ETV Bharat / state

Munugode bypoll: ఓటుకు నోటు.. మునుగోడులో ప్రలోభాల జోరు

author img

By

Published : Nov 2, 2022, 7:01 AM IST

Money and liquor in munugode by election : ప్రచార హోరు ముగిసింది..! ప్రలోభాల జోరు కొనసాగుతోంది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉపపోరులో ప్రధాన పార్టీలు తెరవెనుక మంత్రాంగాన్ని పోటాపోటీగా కొనసాగిస్తున్నాయి. ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డిన నేతలు.. ఇప్పుడు డబ్బు, మద్యంతో తమవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నాయి. ఒక పార్టీ ఓటుకు మూడువేలు, క్వార్టర్‌ మద్యం పంపిణీ చేయగా.. మరో పార్టీ ఓటుకు నాలుగువేల చొప్పున ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే.. 20రోజుల కిందట 20వేలు, 30వేలు, తులం బంగారం అని చెప్పి తీరా 3వేలే ఇస్తున్నారని.. కొన్నిచోట్లు ఓటర్లు నిలదీస్తున్నారు.

vote
ఓటుకు నోటు

మునుగోడులో ఓటుకు నోటు

Money and liquor in munugode by election: అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించి పార్టీలు హోరాహోరీగా తలపడిన మునుగోడు ఉపఎన్నిక రేపు జరగనుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌లు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇంటింటి ప్రచారాలు, రోడ్‌షోలతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ప్రచార ఘట్టానికి తెరపడటంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు మునుగోడు నియోజకవర్గం నుంచి తరలివెళ్లారు. కొందరు కీలక నాయకులు ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాని సరిహద్దు మండలాల్లో మకాం వేశారు. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో వందలాది కార్లు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు పోటాపోటీగా తాయిలాలు అందించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి.

ఓటుకు డబ్బు, మద్యం పంపిణీ: ప్రధాన రాజకీయ పార్టీలు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచే నాయకుల కొనుగోలు, ప్రచారానికి భారీ వ్యయం, నిత్యం మద్యం పంపిణీ వంటివి కొనసాగించాయి. ప్రచారపర్వం ముగిసే సమయానికి ఓటర్లకు డబ్బు పంపిణీ మొదలుపెట్టాయి. మొదట ఒక పార్టీ ఓటుకు మూడువేలు, క్వార్టర్‌ మద్యం పంపిణీ చేయగా, మరో పార్టీ ఓటుకు నాలుగువేల చొప్పున ఇచ్చినట్లు పల్లెల్లో ప్రచారం జరుగుతోంది. మొదట మూడు వేలు ఇచ్చిన పార్టీ మళ్లీ రెండో దఫా ఇచ్చే అవకాశం ఉందని జనం చర్చించుకుంటున్నారు. నియోజకవర్గానికి బయట ప్రత్యేకించి హైదరాబాద్‌ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నవారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఏ పార్టీ కూడా ఓటర్లందరికీ గంపగుత్తగా సొమ్ము పంపిణీ చేయలేదు. రెండు పార్టీల నుంచి డబ్బులందాయని పలువురు తెలిపారు. మొత్తమ్మీద ఓట్ల కోసమే ఒక్క రోజులోనే కోట్ల రూపాయల పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రధాన పార్టీలు చివరి అస్త్రంగా డబ్బు పంపిణీలో పోటీపడ్డాయి. వందమంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని ఏర్పాటు చేసుకుని ప్రచారం నిర్వహించిన తమ పార్టీ ప్రత్యర్థి పార్టీకన్నా ఒక కట్ట ఎక్కువే అందజేయాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ శ్రేణులు కొందరు తెలిపారు. ఒక పార్టీ సోమవారం రాత్రి నుంచి పంపకాలు మొదలుపెట్టి మంగళవారం పొద్దుపోయే వరకు దాదాపు తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. అనంతరం ప్రత్యర్థి పార్టీ పంపకాలు చేయకుండా అన్నివైపులా కట్టడి చేసినట్లు తెలిసింది. తమ ఓటర్ల వద్దకు ప్రత్యర్థులు రాకుండా శ్రేణులతో కావలి కాసినట్లు తెలుస్తోంది.

డబ్బుల పంపిణీపై ప్రచారం జరిగిన స్థాయిలో అందడం లేదని పలుచోట్ల ఓటర్లు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఓటుకు 20 వేలు, 30వేలు, తులం బంగారం అని చెప్పి తీరా 3వేలే చేతిలో పెడుతున్నారని.. కొందరు నేరుగానే నేతలను ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్‌లో 6వేలు ఇచ్చి ఇక్కడ సగమే ఇస్తున్నారని నిలదీసినట్లు తెలిసింది. పలుచోట్లు నగదును కొందరు తిరస్కరించినట్లు సమాచారం. మొత్తంగా పోలీసులు భారీగా మోహరించినా డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా సాగిపోతున్నాయని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.