ETV Bharat / sukhibhava

Corona: కరోనా భయం.. బయటపడేదెలా?

author img

By

Published : Jun 29, 2021, 2:24 PM IST

ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కొవిడ్-19 వైరస్​ భయం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు దశల్లో వేలమందిని బలితీసుకుంది. మూడో వేవ్​ రాబోతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి కరోనా ఫోబియా నుంచి బయటపడేదెలా?

covid-19 fear
కరోనా ఫోబియా

కరోనా వైరస్‌ చాలామందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రెండు దశల్లో ఇప్పటికే వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి నుంచి మరో ముప్పు పొంచి ఉందన్న వైద్యనిపుణుల హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని పక్కన పెడితే ఆ దిగులుతోనే చాలామంది మంచాన పడుతున్నారని, ధైర్యంగా ఉంటే ఈ వైరస్‌ ఏమీ చేయలేదని నిపుణులు పదేపదే చెబుతున్నా.. ఏ మూలనో భయం వెంటాడుతూనే ఉంది. తీవ్ర ఆందోళనతో కొందరు అనారోగ్యం పాలవుతున్నారు. అసలు ఆందోళనకు, అనారోగ్యానికి మధ్య సంబంధం ఏంటి? దీని నుంచి బయటపడే మార్గమేంటి?

మానసిక ఒత్తిడిలో..

coronaphobia
ఒత్తిడిని గుర్తించేది ఎలా?

ఇటీవల సామాజిక మాధ్యమాల విస్తృతి బాగా పెరిగిపోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో వైరల్‌ అయిపోతోంది. కరోనా వైరస్‌ గురించి కూడా రకరకాల వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేక ప్రజలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి దీర్ఘకాలంగా కొనసాగితే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

తీవ్రంగా మహమ్మారి ప్రభావం

శరీర ఆరోగ్యాన్ని ముందుగానే గుర్తించగలిగే సామర్థ్యం మనిషి మెదడుకు ఉంది. అయితే ఎలా ప్రతిస్పందించాలన్న విషయం మాత్రం మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. ధైర్యంగా, గుండె నిబ్బరంతో ఉన్న వాళ్లు కరోనా నుంచి సులువుగా కోలుకోగలుగుతున్నారు. అదే విపరీతమైన భయాందోళనలకు గురైన వారిపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని చాలామంది చెబుతూనే ఉన్నారు. ఇటీవల నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లోనూ ఇదే తేలింది.

కరోనా బాధితులు చాలామంది ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గులాంటి చిన్నపాటి లక్షణాలతోనే బయటపడగా.. తక్కువ మందికి మాత్రమే అది ప్రాణాంతకంగా మారుతోంది. ఆందోళనకు గురైనప్పుడు మెదడులోని గ్రంథి నుంచి అడ్రినలిన్‌ హార్మోను విడుదలవుతుంది. బాదంగింజ ఆకారంలో ఉండే అమెగ్డాలా స్పందించి.. భావోద్వేగాలను, ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. కానీ దీర్ఘకాలంగా ఒత్తిడి గురైన వారిలో ఈ పనితీరు దెబ్బతింటుంది. దీంతో మానసిక సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది.

coronaphobia
రోజూ వ్యాయామం

ఒత్తిడిని గుర్తించడమెలా?

కొన్నిసార్లు ఒత్తిడికి గురవ్వడం సహజమే. అయితే ఆందోళనల కారణంగా ఒత్తిడికి గురైతే అది దీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. ఈ లక్షణాలను గమనించి ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుసుకోవచ్చు. 1. శక్తి సన్నగిల్లడం 2. నిద్రలేమి 3. దిగులు 4. గుండె వేగం పెరగడం 5. తరచూ తలనొప్పి 6. అజీర్ణం 7. ఆకలి లేమి 8. విసుగు 9. చిన్న విషయానికే ఆందోళన 10. అలసట 11.ఒంటరిగా గడపడం 12.నిర్ణయాలు తీసుకోలేకపోవడం..

ఒత్తిడిని అధిగమిస్తేనే సాంత్వన

ప్రపంచంలో జరిగే పరిణామాలను ఆపే శక్తి మనకుండకపోవచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఒత్తిడిని అధిగమిస్తే మనసుకు సాంత్వన చేకూరుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యం. కరోనా గురించి సమాచారం తెలుసుకోవడం మంచిదే. కానీ, అదే పనిగా అన్నీ తెలుసుకుంటే ఆందోళనకు గురయ్యే ప్రమాదముంది. ఈ విపత్కర పరిస్థితుల్లో మహమ్మారి గురించి భయపెట్టే వార్తలకు దూరంగా ఉండటం ఉత్తమం. మీ దగ్గర్లోని వైద్యుడు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి తప్ప.. బయటి వ్యక్తులెవరో చెప్పినవన్నీ నిజాలుగా భావించి ఆందోళన చెందకూడదు.

మరిన్ని చిట్కాలు

  • ఏదైనా కష్టం వచ్చినప్పుడు సన్నిహితులతో పంచుకుంటే చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. అందువల్ల కరోనా కష్టకాలంలో వీలైనంత వరకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. దీంతో అనవసరపు భయాలు తొలగిపోతాయి. అలాగే మీరు కూడా ఇతరులకు ధైర్యం నింపే విషయాలను వారితో పంచుకోండి.
  • పొద్దస్తమానం టీవీలో కరోనా వ్యాప్తికి సంబంధించిన వార్తలు చూస్తూ ఆందోళనకు గురికావొద్దు. రోజులో కొన్ని గంటలపాటైనా టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి.
  • ప్రతిరోజూ నిర్ణీత సమయంలో వ్యాయామం, యోగా లాంటివి చేయండి. మీకు నచ్చిన పుస్తకాలు చదువుకోండి. ఒత్తిడి, భయాందోళనల నుంచి గట్టెక్కేందుకు వ్యాయామం చక్కని పరిష్కారమని మరచిపోవద్దు.
  • వీలైతే జనావాసాలకు దూరంగా కొద్దిసేపు గడిపేందుకు ప్రయత్నించండి. ప్రశాంత వాతావరణంలో చల్లని గాలి పీల్చుకుంటే ఒత్తిడిని చాలా వరకు అదుపు చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • భోజన నియమాలు కచ్చితంగా పాటించాలి. వీలైనంత వరకు ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పళ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
  • వీటన్నింటికీ తోడు శరీరం డీ హైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. కనీసం రోజుకు నాలుగైదు లీటర్ల నీరు తాగాలి. రోజుకు ఏడెనిమిది గంటలపాటు కచ్చితంగా నిద్రపోవాలి.

ఇదీ చదవండి: ఆరోగ్యానికి పోషకాహారం- జబ్బులు మటుమాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.