ETV Bharat / state

మునుగోడులో పతాకస్థాయికి ప్రచార హోరు.. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్‌లు.!!

author img

By

Published : Oct 21, 2022, 9:41 PM IST

Spiritual gatherings in munugode election
మునుగోడు ఉపఎన్నిక

Munugode bypoll: ఆత్మీయంగా పలకరిస్తారు... బంధువుల్లా కలసిపోతారు.. కలివిడిగా మాట్లాడతారు. ఓటెయ్యమని ప్రాథేయపడతారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. తమ పార్టీకే ఓటేయాలని ఓటర్లను ఏకంగా దేవాలయాలకు తీసుకెళ్లి ఒట్టేయించుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రతి రోజూ ఇటువంటి కార్యక్రమాలే కొనసాగుతున్నాయి.

Munugode bypoll: సాధారణంగా పుట్టినరోజు, పెళ్లిరోజు, మరేదైనా ప్రత్యేకమైన రోజు ఉంటేనే దావత్ లు ఏర్పాటు చేస్తారు. మునుగోడులో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి విందులు కొనసాగుతున్నాయి. రోజూ కార్యకర్తలకు ప్రధాన పార్టీలు కులసంఘాల వారీగా విందులు ఏర్పాటుచేస్తున్నాయి. నాటుకోడి, మేక మాంసం వండి ప్రేమగా వడ్డివార్చుతున్నారు. ప్రచారానికి వస్తున్న నేతలంతా నాటుకోళ్లే కావాలనడంతో స్థానిక నాయకులు వాటిని సమకూర్చడం కోసం నానాతంటాలు పడుతున్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉండటం వల్ల మునుగోడు ప్రాంతంలో నాటుకోళ్లు దొరకడంలేదు. గత్యంతరం లేక ద్వితీయశ్రేణి నేతలకు బాయిలర్ కోడితో సర్దిపెడుతున్నారు.

ప్రధాన పార్టీలన్నీ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటుచేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనంలో ఆయాకుల సంఘాల నేతలు కోరిన గొంతెమ్మ కోర్కెలను తీర్చుతామనే హామీలను నేతలు కుమ్మరిస్తున్నారు. ఆయా కులసంఘాల నేతలకు నమ్మకం కుదిరేందుకు కొంత మొత్తం అడ్వాన్స్‌గా ఆయా పార్టీలు చెల్లిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఇంచార్జ్ ముఖ్య నేతలుగా ఉన్న మంత్రుల ఖాతాల్లోంచి చెల్లిస్తామని నమ్మకంగా చెబుతున్నాయి. తమ గ్రామంలో గుడి,బడి కట్టించాలని,రోడ్లు వేయించాలని, విద్య,వైద్య సౌకర్యాలను కల్పించాలని, కల్వర్టులు, చిన్నపాటి వంతెనలను నిర్మించాలని ఆయా కులసంఘాల నేతలు ప్రధానపార్టీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు కొన్ని కులసంఘాలు అంగీకార పత్రాన్ని రాయించుకుంటున్నాయి.

ఆత్మీయ సమ్మేళనంలో అధికార పార్టీ ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు సమావేశాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. వీలైనన్ని హామీలు ఇస్తూ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలైతే ఆయా సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలకు చిన్న చిన్న పనులకు అవసరమైన నగదును కొంత చెల్లిస్తున్నాయి. సమావేశానికి వచ్చిన వారికి కడుపునిండా మటన్‌, బిర్యానీ పెట్టి మరీ ఓట్లు అడుగుతున్నాయి. చివరలో ఓటు మాత్రం తమకే వేయమని ప్రాధేయపడుతున్నాయి. పోలింగ్‌కు ముందు మీకు అందాల్సినవి అందుతాయని పార్టీలు భరోసా ఇస్తున్నాయి. ఎంత ఖర్చు పెట్టినా ఓటరు నాడి తెలియకపోవడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

గ్రామాలకు ఇంఛార్జ్‌లుగా ఉన్న నేతలకు మునుగోడు ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే నేతలు వ్యూహా, ప్రతి వ్యూహాలను తమదైన శైలిలో రచిస్తున్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ బూతులుండగా రోజూ ఒక్కో ప్రధాన పార్టీ మాసంతో భోజనం, మద్యం కోసం రోజుకు 20లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఇన్ని చేసినా ఓటర్లు తమకు ఓటు వేస్తారో లేదోనని చౌటుప్పల్ లో ఓ గ్రామానికి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న నిజామాబాద్ జిల్లా నేత ఓటర్లను బస్సుల్లో యాదాద్రి ఆలయానికి తీసుకెళ్లారు. దర్శనం చేయించి..గర్భగుడిలో ఒట్టేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మునుగోడులో ఆత్మీయ సమావేశాల పేరుతో దావత్​లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.