ETV Bharat / state

మోదీ సర్కారు అవినీతి బాగోతాల చిట్టా నా దగ్గరుంది: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Feb 12, 2022, 5:20 PM IST

Updated : Feb 13, 2022, 3:07 AM IST

CM kcr fires on modi government
మోదీ సర్కారు అవినీతి బాగోతాల చిట్టా నా వద్ద ఉంది: సీఎం కేసీఆర్‌

17:17 February 12

అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలి: సీఎం కేసీఆర్‌

రాయగిరి తెరాస బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం

CM kcr fires on modi government: గత ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏ వర్గానికీ మేలు జరగలేదని, ఈ దేశాన్ని భాజపా సర్వనాశనం చేసిందని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా తన దగ్గరకు వచ్చిందని, ఇంకొన్ని పద్దులు వస్తున్నాయని.. త్వరలోనే అన్నీ బయటపెడతానన్నారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె భాజపా అని.. దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచి జరుగుతుందని వ్యాఖ్యానించారు. భాజపాకు మతపిచ్చి ముదిరి దేశంలో పిచ్చిపిచ్చి చట్టాలు తీసుకువస్తోందని మండిపడ్డారు. యాదాద్రిలో వీవీఐపీల కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్లతో పాటు భువనగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని శనివారం సీఎం ప్రారంభించారు.

అనంతరం భువనగిరి శివారు రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘‘నిన్ననే పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ మాట్లాడారు. మొన్న ఉద్ధవ్‌, అంతకుముందు తమిళనాడు సీఎం స్టాలిన్‌తోనూ మాట్లాడా. కేంద్రం చేసే తప్పుడు విధానాలను దేశమంతా ఇంగ్లిష్‌, ఉర్దూ, హిందీలో చెబుతాం. అందరం కలిసి ఆ పార్టీపై పోరాటం చేస్తాం.దేశాన్ని నాశనం చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ప్రస్తుతం కర్ణాటకలో ఏం జరుగుతోందో ప్రపంచమంతా గమనిస్తోంది. పసికూనలపై అట్లా ప్రవర్తించొచ్చా? దేశ ఐటీ రంగానికి సిలికాన్‌ వ్యాలీ లాంటి బెంగళూరును కశ్మీర్‌ వ్యాలీగా మారుస్తున్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. అఫ్గానిస్థాన్‌లో 50 శాతం రాయితీ ఇస్తాం అంటే వస్తారా? ఈ దేశం ఎవడి సొత్తూ కాదు.

మోదీ.. పార్లమెంటులో తెలంగాణ గురించి ఎందుకు గోక్కుంటున్నావు. మా బతుకు మేం బతికాం.ఇప్పుడు మళ్లీ కాళ్లలో కట్టెందుకు పెడుతున్నావు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే నీ సంగతి చూస్తామంటున్నారు. కేసీఆర్‌ భయపడతాడా?భయపడితే తెలంగాణ వచ్చేదా? ఎల్లకాలం కేసీఆర్‌ ఒక్కరే కొట్లాడడు. తెలంగాణ సమాజం జాగ్రత్తగా ఉండాలి. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి. రాష్ట్రంలోని మేధావులు, విద్యార్థులంతా ఒకసారి ఆలోచించాలి.

దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి రోజురోజుకూ తగ్గిపోతోంది. సెప్టెంబరులో 4.4 శాతం ఉంటే అక్టోబరు నాటికి 4 శాతం, నవంబరులో 1.4, డిసెంబరులో 0.4 శాతానికి పడిపోయింది. ఇదేనా భాజపా పాలనకు తార్కాణం? ఈ ఎనిమిదేళ్లలో 15-16 లక్షల పరిశ్రమలు మూతబడ్డాయి. మతపిచ్చి, కర్ఫ్యూ, లాఠీఛార్జీలతో ఉంటే ఎవరి కడుపు నిండుతుంది. రాజకీయంగా ఈ సమయంలో కూడా స్పందించకపోతే దేశం నష్టపోతుంది. అమెరికా లాంటి దేశాల్లో మతపిచ్చి ఉండదు. అందుకే వారు ప్రపంచాన్ని ఏలుతున్నారు.'

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

రాహుల్‌పై వ్యాఖ్యలు వింటే కన్నీళ్లు వస్తున్నాయి

రాహుల్‌గాంధీ దేశంలోనే అతిపురాతనమైన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఆయన నాన్నమ్మ, నాన్న దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయనపై అస్సాం సీఎం హిమంతబిశ్వశర్మ వ్యాఖ్యలు నన్ను కలిచివేశాయి. అవి వింటే నా కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఇదేనా మీ సంస్కారం? ధర్మం గురించి ఎప్పుడూ మాట్లాడే మీకు ఇదే ధర్మం అని అనిపిస్తుందా? నేను ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు నడ్డాని డిమాండ్‌ చేస్తున్నా. తక్షణం ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయండి. సహనశీలతకు కూడా ఓ హద్దు ఉంటుంది. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా సహించం. మతపిచ్చి ప్రభుత్వం ఈ దేశానికి పనికిరాదు. తెలంగాణలో మీ ఆటలు చెల్లవు. కేంద్రంలో ప్రగతిశీల ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడానికి మనవంతుగా కృషి చేయాలి. అప్పుడే దేశానికి, రాష్ట్రానికి రక్ష’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌, భువనగిరి జిల్లాలు కలిసిపోతాయి..

సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభం తర్వాత సమావేశ మందిరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర తొలి సీఎస్‌గా పనిచేసిన అధికారితో చాలా రోజులు అధ్యయనం చేశాం. ఆ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లా కేరళ రాష్ట్రం కంటే పెద్దగా ఉంటుంది. దీంతో అభివృద్ధిలో దేశంలోనే వెనకబడి ఉంది. చాలా రాష్ట్రాల్లో జిల్లాల విభజన జరిగినా ఏపీ, పశ్చిమబెంగాల్లో ఎందుకనో జరగలేదు. ఎన్టీఆర్‌ సైతం జిల్లాల విభజనకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. రానున్న కాలంలో హైదరాబాద్‌ - వరంగల్‌ కారిడార్‌ దేశంలోనే గొప్పగా వెలుగొందుతుంది. యాదాద్రి ఆలయం పూర్తయితే హైదరాబాద్‌, భువనగిరి జిల్లా కలిసిపోతాయి. ఒకప్పుడు భువనగిరి, ఆలేరు, తుర్కపల్లి ప్రాంతాల్లో రూ.మూడు లక్షలకు ఎకరం ఉండేది. ఇప్పుడు ఏ మూల చూసినా రూ.20-30 లక్షలకు తక్కువ లేదు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, దేవరకొండ లాంటి ప్రాంతాల్లోనూ ఎకరం రూ.25 లక్షలు పలుకుతోంది. రాష్ట్రంలో ఆదాయం పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఉద్యోగులంతా భాగం కావాలి. ఇంకొన్ని రోజులు ఇలాగే కష్టపడితే మన సమస్యలన్నీ తీరతాయి. కేంద్రం నుంచి వచ్చే ఉద్యోగాలతో పాటూ రాష్ట్ర పరిధిలోనివి 95 శాతం స్థానికులకే దక్కుతాయి. మల్టీజోనల్‌ పోస్టులని చెప్పి గెజిటెడ్‌ ఉద్యోగాలు సైతం ఇక్కడి వారికే అందేలా ప్రభుత్వం కృషి చేసింది. దీని కోసం కేంద్రంతో కొట్లాడిన. తెలంగాణ వేరే దేశమా అని అన్నారు. గతంలో మనం పడ్డ గోసను వారికి వివరించి తెలంగాణ బిడ్డలకే అన్ని ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది’’ అని సీఎం మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మించిన కలెక్టరేట్లు కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలకు దీటుగా ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు.

ప్రెసిడెన్షియల్‌ సూట్ల ప్రారంభం..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం 1.13 గంటలకు ఎర్రవల్లి నుంచి యాదాద్రికి రహదారి మార్గంలో చేరుకున్నారు. వచ్చే నెల 21 నుంచి యాదాద్రిలో సుదర్శన మహాయాగం ప్రారంభం కానున్న నేపథ్యంలో క్షేత్రంలో రూ.143.80 కోట్లతో నిర్మించిన ప్రెసిడెన్షియల్‌ సూట్లను భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. అక్కడి నుంచే యాగశాల పనులను పరిశీలించారు. అనంతరం భువనగిరిలో తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, సంతోష్‌కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీత, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.

మోదీ తెలివితక్కువ నిర్ణయం లాక్‌డౌన్‌

‘కరోనా సమయంలో మోదీ తెలివితక్కువ లాక్‌డౌన్‌ నిర్ణయంతో కోట్ల మంది ఇబ్బందులు పడ్డారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో పవర్‌ పాలసీ, నీటి కేటాయింపులతో వాటర్‌ పాలసీ తెచ్చి దేశానికి నష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మోటార్లకు మీటర్లు పెట్టబోం. ప్రస్తుతం దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్తు అందుబాటులో ఉంది. ఉపయోగిస్తోంది 2 లక్షల మెగావాట్లు కూడా దాటదు. అందుబాటులో ఉన్న విద్యుత్తును ఉపయోగించుకునే తెలివి ప్రధాని మోదీకి లేదు. దేశంలో 65వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే ప్రస్తుతం 38 వేల టీఎంసీల నీళ్లనే వాడుతున్నాం. మరోవైపు కావేరి, గోదావరి నీటి కేటాయింపులపై ఇంకా కొట్లాటలే నడుస్తున్నాయి. మోదీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారు. 115 దేశాల్లో ఆకలిసర్వే చేస్తే మన దేశం 101వ స్థానంలో ఉంది. భాజపాను విమర్శిస్తే కేసీఆర్‌ నువ్వెంత.. సముద్రంలో నీటిచుక్కంత అని అంటున్నారు. మరి ఆ నీటిచుక్కకు ఎందుకు భయపడుతున్నారు?’అని సీఎం ప్రశ్నించారు.

ఇదీ చదవండి : CM KCR Yadadri Tour Speech: దేశం తిరోగమిస్తున్నా... తెలంగాణ పురోగమిస్తోంది: సీఎం కేసీఆర్​

Last Updated :Feb 13, 2022, 3:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.