Beauty Tips For Face: వీటిని ముఖానికి వాడితే ఇక అంతే!

author img

By

Published : Jan 10, 2022, 5:24 PM IST

Health Tips For Face

Health Tips For Face: ముఖ సౌందర్యం కోసం మార్కెట్లో దొరికే అనేక ఉత్పత్తులను వాడుతుంటారు అమ్మాయిలు. మరికొంతమంది ఇంటి చిట్కాలను ఎంచుకుంటారు. అయితే వీటిలో ముఖానికి వాడకూడనివి కూడా కొన్ని ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో మీరు తెలుసుకోండి.

Beauty Tips For Face: అందమంటే ముఖ్యంగా ముఖ సౌందర్యం పైనే శ్రద్ధ పెడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో ఇటు ఇంటి చిట్కాలను, అటు బయట దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల్ని వాడుతుంటారు. అయితే వీటిలో ముఖానికి వాడకూడని పదార్థాలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఆ విషయం తెలియక చాలామంది తమ ముఖ సౌందర్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మరి, ఇంతకీ అందాన్ని సంరక్షించుకునే క్రమంలో ముఖానికి వాడకూడదని ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి..

Health Tips For Face
.

బాడీ లోషన్

చలికాలంలో చర్మానికి తేమనందించడానికి బాడీ లోషన్‌ ఉపయోగించడం మనకు అలవాటే! అయితే కొంతమంది దీన్నే ముఖానికి కూడా వాడుతుంటారు. ఫలితంగా ఇందులోని జిడ్డుదనం ముఖ చర్మ రంధ్రాల్లోకి చేరి.. క్రమంగా మొటిమలు రావడానికి దారితీస్తుంది. ఇక దీనిలో ఉండే కృత్రిమ పరిమళాలు మృదువుగా ఉండే ముఖ చర్మంపై అలర్జీలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బ్యూటీ ఉత్పత్తులు.. అది కూడా పారాబెన్‌.. వంటి రసాయనం లేనివి ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని కొనేముందు ఓసారి లేబుల్‌ పరిశీలించడం మర్చిపోవద్దు.

Health Tips For Face
.

నిమ్మకు బదులు..!

ముఖానికి ఉపయోగించే స్క్రబ్స్‌, ఫేస్‌ప్యాక్స్‌.. వంటి వాటిలో నిమ్మను ఉపయోగించడం సహజమే. కొంతమందైతే నిమ్మచెక్కను నేరుగా ముఖంపై రుద్దుకుంటుంటారు. అయితే ఇందులోని Psoralen అనే రసాయనిక సమ్మేళనం ముఖ చర్మాన్ని మరింత సున్నితంగా మార్చుతుంది. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం ఇరిటేషన్‌కి గురై దురద, మంట.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి దీనికి బదులుగా బంగాళాదుంప, టొమాటో.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలైతే మంచివంటున్నారు నిపుణులు.

Health Tips For Face
.

టూత్‌పేస్ట్‌ వద్దు!

మొటిమలున్న చోట టూత్‌పేస్ట్‌ రాయమని సలహా ఇస్తుంటారు చాలామంది. కానీ వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది అప్లై చేసిన చోట చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా ఆ ప్రదేశంలో నల్ల మచ్చలు, రంగు మారడం.. వంటి సమస్యలొస్తాయి. అలాగే ఇందులోని గాఢమైన పదార్థాల వల్ల కొంతమందిలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు కూడా రావచ్చట! కాబట్టి మొటిమల కోసమే అయితే వివిధ రకాల ఇంటి చిట్కాల్ని ఉపయోగించచ్చు.. లేదంటే నిపుణుల సలహా మేరకు క్రీమ్‌లు కూడా వాడచ్చు.

Health Tips For Face
.

వ్యాక్స్‌ చేస్తున్నారా?

ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి చాలామంది అనుసరించే పద్ధతి వ్యాక్స్‌ చేసుకోవడం. ఇందుకు అనుగుణంగానే వ్యాక్స్‌ స్ట్రిప్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం చర్మం ఎరుపెక్కడం, దద్దుర్లు రావడం, ముడతలు పడడంతో పాటు చర్మం మరింత సున్నితంగా మారుతుంది. తద్వారా ఎండలోకి వెళ్లినప్పుడు కందిపోవడం, ర్యాషెస్‌.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి ఫేషియల్‌ వ్యాక్స్‌ ఎంచుకునే ముందు చర్మతత్వాన్ని పరిగణనలోకి తీసుకోవడం, ఇంట్లో తయారుచేసుకున్న వ్యాక్స్‌ అయినా.. బయటి నుంచి తెచ్చిన స్ట్రిప్‌ అయినా.. అప్లై చేసుకునే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

Health Tips For Face
.

ఇవి కూడా!

  • కొబ్బరి నూనెలో 90 శాతం శ్యాచురేటెడ్‌ కొవ్వులుంటాయి. ఇవి చర్మ రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. జిడ్డుదనాన్ని పెంచుతాయి. తద్వారా కూడా మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.
  • యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లోని ఆమ్ల సమ్మేళనాలు మృదువైన ముఖ చర్మంపై హైపర్‌ పిగ్మెంటేషన్‌కి కారణమవుతాయి. కాబట్టి దీన్ని ఫేస్‌ప్యాక్‌లు/ఫేస్‌మాస్కుల్లో వాడకపోవడం, ఈ పదార్థం ఉన్న సౌందర్య ఉత్పత్తుల్ని ఎంచుకోకపోవడం మేలు!
  • వివిధ రకాల బ్యూటీ చికిత్సల్లో భాగంగా బేకింగ్‌ సోడాను ముఖానికి ఉపయోగిస్తుంటాం. అయితే దీనివల్ల సమస్య తగ్గడం అటుంచితే దీర్ఘకాలంలో హైపర్‌ పిగ్మెంటేషన్‌ బారిన పడే ప్రమాదమే ఎక్కువంటున్నారు నిపుణులు.
  • చలికాలం వేడినీళ్ల స్నానం హాయినిస్తుంది. అయితే వేడి ఎక్కువగా ఉన్న నీళ్లు మృదువుగా ఉండే ముఖ చర్మానికి వాడినట్లయితే అది తేమను కోల్పోయి పొడిబారిపోతుంది. కాబట్టి ముఖానికైనా, స్నానానికైనా గోరువెచ్చటి నీళ్లు వాడడమే ఉత్తమం.
  • గరుకుగా ఉండే చక్కెర ముఖ చర్మాన్ని పొడిబారేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. చర్మంపై దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం.. వంటి సమస్యలూ రావచ్చు. కాబట్టి వివిధ రకాల బ్యూటీ చికిత్సల్లో భాగంగా దీన్ని ఉపయోగించాలనుకుంటే మాత్రం చక్కెర పొడిని, అది కూడా తక్కువ మోతాదులో వాడడం మంచిది.
  • షాంపూ చేసుకునేటప్పుడు ఆ నురగ ముఖం పైకి వస్తుంటుంది. తద్వారా అందులోని అధిక గాఢత సున్నితమైన ముఖ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. చేస్తాయి. అందుకే షాంపూ ముఖం పైకి రాకుండా జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు.
  • శరీరానికి ఉపయోగించే సబ్బుల్నే ముఖానికీ వాడడం మనకు అలవాటు! అయితే దానికి బదులు ముఖం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఫేస్‌వాష్‌లను ఉపయోగిస్తే ముఖ చర్మాన్ని మరింత చక్కగా సంరక్షించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో చర్మతత్వాన్ని బట్టి ఆయా ఫేస్‌వాష్‌లు ఎంచుకోవాలన్న విషయం మర్చిపోవద్దు.

అలాగే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తులు ఎక్స్‌పైరీ తేదీని బట్టి ఎప్పటికప్పుడు మార్చడం, ఏ బ్యూటీ ఉత్పత్తైనా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవడం, ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకున్నాకే ఉపయోగించడం.. వంటివి తప్పనిసరి!

ఇదీ చూడండి: చలికాలంలో వ్యాధుల నుంచి రక్షణకు ఇవి తినేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.