yadadri: దేదీప్యమానంగా యాదాద్రి.. ముమ్మరంగా ఆలయ అభివృద్ధి పనులు

author img

By

Published : Aug 29, 2021, 4:32 PM IST

Updated : Aug 29, 2021, 5:35 PM IST

yadadri recontruction works, sri lakshmi narasimha swamy temple

భక్తజన సందోహం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి(yadadri) ఆలయ అభివృద్ధి పనులు చకాచకా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్(cm kcr) దిశానిర్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నారు. సకల హంగులతో నారసింహుని క్షేత్రాన్ని ముస్తాబుచేస్తున్నారు. అన్ని పనులు ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు.

yadadri recontruction works, sri lakshmi narasimha swamy temple
కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా..

దసరా వరకు స్తంభోద్భవుడి ఆలయాన్ని ప్రారంభించేందుకు యాడా(ytda) కసరత్తు చేస్తోంది. యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మి నరసింహ స్వామి(sri lakshmi narasimha swamy) ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సప్తగోపురాలతో నారసింహుని ప్రధాన ఆలయ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. అనుబంధ శివాలయం దాదాపుగా పూర్తయింది. ప్రెసిడెన్షియల్ సూట్స్, బాహ్య వలయ రహదారి, పెద్దగుట్టపై నిర్మిస్తున్న ఆలయ నగరి పనులు తుది దశలో ఉన్నాయి.

yadadri recontruction works, sri lakshmi narasimha swamy temple
చకాచకా పునర్నిర్మాణ పనులు

సీఎం ఆదేశం

నెలన్నర క్రితం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్(cm kcr) మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దసరాకు ఆలయ ఉద్ఘాటన ఉండే అవకాశమున్నట్లు సంబంధిత యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ytda) వర్గాలు 'ఈనాడు-ఈటీవీ భారత్​'కి వెల్లడించాయి.

yadadri recontruction works, sri lakshmi narasimha swamy temple
కొండచూట్టూ పచ్చదనం

పక్కా వాస్తు

పాంచరాత్ర ఆగమ, సంఖ్యా శాస్త్రం ప్రకారం 2.33 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయుల శిల్పకళ ఉట్టి పడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మించారు. మాడ వీధులు, ప్రాకారాలతో కలిపి క్షేత్రం 4.3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలు, మహాముఖ మండపం, రాజ గోపురాలు, దివ్యవిమాన గోపురాల నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయానికి రెండు ప్రాకారాలతో పాటు నలువైపులా నిర్మించిన సాలాహారాల్లో దివ్య దేశాలు (వైష్ణవానికి సంబంధించిన ఆలయాలు), దశావతారాలు, నారసింహుడి రూపాలు పొందుపర్చారు.

yadadri recontruction works, sri lakshmi narasimha swamy temple
తుది దశకు వలయ రహదారుల నిర్మాణఁ

తుది దశలో పనులు

గర్భాలయానికి 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉండే ఎత్తయిన ద్వారాలు బిగించారు. వీటికి బంగారు తాపడం చేసే పనులు పూర్తి చేశారు. మహా ముఖమండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉప ఆలయాల నిర్మాణాలూ ఇప్పటికే పూర్తయ్యాయి. గర్భాలయ ప్రవేశ ద్వారంపైన శంకు, చక్ర నామాలతో పాటు శ్రీస్వామి భక్తులను స్వాగతించేలా గరుడ ఆళ్వార్లు, ఆంజనేయ స్వామి విగ్రహాలు రూపొందించారు. ప్రధానాలయం బయట ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. పట్టణం నుంచి కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం, ఈ దారిలో రాజగోపుర నిర్మాణం తుది దశకు చేరుకుంది. గోపురాలపై కలశాల ఏర్పాటు, బలి పీఠం, ధ్వజస్తంభం ఏర్పాటు ఉద్ఘాటన సమయంలోనే చేయనున్నారు.

కృష్ణశిలతోనే శివాలయం..

ప్రధానాలయానికి అనుబంధంగా పునర్నిర్మి స్తున్న శివాలయం కృష్ణశిలతోనే సిద్ధమవు తోంది. ఇదే ఆవరణలో పరివార దేవాలయాలైన గణపతి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, యాగశాలలు నిర్మిస్తున్నారు. సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవ సంబంధ విగ్రహాలను అమర్చాలని స్థపతులు నిర్ణయించారు. శివాలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి.

చకాచకా ప్రెసిడెన్షియల్ సూట్స్

ప్రధానాలయానికి ఉత్తరాన 13 ఎకరాల గుట్టపై రూ.104 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. స్వామి దర్శనం కోసం వచ్చే రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లాంటి ముఖ్యులు బస చేసేందుకు వీలుగా ఒక ప్రెసిడెన్షియల్ సూట్​తో పాటు ఇతర వీఐపీల బసకు మరో 14 విల్లాలు నిర్మిస్తున్నారు. 13 విల్లాల నిర్మాణం పూర్తవగా... మరో విల్లా పనులు తుది దశలో ఉన్నాయి. ప్రధానాలయ కొండ చుట్టూ రూ.143 కోట్లతో 5.7 కి. మీ. మేర బాహ్యవలయ రహదారి నిర్మాణం జరుగుతోంది.

సమన్వయ లోపం... వ్యయప్రయాస

ఆలయ పునర్నిర్మాణంలో వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో నిర్మించిన కొన్ని కట్టడాలను కూల్చివేశారు. సీఎం కేసీఆర్ సూచించిన ప్రకారం కొన్ని నిర్మాణాలు లేకపోవడంతో వాటిని పునర్నిర్మించారు. దాదాపు కోట్ల రూపాయల మేర ప్రజాధనం వృథా అయింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులతో పాత తులసి తోట ప్రాంగణంలో బోటింగ్ కోసం నిర్మించిన ప్రాంగణాన్ని తొలగించారు. సత్యనారాయణ స్వామి వ్రతమండపం పేరిట రూ.కోటితో నిర్మించిన రెండంతస్తులతో కూడిన స్లాబు, పిల్లర్లను వాస్తుకు విరుద్ధంగా ఉందంటూ వైటీడీఏ అధికారులు కూల్చేశారు. వ్రత మండపం పేరిట నిర్మించిన భవనాన్ని క్యూ కాంప్లెక్స్​గా మార్చిన అధికారులు వాస్తురీత్యా విస్తరిస్తున్నారు.

- కిషన్ రావు, వైటీడీఏ వైస్ ఛైర్మన్

యాదాద్రి పునర్నిర్మాణం, శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం

ఆహ్లాదకరంగా ఆలయ నగరి

పెద్దగుట్టపై 850 ఎకరాల్లో ఆలయ నగరి నిర్మిస్తున్నారు. విశాల రహదారులను నిర్మించడంతో పాటు 30 ఎకరాల్లో పచ్చదనం పెంచారు. గండిచెరువు వద్ద పుష్కరిణి, కల్యాణ కట్ట నిర్మాణ పనులు సాగుతున్నాయి. బస్ బే నుంచి దైవ దర్శనానికి వెళ్లేందుకు మరో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నారు. ఉత్తర దిశలో రక్షణ గోడ నిర్మాణం సైతం తుది దశలో ఉంది. కొండపైన విష్ణుపుష్కరిణి పునరుద్ధరణ పనులతో పాటు క్యూ కాంప్లెక్స్​ల నిర్మాణం తుది దశలో ఉంది. లడ్డూ, ప్రసాదాల కేంద్రం పనులు పూర్తయ్యాయి.

సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు క్షేత్రస్థాయిలో పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. ఒకటి, రెండు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని సంకల్పించాం. ఉద్ఘాటన ఎప్పుడు అనేది సీఎం నిర్ణయంపై ఆధారపడి ఉంది.

-గీతా రెడ్డి, ఆలయ ఈవో

ఇదీ చదవండి: చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Last Updated :Aug 29, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.