ETV Bharat / state

మహిళా చైతన్యమే సరికొత్త మార్పుగా చాటిచెబుతున్న మహిళలు

author img

By

Published : Jun 1, 2021, 2:29 PM IST

కుటుంబ బాగోగులు, పిల్లల ఆలనాపాలనలో అబల పాత్ర అనిర్వచనీయం. కార్యనిర్వహణలోనే కాదు.. కుటుంబ ఆర్థిక అభివృద్ధిలోనూ ముందుంటూ ఇల్లాలు ఇంటికి దీపంగా మారుతుంది. కుటుంబానికే కాదు.. సమాజాభివృద్ధికి బాటలు వేసే నారీశక్తి.. క్రమంగా సంప్రదాయ పగ్గాల్లోంచి బయటికొచ్చి.. తనదైన ముద్రవేస్తోంది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు యాదాద్రి జిల్లాకు చెందిన అతివలు. మహిళా చైతన్యమే సరికొత్త మార్పుగా చాటిచెబుతూ.. కుటుంబాలనే కాదు.. గ్రామానికీ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.

మహిళా చైతన్యమే సరికొత్త మార్పుగా చాటిచెబుతున్న మహిళలు
మహిళా చైతన్యమే సరికొత్త మార్పుగా చాటిచెబుతున్న మహిళలు

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం శివారెడ్డిగూడానికి చెందిన గ్రామ మహిళా సమాఖ్య వ్యాపారాభివృద్ధిలో రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. 2006లో 400 మంది మహిళలతో 34 స్వయం సహాయక బృందాలతో ఏర్పాటైన ఈ సమాఖ్యలో మహిళలంతా కలిసి రోజుకు ఒక్కో రూపాయి చొప్పున పొదుపు ప్రారంభించారు. అంతా పేద, మధ్య తరగతి రైతు, కూలీ కుటుంబాలకు చెందినవారే అవటంతో తమ పొదుపు చర్యల ద్వారా బ్యాంకర్లను ఆకర్షించారు. బ్యాంకుల నుంచి చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకుంటూ గేదెలు, మేకల పెంపకం, విస్తరాకుల తయారీ, కుట్టు మిషన్లు వంటి పనులపై దృష్టి కేంద్రీకరించారు. ఇలా తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి మెప్పు పొందారు.

వెనక్కి తిరిగి చూసుకోలేదు..

ఇది గమనించిన గ్రామీణాభివృద్ధి సంస్థ-సెర్ప్.. 2009లో అదే ఊరిలో ఇందిరా క్రాంతి పథకం-ఐకేపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ధాన్యం కొనుగోలు బాధ్యతలను గ్రామ మహిళా సమాఖ్యకు అప్పగించింది. ఇక అప్పటి నుంచి ఇక్కడి మహిళలు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏటా వానా కాలం, యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ సమాఖ్య అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమీషన్‌ సొమ్మును ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడంతోపాటు ధాన్యం వ్యాపారం విస్తరింపజేసేందుకు మార్కెట్‌ కోసం 8 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం నిల్వ, తూకం వంటి కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఈ స్థలంలోనే షెడ్లు, ప్లాట్‌ఫాంలు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒక్కొక్కరికి ఒక్కో పని

శివారెడ్డిగూడెం సహా ఇంద్రియాల, రామలింగంపల్లి, దంతూరు గ్రామాల రైతులంతా ఈ ఐకేపీ కేంద్రంలోనే ధాన్యం విక్రయిస్తారు. మూసీ పరివాహక ప్రాంతం కావడంతో.. ఈ ప్రాంతంలో అధిక శాతం రైతులు వరి పంట సాగు చేస్తుంటారు. ప్రతి మార్కెటింగ్ సీజన్‌లో లక్షా 35 నుంచి లక్షా 60 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కో పని కేటాయించి.. తూకం, నాణ్యత, బస్తాల లెక్క, బిల్లులు రాసివ్వడం, రికార్డు నిర్వహణ, డాటా ఎంట్రీలాంటి పనులు వీరు నిర్వర్తిస్తుంటారు.

రూ.3 కోట్ల వరకు కమీషన్​

గ్రామాభివృద్ధితో పాటు మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం ఈ సమాఖ్య చక్కటి తోడ్పాటు ఇస్తోంది. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రూ.3 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ రూపంలో ఆదాయం రావటం వీరి కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా శౌచాలయం నిర్మాణం, చిన్నసంఘాల అవసరాలు తీర్చేందుకు 26 సంఘాలకు రూ.2 లక్షల వరకు రుణాలు అందజేసింది. తాజాగా సమాఖ్య కార్యాలయం నిర్మాణానికి లక్ష రూపాయలు తక్కువ వడ్డీపై కేటాయించింది. ఊరిలో మహిళలను సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తూ ఈ సమాఖ్య ఆదర్శంగా నిలుస్తోంది.

ఏళ్ల తరబడిగా క్రమశిక్షణ, బాధ్యతతో సాగే ఈ మహిళా సమాఖ్యలో నిధులు సైతం పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఆధారపడకుండానే స్వయం సమృద్ధి సాధించిన ఘనత వీరి సొంతం. ధాన్యం సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ.. ఏడాదికేడాదికి అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న శివారెడ్డిగూడెం మహిళా సమాఖ్య అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: మెడికల్ హబ్‌గా ఓరుగల్లు.. వేగంగా అడుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.