ETV Bharat / sukhibhava

ప్రాణానికి మూలం రక్తం.. ఆపత్కాలంలో వేగంగా స్పందిద్దాం

author img

By

Published : Jun 14, 2020, 5:33 AM IST

Updated : Jun 14, 2020, 6:44 AM IST

World Blood Donor Day 2020
ప్రపంచ రక్త దాతల దినోత్సవం

రక్తదానం ఆవశ్యకత తెలియజేయడం సహా సమయానికి రక్తాన్ని అందించే సహృదయులకు కృతజ్ఞతగా జూన్ 14న అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అంతర్జాతీయంగా ఏటా 11 కోట్లకు పైగా రక్తదానాలు జరుగుతున్నాయి. అయితే భారత్​లో మాత్రం ప్రాణాధారానికి మూలమైన రక్తం కొరత అత్యంత తీవ్రంగా ఉంది. సరఫరాతో పోలిస్తే డిమాండ్ 400 శాతం ఎక్కువగా ఉంటోంది. కరోనా లాక్​డౌన్ వల్ల రక్తం లభ్యత మరింత క్షీణించింది.

సురక్షితమైన రక్తం ఆవశ్యకతపై అవగాహన పెంచడం, ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడే విలువైన బహుమతి అందించిన రక్తదాతలకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం జూన్ 14న ప్రపంచదేశాలన్నీ 'అంతర్జాతీయ రక్త దాతల దినోత్సవం' నిర్వహించుకుంటున్నాయి. ఏబీఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టిన శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత కార్ల్ లాండ్​స్టీనర్​ జయంతిని రక్తదాతలకు కృతజ్ఞతా పండగగా జరుపుకొంటున్నాయి.

గణాంకాలు

  • ప్రపంచవ్యాప్తంగా ఏటా 11.85 కోట్ల రక్త దానాలు జరుగుతున్నాయి. ఇందులో 40శాతం వాటా అధిక ఆదాయం ఉన్న దేశాలదే.
  • అల్పాదాయ దేశాల్లో 54 శాతం రక్త మార్పిడి ఐదేళ్లలోపు చిన్నారులకే జరుగుతోంది.
  • అధిక ఆదాయ దేశాల్లో 75 శాతం రక్త మార్పిడి 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు నిర్వహిస్తున్నారు.
  • అధిక ఆదాయ దేశాల్లో వెయ్యి మందికి 31.5 మంది రక్తదానం చేస్తున్నారు. ఎగువ ఆదాయ దేశాల్లో ఈ సంఖ్య 15.9, మధ్య ఆదాయ దేశాల్లో 6.8, అల్పాదాయ దేశాల్లో ఈ సంఖ్య 5.0 గా ఉంది.
  • 2013- 2018 మధ్య స్వచ్ఛందంగా రక్తం దానం చేసే వారి సంఖ్య 78 లక్షలు పెరిగింది.
  • 79 దేశాలు తమ మొత్తం రక్తంలో 90 శాతానికి పైగా ఉచితంగానే సేకరిస్తున్నాయి.
  • 56 దేశాలు మాత్రం మొత్తం రక్తంలో 50 శాతం వరకు పెయిడ్ డోనర్ల నుంచి సేకరిస్తున్నాయి.
  • 171 దేశాల్లో 55 దేశాలు రక్తం నుంచి ప్లాస్మాను ఉత్పత్తి చేస్తుండగా.. మరో 90 దేశాలు దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.

సంవత్సరానికి ఒకసారి

  • తగినంత రక్త నిల్వలు ఉండాలంటే వెయ్యికి 10 నుంచి 20 మంది రక్త దానం చేయాలని సిఫార్సు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
  • కనీస అవసరాల కోసం దేశంలో ఒక శాతం జనాభా రక్త దానం చేయాలి.
  • రక్తం డిమాండ్​ను తట్టుకోవాలంటే వెయ్యికి 34 మంది సంవత్సరానికి ఒకసారి రక్తం దానం చేయాలని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

భారత్​లో రక్త దానం

  • భారత్​లో రక్త నిల్వల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రాలు 4.1 కోట్ల యూనిట్ల రక్త కొరతతో సతమతమవుతున్నాయి.
  • సరఫరాతో పోలిస్తే డిమాండ్ 400 శాతం ఎక్కువగా ఉంది.
  • దేశంలో ఏటా 6 కోట్ల సర్జరీలు, 23 కోట్ల ఆపరేషన్లు, 33.1 కోట్ల క్యాన్సర్ సంబంధిత చికిత్సలు జరుగుతున్నాయి. వీటన్నింటికీ చాలా పెద్దమొత్తంలో రక్తం అవసరమవుతోంది.

కరోనా ఎఫెక్ట్

లాక్​డౌన్​తో అన్ని రంగాల మాదిరిగానే బ్లడ్​ బ్యాంకులూ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నాయి. రక్త దానాల సంఖ్య భారీగా పడిపోయింది. దీంతో దేశంలో అన్​లాక్-1 మొదలవగానే రక్త సేకరణ పెరగడానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మొబైల్ బ్లడ్ బ్యాంకులు, రవాణా వాహణాలు ప్రయాణం సాగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

కరోనా నేపథ్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయలేకపోయినా.. అత్యవసర సేవల నిమిత్తం తగినంత రక్తం అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాల వైద్య శాఖ మంత్రులకు... కేంద్ర వైద్య శాఖ మంత్రి డా. హర్ష వర్ధన్ లేఖ రాశారు. ఇన్ఫెక్షన్ సోకకుండా బ్లడ్ డొనేషన్ కేంద్రాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Last Updated :Jun 14, 2020, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.