ETV Bharat / sukhibhava

బార్లీ గింజల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?

author img

By

Published : Jan 7, 2023, 8:00 AM IST

Updated : Jan 8, 2023, 4:15 PM IST

కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించవచ్చని అంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

Precautions to be taken for kidney stones problem
కిడ్నీలో రాళ్లు సమస్య

బార్లీ గింజల నీటిని తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?

కిడ్నీలు మన శరీరంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. అంత ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాల్సి బాధ్యత మనందరిలో ఉంది. కిడ్నీ సంబంధిత వ్యాధులతో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే సమస్య చాలా మందిలో చూస్తూనే ఉంటాం. అయితే కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే అంశాలపై నిపుణులు కొన్ని సలహాలను, సూచనలను ఇచ్చారు. అవేంటంటే?..

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడేందుకు కారణాలు:

  • శరీరంలోని వ్యర్థాలు బయటకు పోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
  • నీటిని తక్కువగా తాగడం వల్ల మూత్రం సరిగా తయారవ్వదు. దీనివల్ల శరీరం నుంచి మలినాలు బయటకు పోవు. ఇవి కిడ్నీలో స్టోన్స్​లా మారే అవకాశం ఉంది.
  • తక్కవగా మూత్ర విసర్జన చేయటం వల్ల యూరిన్​లో లవణ పదార్థాల సాంద్రత పెరిగిపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
  • బ్లడ్, మూత్రం​లో యూరిక్ యాసిడ్, కాల్షియం ఆక్సలైట్ వంటి లవణాలు శరీరం నుంచి అధిక మోతాదులో బయటకు పోవటం వల్ల, యూరిన్ తక్కువగా తయారవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
  • కొద్దిమందిలో పాలకూర, టమోటా కలిసిన ఆహారం తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • నీటిని ఎక్కువగా తాగడం మంచిది. దీనివల్ల శరీరంలో ఉన్న మలినాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి.
  • బార్లీ గింజలు తాగటం వల్ల యూరిన్ ఎక్కువగా తయారవుతుంది. వీటిని తాగటం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
  • కొంతమంది రక్తం, మూత్రంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి లెవెల్స్​ను తగ్గించడం వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చు.
  • టమోట, పాలకూరను కలిపి ఆహారంలో తీసుకోవటం మానేయాలి.
  • మాంసకృత్తులు తక్కువగా తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఉప్పును చాలా వరకు తగ్గించాలి. సముద్రపు ఉప్పును కొంతవరకు వాడుకోవచ్చు.
  • వంటల్లో పసుపు, అల్లం తప్పనిసరిగా వాడుకోవాలి.
  • కారం, మసాలాలను తగ్గించుకుంటే మంచిది.
  • సిగరెట్​ను పూర్తిగా మానేస్తే మంచిది. ఇందులో కాడ్మియం అనే మెటల్ ఉంటుంది. అది కిడ్నీల లైనింగ్​లో పేరుకునిపోతుంది.
  • కాఫీ, టీ తక్కువగా తాగితే మంచి. పెయిన్ కిల్లర్స్​ను అధికంగా వాడకూడదు.

ఆయుర్వేద పరిష్కారం..
కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఆయుర్వేదంలో కూడా చక్కటి పరిష్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మునగాకుతో తయారు చేసిన కషాయాన్ని తాగడం వల్ల కొద్ది రోజుల్లోనే ఈ సమస్యను నివారించవచ్చని అంటున్నారు.

మునగాకు కషాయానికి కావాల్సిన పదార్థాలు:

  • మునగాకులు
  • పెరుగుపై ఉండే నీరు
  • నెయ్యి
  • ఉప్పు

తయారీ విధానం:
ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి దానిని ముద్దలా నూరుకోవాలి. స్టవ్​ మీద ప్యాన్​ పెట్టి అందులో చెంచాడు నెయ్యి వేసి కరిగించాలి. అందులో రెండు చెంచాల మునగాకు పేస్ట్​ను వేసి బాగా వేయించాలి. అందులో ఓ గ్లాసు నీళ్లు పోసి, కాసేపు మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత వడపోస్తే మునగాకు కషాయం సిద్ధం అవుతుంది. అది చల్లారిని తర్వాత పెరుగుమీద ఉండే తేటను అందులో కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే ఔషధం రెడీ అయినట్టే.

అరకప్పు మునగాకు కషాయానికి అరకప్పు పెరుగుపై ఉండే తేటను కలుపుకుని.. ఈ ఔషధాన్ని కొద్ది రోజుల పాటు ఉదయం, సాయంత్రం తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని గోరు వెచ్చగానే తీసుకోవాలి.

Last Updated : Jan 8, 2023, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.