ETV Bharat / sukhibhava

'కూష్మాండం' ఉండగా.. భయమెందుకు దండగ!

author img

By

Published : May 24, 2020, 11:03 AM IST

use of pumpkin in Ayurveda to fight with so many diseases
'కూష్మాండం' ఉండగా.. భయమెందుకు దండగా!

కోట్లు ఎన్ని సంపాదించినా.. ఆరోగ్యం లేకపోతే అంతా వ్యర్థమే. అందుకే పెద్దలు 'ఆరోగ్యమే మహాభాగ్యం' అంటారు. కాలుష్యం సహా పలు ఆరోగ్య సమస్యలు మనిషిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం, ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువగా మన ఇళ్లలో దిష్ఠి తీయడానికి వాడే (కూష్మాండం) బూడిదగుమ్మడి కాయలో ఎన్నో పోషక విలువలున్నాయి. ఆయుర్వేద చికిత్సలోనూ దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. మరి ఆ విశేషాలు చూసేయండి.

ఎన్నెన్నో అనారోగ్య సమస్యలు... కానీ అన్నింటికీ ఒకటే ఔషధం కావాలనుకుంటున్నారా... అయితే వెంటనే మీరు బూడిద గుమ్మడిని ఎంచుకోవచ్ఛు 'కూష్మాండం'గా పిలిచే దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.

  • దీంట్లో క్యాల్షియం, ఫాస్ఫరస్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. విటమిన్‌-బి2తోపాటు విటమిన్‌-సి కొద్దిగా ఉంటుంది. పీచు ఎక్కువగా ఉండటం వల్ల అరగడానికి దాదాపు రెండున్నర గంటలు పడుతుంది.
  • ప్రతి వంద గ్రాముల గుమ్మడి నుంచి పదిహేను కెలొరీలు మాత్రమే లభిస్తాయి.
  • ఆయుర్వేద చికిత్సలో విరివిగా ఉపయోగించే కూష్మాండ లేహ్యం శరీరానికి చలువ నిస్తుంది.
  • కడుపులో మంట, పేగు పూతతో ఇబ్బందిపడేవాళ్లు గుమ్మడి రసాన్ని తేనెతో కలిపి తాగాలి. ఇందుకు ముదిరిన కాయను మాత్రమే ఉపయోగించాలి.
  • గుమ్మడి హల్వా ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికీ మంచిది.
  • అరిచేతులు, అరికాళ్ల మంటలతో బాధపడేవాళ్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
  • నరాల నొప్పులను తగ్గిస్తుంది. దీని లేహ్యాన్ని తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
  • బూడిద గుమ్మడి ముక్కలను పంచదార పాకంలో వేసి ఊరనిచ్చి, ఎండబెట్టి కూడా వాడుకోవచ్ఛు
  • వేసవికాలం చర్మ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లు బూడిద గుమ్మడి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే మంచిది.
  • కొందరికి అలెర్జీతోపాటు దద్దుర్లు కూడా వస్తుంటాయి. అలాంటివాళ్లు ఈ రసంలో జీలకర్ర, తేనె వేసుకుని ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
  • వేసవిలో కొందరికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాంటివాళ్లు ఈ రసాన్ని తీసుకోవచ్ఛు దీంతో వేడి వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి.
  • గుమ్మడికి అధిక రక్తస్రావాన్ని నిలువరించే గుణం ఉంటుంది. ఈ రసంలో ఉసిరి, నిమ్మరసం, తేనె వేసుకుని తాగాలి.
  • గుమ్మడి గింజలను ఎండబెట్టి పొడిచేసి కొబ్బరిపాలతో కలపాలి. దీన్ని రాత్రిపూట తాగితే కడుపులో నులిపురుగులు చచ్చిపోతాయి.
  • బలహీనంగా, నీరసంగా ఉండేవాళ్లు ఈ రసంలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్ఛు
  • రెండు చెంచాల గోరువెచ్చని నీటిలో ఈ రసం వేసి పుక్కిలిస్తే చిగుళ్లవాపు, నోటి పుళ్లు తగ్గుతాయి.
  • కొందరికి థైరాయిడ్‌ వల్ల ఒంటికి నీరు పడుతుంది. అలాగే వాపులూ వస్తాయి. అలాంటప్పుడు ఈ రసం తాగితే మంచిది.
  • ఈ రసంలోనే శొంఠిపొడి వేసుకుని తాగితే ఆస్తమా, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
  • పిల్లలకు ఒంటి మీద దద్దుర్లు, కురుపులు, మంటలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఈ రసాన్ని ఉసిరి, నిమ్మరసంతో కలిపి ఇస్తే మంచిది.
  • క్షయ రోగులు, గుండె సంబంధ సమస్యలున్నవారు ఈ రసం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

బూడిదగుమ్మడి హల్వా

బూడిదగుమ్మడి హల్వా

కావాల్సినవి: బూడిదగుమ్మడి తురుము - 250 గ్రా., పంచదార- 100 గ్రా., నెయ్యి- 50 గ్రా., యాలకుల పొడి- చిటికెడు, జీడిపప్పు, బాదంపప్పు- 25 గ్రా.

తయారీ: ముందుగా జీడిపప్పు, బాదంపప్పును నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో గుమ్మడి తురుమును వేయించాలి. ఇప్పుడు దీంట్లో పంచదార వేసి కలపాలి. తర్వాత యాలకుల పొడి, జీపపప్పు, బాదంపప్పును వేసి దించేయాలి.

● ఈ హల్వాను బ్రెడ్‌ మీద వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది..

- డాక్టర్‌ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.