CCTV Footage : జిమ్​లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

By

Published : Feb 24, 2023, 9:51 AM IST

thumbnail

Hyderabad Constable died of Heart Attack in the Gym :  మృత్యువు ఏ రూపంలో వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా.. అనారోగ్యంగా ఉన్నాడా అనే తేడా లేకుండా హఠాత్తుగా ఉన్నట్టుండి చనిపోతున్నారు. ఈ ఆధునిక జీవనంలో.. మారుతున్న అలవాట్లతో మనిషి 60 ఏళ్లు కూడా బతకడం కష్టంగా మారుతోంది. ఈ మధ్య పసి పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎక్కువ మంది చనిపోతుండటానికి కారణమవుతోంది గుండెపోటు. 

కరోనా వచ్చిన తర్వాత నుంచి గుండె సమస్యలు ఎక్కువయ్యాయి. కొవిడ్​లో ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన చాలా మంది రకరకాల వ్యాయామాలు అలవాటు చేసుకున్నారు. కొన్నిసార్లు వ్యాయామం చేస్తుండగానే కొంతమంది కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా హైదరాబాద్​లో ఓ కానిస్టేబుల్​కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

హైదరాబాద్​ వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్​ విశాల్​ మృతి చెందాడు. తోటి వ్యక్తులు ఎంత ప్రయత్నించినా అతనిని బతికించలేకపోయారు. విశాల్ గుండెపోటుతో కుప్పకూలిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్​లో గౌస్​ మండి ప్రాంతానికి చెందిన విశాల్(24)​ ఆసిఫ్​ నగర్​లో 2020 నుంచి కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నాడు. 

ఎప్పటిలాగే నిన్న సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కాస్త ఫ్రష్ అయ్యి కసరత్తులు చేద్దామని జిమ్​కు బయలుదేరాడు. జిమ్​కు వెళ్లి తన స్నేహితులతో కాసేపు ముచ్చటించి కసరత్తు షురూ చేశాడు. ఇలా వ్యాయామం మొదలుపెట్టాడో లేదో క్షణాల్లోనే విశాల్ కుప్పకూలిపోయాడు. 

అకస్మాత్తుగా విశాల్ కుప్పకూలడం గమనించిన తోటివాళ్లు వెంటనే విశాల్ వద్దకు వచ్చారు. కానీ అప్పటికే విశాల్ కన్నుమూశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించాడని.. గుండెపోటు రావడం వల్లే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. విశాల్ గుండెపోటుతో కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.