ETV Bharat / state

యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై మళ్లీ ఆశలు.. ఈసారైనా..!

author img

By

Published : Dec 1, 2022, 9:27 AM IST

యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై మళ్లీ ఆశలు.. ఈసారైనా..!
యాదాద్రికి ఎంఎంటీఎస్‌పై మళ్లీ ఆశలు.. ఈసారైనా..!

యాదాద్రికి ఎంఎంటీఎస్​ సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న వారు త్వరలోనే శుభవార్త విననున్నారా.. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఆ కల త్వరలోనే సాకారమయ్యేనా.. సికింద్రాబాద్​ నుంచి యాదాద్రి (రాయగిరి) వరకు ఎంఎంటీఎస్​ పట్టాలెక్కేనా.. ఎంఎంటీఎస్​ రెండోదశకు నిధులు కేటాయిస్తామన్న మంత్రి కేటీఆర్ ప్రకటనతో యాదాద్రికి ఎంఎంటీఎస్​పై మళ్లీ ఆశలు చిగురించాయి. ​

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా.. శని, ఆదివారాల్లో 50 వేల మంది దర్శించుకుంటున్నారు. నగరం నుంచి వెళ్లేవారే అత్యధికులు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే తక్కువ ఖర్చుతో ప్రయాణ వనరు కల్పించాలని నిర్ణయించింది. ఎంఎంటీఎస్‌ రెండో దశ పొడిగింపే సరైనదని భావించింది. ప్రణాళికలు సిద్ధం చేసినా అది పట్టాలెక్కలేదు. తాజాగా మంత్రి కేటీఆర్‌ ప్రకటనతో ఆశలు చిగురించాయి.

మరో 32 కి.మీ. మాత్రమే..: సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌(21 కి.మీ.) వరకూ ఎంఎంటీఎస్‌ రెండో దశ కింద రైల్వే లైను నిర్మిస్తున్నారు. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి(రాయగిరి) వరకూ మరో 32 కి.మీ. రెండో దశను పొడిగిస్తే భక్తులు సులభంగా యాదాద్రికి వెళ్లొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అంచనాలు రూపొందించాలని ఆరేళ్ల క్రితం రైల్వేశాఖను కోరగా అప్పట్లో రూ.330 కోట్లు అవుతుందని తేల్చింది. ఒక వాటాగా రైల్వే రూ.110 కోట్లు సమకూర్చాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల కింద రూ.220 కోట్లు అందజేయాల్సి ఉంది. రెండో దశ పూర్తయితే నగరం నుంచి రూ.15 టికెట్‌తో యాదాద్రి చేరుకునే అవకాశం లభించేది.

రూ.816 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.544 కోట్లకు గానూ ఇప్పటి వరకూ రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. దీంతో పనులు ఆగిపోయాయి. ఇటీవల రూ.200 కోట్లు కేటాయిస్తామని పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో మళ్లీ యాదాద్రికి ఎంఎంటీఎస్‌ రెండో దశ పొడిగింపు ఆశలు చిగురించాయి.

ఇవీ చూడండి..

మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం అందించండి: కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ

ఆన్‌లైన్‌లో వైకుంఠద్వార దర్శన టికెట్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.