారిని డెలివరీ చేశారు. జిల్లా వైద్యాధికారి​.. డాక్టర్ల కృషిని అభినందిస్తూ ఓ ట్వీట్​ చేశారు. విజయవంతంగా మహిళకు ప్రసవం చేసినందుకు డాక్టర్లను కృతజ్ఞతలు తెలిపారు. భూకంపం సమయంలో మహిళకు సిజేయరియన్​ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. చుట్టూ వస్తువులు, వైద్య పరికరాలు కదలడం.. ఈ వీడియోలో మనం గమనించవచ్చు.

మంగళవారం పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లోని హిందూకుష్‌ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్​లో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలు​ ఈ భూకంపం కారణంగా మరింత ఇబ్బంది పడుతున్నారు. 

భూకంపం కారణంగా భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. దిల్లీ, జమ్ముకశ్మీర్‌, హరియాణా, పంజాబ్‌, రాజస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.6 తీవ్రత నమోదైంది. ప్రకంపనల ధాటికి భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. భూకంప ప్రభావానికి జమ్ములో పలు చోట్ల అంతర్జాల సేవలకు అంతరాయం కలిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.