ETV Bharat / sukhibhava

నెలసరి ముందు సమస్యలా? ఈ టిప్స్​తో అన్నీ మాయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 7:39 AM IST

Premenstrual Syndrome Symptoms Treatment : ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌స‌రి నొప్పి సాధార‌ణ‌మే. దీనికి తోడు పీరియ‌డ్స్​కు కొన్ని రోజుల ముందు ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఊరికే చిరాకు ప‌డ‌టం, మూడ్ ఆఫ్ అవ‌డం, శారీర‌కంగా ప‌లు భాగాల్లో నొప్పులు వ‌స్తాయి. అయితే దీనికి కార‌ణం ఏంటి? దీన్ని ఎలా ప‌రిష్క‌రించుకోవాలో ఇందులో తెలుసుకుందాం.

Premenstrual Syndrome Symptoms Treatment
Premenstrual Syndrome Symptoms Treatment

Premenstrual Syndrome Symptoms Treatment : మామూలు రోజుల్లో ప్రశాంతంగా ఉండే మ‌హిళ‌లు నెల‌స‌రి వ‌చ్చే ముందు మాత్రం చికాకుగా ఉంటారు. ప్ర‌తి చిన్న విష‌యానికీ ఇట్టే కోపం తెచ్చుకుని చిరాకు ప‌డుతుంటారు. ఇంట్లో వాళ్ల‌మీద‌నో, పిల్ల‌ల మీద‌నో కోపం చూపిస్తారు. లేదంటే మూడీగా, మౌనంగా ఉంటారు. శారీర‌కంగానూ రొమ్ముల్లో స‌ల‌ప‌రం, అన్నం స‌హించ‌క‌పోవ‌డం, తిన్న‌ది అర‌గ‌క‌పోవ‌డం లాంటి బాధ‌లు క‌నిపిస్తూ ఉంటాయి. అయితే నెల‌స‌రి పూర్తి కాగానే ఈ బాధ‌లు, కోపాలు అన్నీ మ‌టుమాయం అయిపోతాయి. నెల‌స‌రికి ముందు వ‌చ్చే ఇలాంటి బాధ‌ల్ని ప్రీ మెనుస్ట్రువ‌ల్ సిండ్రోమ్ (PMS) అని పిలుస్తారు. నెల‌స‌రికి ముందు వేధించే బాధ‌లు, వాటిని అధిగ‌మించే మార్గాలు ఈ ఆర్టిక‌ల్‌లో తెలుసుకుందాం.

అస‌లీ బాధ‌లు ఎందుకు వ‌స్తాయి ?
రుతుక్ర‌మ స‌మ‌యంలో అటు మాన‌సికంగా, ఇటు శారీర‌కంగా అసౌక‌ర్యాన్ని గురవడం అనేది ప్ర‌తి మ‌హిళ‌కూ అనుభ‌వ‌మే. అయితే ఇది రాక‌ముందు నుంచే కొంత‌మందిలో రెండు ర‌కాలుగా చాలా స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. నెల‌స‌రి రావ‌డానికి 4 రోజుల ముందు నుంచి పొత్తి క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి, రొమ్ముల్లో స‌ల‌ప‌రం, క‌డుపు ఉబ్బ‌రం, కీళ్లు, కండ‌రాల నొప్పులు, మ‌ల‌బ‌ద్ధ‌కం మొద‌లైన శారీర‌క ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అటు మాన‌సికంగానూ చికాకు, అస‌హ‌నం వంటి స‌మ‌స్య‌లు క‌నిపిస్తూ ఉంటాయి. మెన్సెస్​కు ముందు క‌నిపించే ఈ ర‌క‌మైన ప‌ద్ధ‌తిని ప్రీ మెనుస్ట్రువ‌ల్ సిండ్రోమ్ (PMS) అంటారు.

"పీఎంఎస్​ను ప్రీ మెనుస్ట్రువ‌ల్ డిస్ఫొరిక్ డిసాస్ట‌ర్ అని కూడా అంటారు. మ‌హిళ‌ల్లో అండం విడుద‌లైన త‌ర్వాత విప‌రీత‌మైన మార్పులు వ‌స్తాయి. పీరియ‌డ్స్ వ‌చ్చే వారం ముందు నుంచే విప‌రీత‌మైన త‌ల‌నొప్పి, వాంతుల ఫీలింగ్, అకార‌ణంగా కోపం రావ‌టం, గుండె ద‌డ‌లు రావ‌టం, రొమ్ముల్లో నొప్పి ఉండ‌టం లాంటివి జ‌రుగుతాయి. ఇవి పీరియ‌డ్ వ‌చ్చిన రోజే చాలా వ‌ర‌కు త‌గ్గిపోవ‌డం, మ‌ళ్లీ నార్మ‌ల్ ప‌రిస్థితికి వ‌స్తారు. వీట‌న్నింటికీ ప్ర‌ధాన కార‌ణం హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, మైక్రో న్యూట్రియెంట్ డెఫిషియెన్సీ, శారీర‌క శ్ర‌మ లేక‌పోవ‌డం లేదా ఊబ‌కాయం. శారీర‌క బాధ‌లు ఉన్నంత‌వ‌ర‌కు ఓకే కానీ మాన‌సికంగా పిచ్చి ఆలోచ‌న‌లు వ‌స్తే మాత్రం సైకియాట్రిస్టు లేదా సైకాలజిస్టును సంప్ర‌దించాలి. వీటి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే శారీర‌క వ్యాయామం, మెడిటేష‌న్ చేయాలి. స‌రిప‌డా నిద్ర ఉండేలా చూసుకోవాలి. డైట్​లో మార్ప‌ులు చేసుకోవాలి. పీఎంఎస్​ను అరిక‌ట్ట‌డం మ‌న చేతుల్లోనే ఉంది."
--కావ్య ప్రియ, గైన‌కాల‌జిస్టు

నెల‌స‌రికి ముందు క‌నిపించే మార్పులకు చాలా వ‌ర‌కు ఈస్ట్రోజ‌న్‌, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల హెచ్చు త‌గ్గులే కార‌ణం. వీటితో పాటు మెద‌డులో సెర‌టోనిన్, బీటా ఎండార్ఫిన్ అనే న్యూరో ట్రాన్స్మిటల్ ఉత్ప‌త్తి త‌గ్గ‌డం వల్ల మాన‌సిక‌ చికాకులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. జ‌న్యుప‌రంగానూ ఈ బాధ‌లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అయితే ఇవి అంద‌రిలోనూ ఒకే రీతిగా ఉండ‌వు. వీటిల్లో ఎక్కువ త‌క్కువ‌లుంటాయి.

ఉప‌శ‌మ‌నానికి ఈ ఫుడ్ తీసుకుంటే స‌రి !
ఈ బాధ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు జీవ‌న శైలిలోనూ, ఆహార‌పు అల‌వాట్ల‌లోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఐర‌న్‌, పొటాషియం అధికంగా ల‌భించే వాటిని తీసుకోవాలి. ఐర‌న్​కు మెద‌డులో సెరటోనిన్ ఉత్ప‌త్తిని పెంచే గుణ‌ముంది. గుమ్మ‌డి, శ‌న‌గ‌ప‌ప్పు, బాదం, కిస్మిస్​, పాల‌కూర వంటి ఆహారాల్లో ఇది స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఆహారంలో ఇవి త‌ప్ప‌ని స‌రిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మ‌న రోజువారి ఆహారంలో పీచు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. కాఫీ, టీ, వేపుళ్లు, జంక్ ఫుడ్ త‌గ్గించాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా యోగా చేస్తే మంచిది. వీటితో పాటు చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్- డి, బి6 స‌ప్లిమెంట్లు వాడటం వ‌ల్ల కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

పీరియ‌డ్స్​కు ముందు, త‌ర్వాత శారీర‌కంగా, మాన‌సికంగా క‌నిపించే మార్పుల గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. నెల‌స‌రి త‌ర్వాత చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌ల‌న్నీ వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అయితే స‌మ‌స్య‌ల తీవ్ర‌త మ‌రీ ఎక్కువైతే ఓర‌ల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ప్రొజెస్టిరాన్ డై ఇరిటిక్స్ లాంటి మందుల్ని వాడాల్సి ఉంటుంది. మాన‌సిక భావోద్వేగ స్థాయులు ఎక్కువ‌గా ఉంటే యాంటీ డిప్ర‌సెంట్ మందుల్ని వాడాలి.

నెలసరి ముందు సమస్యలా? ఈ టిప్స్​తో చెక్​!

Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్​కు డోకా ఉండదు!

పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతున్నారా? ఈ 5 టిప్స్​ పాటిస్తే మీకు ఫుల్​ రిలీఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.