ETV Bharat / state

బాపూజీ స్మరణలో... ఓరుగల్లులో గాంధీకి నిలువు దోపిడీ ఇచ్చినం!

author img

By

Published : Aug 15, 2021, 9:07 AM IST

గాంధీ.. ఈ పేరు చెపితే చాలు యావత్ భరత జాతీ పులకరించిపోతోంది. కానీ ఆ మహాత్ముడిని చూసే భాగ్యం కొందరికే దక్కింది. 1945లో గాంధీ ఓరుగల్లు విచ్చేశారు. ఉన్నది కాస్సేపైనా...నగర వాసులు.. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నిండుమనస్సుతో నీరాజనాలు సమర్పించారు.

warangal-people-remembered-the-mahatma-gandhi
గాంధీజి స్మరణలో ఓరుగల్లు వాసులు

మహాత్ముడి సారధ్యంలో అహింసే ఆయుధంగా సాగిన మన స్వతంత్ర పోరాటం.. చరిత్రలో మహోన్నత ఘట్టంగా నిలిచిపోతుంది. భారతీయులంతా ‍ఒక్కటై... ఉప్పెనలా విరుచుకుపడి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్ముడి తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అలాంటి గాంధీ పేరు చెబితే యావత్ భారతం పులకరించిపోతోంది. ఆ మహాత్ముడిని చూసే భాగ్యం కొందరికే దక్కింది. 1945 ఫిబ్రవరి 5న గాంధీ ఓరుగల్లు వచ్చారు.

అన్నం తిన్నంత మహా ఆనందంగా అనిపిచ్చింది...

గాంధీజిని చూసే వరకు ఎంతో ఉప్పొంగిపోయాము. చానా.. అన్నం తిన్నట్టుగా మహా ఆనందంగా అనిపిచ్చింది. మాకు ఎనలేని ప్రేమ అనిపిచ్చింది. ఆయనను చూసినందుకు మాకు ఎంతో కుషి అనిపిచ్చింది. ఇలాంటి సమయం మాకు మళ్లీ దొరుకుద్దా.. దొరకదా అనుకున్నా. ఒక 20 నిమిషాలు బాపూజీ గాంధీ గారు రైల్వే స్టేషన్​లోనే ఉండి అందరికీ చానా సంతోషపెట్టి వెళ్లిపోయినారు. అక్కడున్న నాయకులకు కూడా చాలా ఉత్సాహం కల్గింది. - గోనె రాజయ్య, కరీమాబాద్

దక్షిణ భారత హిందీ మహోత్సవాల్లో పాల్గొని మద్రాస్ నుంచి వార్దాకు ప్రత్యేక రైళ్లో వెళుతూ... కాస్సేపు వరంగల్‌లో ఆగారు. ఉన్నది కాసేపైనా నగరవాసులు.. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఒళ్లంతా కళ్లు చేసుకుని గాంధీని చూసిన వారంతా.... ఆ క్షణం పులకించిపోయారు. ఆ మధుర క్షణాలు ఇప్పటికీ మరుపురాని ఘట్టాలుగా వారి హృదయాల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు.

గాంధీకి నిలువు దోపిడీ ఇచ్చిర్రు...

ట్రెయిన్​కే వచ్చిండు. ఆంధ్రా నుంచి. వరంగల్ స్టేషన్​లనే మీటింగ్​ అరేంజ్​మెంట్స్ చేసిర్రు. మీటింగ్ గీటింగ్ అయిన తర్వాత ఆగిండన్నమాట. ఆగిన తర్వాత అందరూ నిలువు దోపిడీ ఇచ్చిండ్రు. నిలువుదోపిడీ అంటే ఎరుకేగా... ఒంటిమీదున్నవన్నీ ఇచ్చుడు బంగారం గింగారం. ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ చందాలు వచ్చినయ్. చాలా సంతోషపడ్డం. స్వాతంత్ర్యం గురించి మీరు పోరాటం చేయాల... బ్రిటీషోల్లను ఎలగొట్టాల, ఇంగ్లీషోల్లను. మీరు ధైర్నంగా చేయాల అని చెప్పిండు. ఆయనను చూస్తే సంతోషపడ్డం అందరం. అటెన్క ఆయన ఆశ్రమంకు కూడా పోయినం అందరం. - గడ్డం మల్లేషం, వరంగల్

ఇదీ చూడండి: CM KCR: గోల్కొండ కోటలో 10.30కి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.