ETV Bharat / sukhibhava

ఫలాల రారాజు మామిడితో మహత్తర ఆరోగ్యం

author img

By

Published : Apr 19, 2021, 10:30 AM IST

వేసవి కాలంతో పాటు మనం ఎంతగానో ఇష్టపడే, నోరూరించే మామిడి పళ్లు కూడా వచ్చేశాయి. భారత్​లోని ప్రతి రాష్ట్రం.. అక్కడ లభించే మామిడి రకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటాయి. మెరుస్తున్న తియ్యటి మామిడి పళ్లలో ఎన్నో పోషకాలు, శక్తి దాగున్నాయి. పళ్లలో రారాజు అయిన మామిడి మనకు అందించే ఆరోగ్యం అమూల్యం.

health benefits of the king of fruits mango
ఫలాల రారాజు మామిడితో మహత్తర ఆరోగ్యం

వేసవి రాగానే వీధులు మామిడి పళ్లతో కళకళలాడుతుంటాయి. నోరూరించే ఈ బంగారు రంగు పళ్లను పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టపడని వారుండరు. పండును కోసి ముక్కలు చేసి తినే వారు కొందరు, రంధ్రం చేసి గుజ్జును అలాగే జుర్రుకునే వారు కొందరు, లస్సీ, మ్యాంగో షేక్​గా చేసి తాగేవారు మరికొందరు.. ఇలా అనేక రకాలుగా మామిడిని రుచి చూస్తారు. ఇందులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

పోషకాలు:

మామిడి పళ్లలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. విటమిన్ ఎ, బి5, బి6, సి, ఇ, కె లతో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫోలేట్ మొదలైనవి ఉన్నాయి. ఇది మనకు అందించే క్యాలరీలు కూడా తక్కువే. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. ఇనుప ధాతువు (ఐరన్) రక్తంలోకి చేరి కణజాలాల్లో మరమ్మతులు వేగంగా జరుగుతాయి. ఒకరోజులో మనకు అవసరమయ్యే విటమిన్ సి పరిమాణంలో 70 శాతాన్ని మామిడి పండు అందించగలదు.

యాంటీ ఆక్సిడెంట్లుగా మామిడి పళ్లు:

శరీరంలో నిత్యం జరిగే కణజీవన చర్యలలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ అనే విష పదార్ధాలను సంహరించటంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర వహిస్తాయి. మామిడి పళ్లలో ఇవి.. పాలిఫెనాల్స్ రూపంలో ఉన్నాయి.

మెరిసే చర్మం కోసం:

మామిడి పండులో విటమిన్ ఎ, సి ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రభ (గ్లో) కలుగుతుంది. చర్మపు ముడుతలను మామిడి ఎదుర్కోగలదు. విటమిన్ సి కొలాజన్​ను తయారుచేయటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కావున చర్మపు బిగుతును రక్షిస్తుంది. వేసవి ఎండలో తీక్షణమైన అల్ట్రా వయోలెట్ కారణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడతాయి.

జీర్ణ మండల ఆరోగ్యానికి:

మామిడి పళ్లలో ఉన్న ఎంజైములు మనం తిన్న ఆహారంలోని బృహదణువులను, సంక్లిష్ట పిండిపదార్ధాలను, మాంసకృత్తులను ఛేదించి జీర్ణక్రియలో సహాయం చేస్తాయి. ఈ పళ్లలో ఉన్న పీచు పదార్ధం జీర్ణ మండల పనితీరును మెరుగుపరచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.

కంటి చూపునకు మామిడి:

కంటి ఆరోగ్యానికి మామిడి ఎనలేని మేలు చేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ ఎ దృష్టిని పెంపొందిస్తే, యాంటాక్సిడెంట్లు, జీక్సాంథిన్, ల్యూటిన్ కంటి కండరాల బలహీనతను ఎదుర్కొని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.

క్యాన్సర్ నుంచి రక్షణ:

మామిడిలో బీటా కెరాటిన్ అధిక మోతాదులో ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఇది చర్మ క్యాన్సర్​ను నివారించగలదు. మిగతా యాంటాక్సిడెంట్లు పెద్ద పేగు, ఊపిరితిత్తుల, ఛాతీ క్యాన్సర్​ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

అందువల్ల, మామిడి పళ్లు మన ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటాయని గుర్తుంచుకోండి. గుండె ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు, కొలెస్టిరాల్, శరీర బరువు తగ్గటానికి మామిడి పళ్లు ఒక మార్గం. నిస్సందేహంగా మామిడి మనకు ఆరోగ్యాన్ని అందించే అద్వితీయమైన ఫలం. ఈ వేసవిలో మామిడి పళ్లను ఆస్వాదిస్తూ ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని పొందండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.