ETV Bharat / t20-world-cup-2022

t20 world cup : సెమీస్ ఆశలు నిలబెట్టుకున్న ఆసీస్​.. పోరాడిన టకర్​..

author img

By

Published : Nov 1, 2022, 7:47 AM IST

Updated : Nov 1, 2022, 9:03 AM IST

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌ ఆశలు నిలబెట్టుకునే దిశగా ఆస్ట్రేలియాకు మరో గెలుపు. ఐర్లాండ్‌తో కీలక పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అదరగొట్టింది. ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించి, సెమీస్‌ రేసును రసవత్తరంగా మార్చేసిన ఐర్లాండ్‌.. ఆసీస్‌తో పోరులో సత్తా చాటలేకపోయింది. ఈ గెలుపుతో ఫించ్‌ సేన పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కానీ నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌లో ఉండడమే కంగారూ జట్టును కంగారు పెట్టే విషయం.

Etv Bharat
australia ireland match t20 world cup 2022

ఆస్ట్రేలియా సత్తాచాటింది. టీ20 ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం ఏకపక్షంగా సాగిన గ్రూప్‌-1 పోరులో ఆ జట్టు 42 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. మొదట ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' ఆరోన్‌ ఫించ్‌ (63) మెరిశాడు. స్టాయినిస్‌ (35) కూడా రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో బ్యారీ మెకార్తి (3/29), జోష్‌ లిటిల్‌ (2/21) ఆకట్టుకున్నారు. ఛేదనలో ఐర్లాండ్‌ 18.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. లోర్కన్‌ టకర్‌ (71 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. జంపా (2/19), కమిన్స్‌ (2/28), మ్యాక్స్‌వెల్‌ (2/14), స్టార్క్‌ (2/43) కలిసికట్టుగా ప్రత్యర్థి పనిపట్టారు. అయితే ఆసీస్‌కు గెలుపు ఆనందం కంటే కూడా మ్యాచ్‌లో ఫించ్‌, స్టాయినిస్‌, టిమ్‌ డేవిడ్‌ గాయాల బారిన పడడం ఆందోళన కలిగించేదే!

టకర్‌ ఒక్కడే..
ఛేదనలో ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునే గొప్ప అవకాశాన్ని ఆస్ట్రేలియా వృథా చేసుకుంది. ఆ జట్టు ప్రయత్నాలకు టకర్‌ అడ్డుగా నిలిచాడు. ఒంటరి పోరాటంతో జట్టు మరీ తక్కువ స్కోరుకే కుప్పకూలకుండా కాపాడాడు. ఓ వైపు ఆసీస్‌ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతున్నా.. మరో ఎండ్‌లో ఎదురు దాడి చేసిన అతను చూడముచ్చటైన షాట్లు ఆడాడు. మొదట స్టార్క్‌, మ్యాక్స్‌వెల్‌ ధాటికి ఆ జట్టు 25 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకుంది.

ఆ తర్వాతా వికెట్ల పతనం కొనసాగింది. జంపా లోయర్‌ఆర్డర్‌ పనిపట్టాడు. టకర్‌ మినహా స్టిర్లింగ్‌ (11), డెలానీ (14), మార్క్‌ అడైర్‌ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టకర్‌ మాత్రం గొప్ప పోరాట పటిమను ప్రదర్శించాడు. ముఖ్యంగా స్టార్క్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు సాధించాడు. ప్యాడ్లకు నేరుగా బంతి వస్తే ఫ్లిక్‌ చేశాడు. బ్యాక్‌ ఆఫ్‌ లెంగ్త్‌లో పడ్డ బంతిని పుల్‌ షాట్‌ ఆడాడు. స్కూప్‌, లాఫ్టెడ్‌ షాట్లతో బౌండరీలు రాబట్టాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో ఆడిన 18 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. హేజిల్‌వుడ్‌ ఓవర్లో లాంగాన్‌లో సిక్సర్‌తో అర్ధశతకం చేరుకున్నాడు. అజేయంగా పెవిలియన్‌ చేరాడు.

నెమ్మదిగా మొదలై..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ ఆరంభంలో వేగంగా ఆడలేకపోయింది. పసికూన ఐర్లాండ్‌ క్రమశిక్షణతో బౌలింగ్‌ చేయడంతో పరుగులు అంత సులువుగా రాలేదు. 14 బంతులు తర్వాత కానీ తొలి బౌండరీ నమోదు కాలేదు. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే ఆ జట్టుకు షాక్‌ తగిలింది. ఈ టోర్నీలో పరుగుల వేటలో విఫలమవుతున్న ఓపెనర్‌ వార్నర్‌ (3) మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 38/1. ఆ తర్వాతి ఓవర్లోనే మిచెల్‌ మార్ష్‌ (28) రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టడంతో స్కోరు బోర్డు వేగాన్ని అందుకుంది.

మరోవైపు కెప్టెన్‌ ఫించ్‌ కూడా చాలా రోజుల తర్వాత దూకుడు ప్రదర్శించడంతో ఇన్నింగ్స్‌ కోలుకున్నట్లు కనిపించింది. కానీ మూడు ఓవర్ల వ్యవధిలో మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌ (13)ను పెవిలియన్‌ చేర్చిన ఐర్లాండ్‌ తిరిగి పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసింది. మొదట మార్ష్‌ను పెవిలియన్‌ చేర్చిన మెకార్తి 52 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అనంతరం మ్యాక్సీకి లిటిల్‌ చెక్‌ పెట్టాడు. మధ్యలో 16 బంతుల పాటు ఒక్క బౌండరీ రాలేదు. 14 ఓవర్లకు స్కోరు 108/3. కానీ మార్క్‌ అడైర్‌ వేసిన 15వ ఓవర్‌తో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది.

అతడు అయిదు వైడ్లు వేయడంతో పాటు.. స్టాయినిస్‌ రెండు ఫోర్లు, ఫించ్‌ ఓ ఫోర్‌, సిక్సర్‌ బాదడంతో ఆ ఓవర్లో 26 పరుగులు వచ్చాయి. ఫించ్‌ సిక్సర్‌తో అర్ధశతకం అందుకున్నాడు. ఫించ్‌, స్టాయినిస్‌ జోరు చూస్తే జట్టు 200 స్కోరుకు చేరువవుతుందనిపించింది. కానీ ఆఖర్లో పుంజుకున్న ఐర్లాండ్‌ బౌలర్లు నాలుగో వికెట్‌కు 70 పరుగులు జతచేసిన ఈ ఇద్దరినీ ఔట్‌ చేయడంతో పాటు పరుగులు కట్టడి చేశారు. 18, 19 ఓవర్లు కలిపి ఏడు పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో టిమ్‌ డేవిడ్‌ (15 నాటౌట్‌), వేడ్‌ (7 నాటౌట్‌) కలిసి 17 పరుగులు రాబట్టడంతో స్కోరు 180కి చేరువైంది.

australia ireland match t20 world cup 2022
.

ఇవీ చదవండి : కోహ్లీ రూమ్‌ వీడియో లీక్​పై స్పందించిన హోటల్‌.. ఏం చెప్పిందంటే?

T20 worldcup: అప్పుడు పాక్​కు ఇప్పుడు టీమ్​ఇండియాకు ఒకేలా జరిగిందిగా!

Last Updated : Nov 1, 2022, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.