'ప్రభుత్వ అధికారులను బీఆర్ఎస్ గుప్పెట్లో పెట్టుకుంది'
BJP Candidate Sama Ranga Reddy Comments on BRS : బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌ను కూని చేస్తున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎన్ రెడ్డి డివిజన్లోని స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరి అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, ఆయన చేసిన కబ్జాలు కప్పిపుచ్చుకోవడానికే అభివృద్ధి మంత్రాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అధికారులను గుప్పెట్లో పెట్టుకున్నారని సామ రంగారెడ్డి ఎద్దేవా చేశారు. వారితోనే డబ్బుల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఇటీవల వనస్థలిపురంలో స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షుడు నివాసంలో రూ.మూడు కోట్లు దొరికినా, అధికారులు రూ.1 కోటి 46 లక్షలుగా చూపించారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలతో ప్రభుత్వ అధికారులు ఒకటయ్యారని విమర్శించారు.