ETV Bharat / sukhibhava

రుతుస్రావంపై ఈ విషయాలు మీకు తెలుసా?

author img

By

Published : May 28, 2021, 4:39 PM IST

రుతుచక్రం లేక రుతుస్రావం అడవాళ్లలో పునరుత్పత్తి కోసం ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. ఈ నెలసరి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిశుభ్రతను ఎలా పాటించాలి అనే విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆడవాళ్లకు సరైన అవగాహన లేదు. ఈ నిర్లక్ష్యం కారణంగా పిల్లలు కలగక పోవటం, గర్భాశయ క్యాన్సర్, హెపటైటిస్ బి, శోథ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతి ఏటా మే నెల 28వ తేదీన మెన్స్ట్రువల్ హైజీన్ డే జరుపుకుంటున్నాం.

Menstrual hygeine day
రుతుస్రావ ఆరోగ్య సమస్యలు-పరిష్కారాలు


ప్రపంచవ్యాప్తంగా 80కోట్ల మంది బాలికలు, స్త్రీలు ప్రతిరోజు రుతుస్రావం పొందుతున్నారు. వీరిలో 50కోట్ల మందికి ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించే సౌకర్యాలు లేవు. చాలా మందికి రుతుస్రావంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కనీస అవగాహన కూడా ఉండటం లేదు. ఫలితంగా వీరు జబ్బుల బారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, భారత్​లోనూ రుతుస్రావం గురించి అనేక మూఢనమ్మకాలు, అవసరం లేని సామాజిక చట్టాలు వ్యాప్తిలో ఉన్నాయి. అందువల్ల ఈ ఏడు వీటిపై పోరాడటానికి “రుతుస్రావం ఆరోగ్యం అంశాలపై చర్యలు” అనే అంశంతో కార్యాచరణ ప్రారంభించారు.

2013 సం.లో జర్మనీ లోని వాష్ అనే లాభాపేక్ష లేని సంస్థ ఈ జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 28 మే నెలను ఇందుకోసం ఎన్నుకోవడంలో ఒక ఆంతర్యం ఉంది. రుతుచక్రం నిడివి 28 రోజులైతే నెలసరి స్రావం 5 రోజుల పాటు జరుగుతుంది. 2016లో భారత పరిశోధకులు లక్షమంది అమ్మాయిలను పరీక్షించి వారికి రుతుస్రావం గురించి ఉన్న అవగాహనను అర్ధం చేసుకున్నారు. వారి అధ్యయనం ప్రకారం 50,000 ల మందికి అసలు రుతుస్రావం అంటే తెలియదు. 2014లో జరిగిన మరొక పరిశోధన ప్రకారం 2.3 కోట్ల మంది అమ్మాయిలు నెలసరి వల్ల బడి మానేయాల్సి వస్తుంది. ఇందుకు కారణం వారికి అక్కడ సరైన సమాచారం, సౌకర్యాలు లోపించటమే. చాలామంది అమ్మాయిలు ప్రతినెలా 5రోజులు బడి మానేస్తున్నారు.

“ఇప్పటికీ మన దేశంలో నెలసరి గురించి చాలా మంది స్త్రీలు బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడరు. ఈ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కరువై ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. ఈ సమస్య పట్టణాల్లో కంటే గ్రామాల్లో అధికంగా ఉంది,” అని మధ్య ప్రదేశ్, దేవాస్​లో స్త్రీల వైద్య నిపుణురాలుగా పనిచేసే డా. ప్రాచి మహేశ్వరి తెలియజేస్తున్నారు.

నెలసరిలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు:

2015-16 సంవత్సరాలలో 33 కోట్ల మంది స్త్రీలపై భారత్​లో చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 36శాతం మంది స్త్రీలు సానిటరీ న్యాప్ కిన్స్ (రుతు రుమాలు) వాడుతున్నారు. అధిక శాతం మంది స్త్రీలు ఇప్పటికీ వాడిన గుడ్డలనే వాడుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్తవ స్రావం సమయంలో గుర్తుంచుకోవలసిన అంశాలను నిర్లక్ష్యం చేయరాదు.

  • సానిటరీ న్యాప్ కిన్​ను ప్రతి 6గం.లకు ఒకసారి మార్చాలి. ఆర్తవ స్రావం ఎక్కువగా ఉంటే మరింత తరచుగా మార్చాలి.
  • వాడిన, పరిశుభ్రత లేని గుడ్డలను వాడరాదు. అలా వాడితే ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉంటుంది.
  • జననేంద్రియాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • రెండుపూటలా వేడినీటితో స్నానం చేయటం ద్వారా ఆ సందర్భంగా కలిగే నొప్పి శమిస్తుంది.
  • మీరు ప్రయాణంలో ఉన్నా, బయట ఎక్కడైనా మరుగుదొడ్డిని వాడాల్సిన అవసరం ఏర్పడితే అది పరిశుభ్రంగా ఉందో లేదో గమనించాలి.
  • సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి.
  • పరిశుభ్రంగా ఉన్న లోదుస్తులను వాడాలి.

రుతుస్రావం గురించి ప్రజల్లో ఉన్న అపోహలు:

భారత్​లో గ్రామాల్లోనే కాక పట్టణాల్లోనూ రుతుస్రావం గురించి ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి. యుక్త వయసులోని బాలికలు, స్త్రీలు వీటన్నింటినీ గుడ్డిగా నమ్ముతుంటారు. ఇంటిలో ఊరగాయలు మొదలైన వాటిని రుతుస్రావం ఉన్న స్త్రీలు ముట్టుకోకూడదని , అలా ముట్టుకుంటే అవి చెడిపోతాయని, తల స్నానం చేయరాదని, ఒక గదిలోనే ఉండాలని వంటింట్లోకి ప్రవేశించరాదని వ్యాయామం చేయరాదని, ఇతరులను ముట్టుకోరాదని ఇలా పలు నమ్మకాలున్నాయి.

నిజానికి ఈ సమ్మకాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. రుతుస్రావం సందర్భంగా వారు విశ్రాంతి తీసుకోవాలనేది నిజం. అయితే పరిశుభ్రత పాటిస్తే ఈ అపోహలను పట్టించుకోవలసిన అవసరం లేదు. వేడినీటి స్నానంతో చాలా ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో పనులు చేస్తున్నా, ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నా, వ్యాయామం చేయాలన్న వీరికి అడ్డంకి ఏమీ ఉండదు. బలహీనత, ఒళ్లు నొప్పులు ఉంటేనే పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. అధిక రుతుస్రావం అయినా, చాలా తక్కువగా అయినా, రుతుస్రావానికి ముందు, తరువాత తెల్లబట్ట (వైట్ డిస్చార్జ్) అయినా, భరించలేని నొప్పి కలిగినా గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

ఇదీ చదవండి:- నెలసరి వేళ... వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.