ETV Bharat / state

కాలం చెల్లిన మాస్టర్​ప్లాన్​లు.. కాలం వెల్లదీస్తున్న అధికారులు..!

author img

By

Published : Nov 29, 2022, 7:41 AM IST

రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వాటి అభివృద్ధిలో ఎంతో కీలకమైన మాస్టర్​ప్లాన్ రూపకల్పనలో మాత్రం ఎప్పుడో 1972, 1974 సంవత్సర కాలం నాటిదే ఇప్పటికే అమలు చేస్తున్నారు. ​పెరుగుతున్న జనాభా, ప్రాంతాల విస్తరణకు అనుగుణంగా కనీసం 20 ఏళ్లకోసారి మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం ఉండగా.. ఇప్పటికీ కాలం చెల్లిన ఆ మాస్టర్​ప్లాన్​లతో మన అధికారులు కాలం వెల్లదీస్తున్నారు.

Hyderabad Master Plan
Hyderabad Master Plan

రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు వేగంగా విస్తరిస్తుండగా.. వాటి అభివృద్ధిలో అత్యంత కీలకమైన మాస్టర్‌ప్లాన్‌ల రూపకల్పనలో ఉదాసీనత వ్యక్తమవుతోంది. కాలంచెల్లిన ‘ప్రణాళిక’లనే నగర, పుర పాలకసంస్థలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలో 13 నగరపాలక, 128 పురపాలక సంఘాలు ఉండగా 80కి పైగా పట్టణాలు, నగరాలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ విషయంలో జాప్యం జరుగుతోంది.

10 అమృత్​ పట్టణాలకు మాస్టర్​ప్లాన్​ రూపకల్పన: హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన వరంగల్‌కు 1972 నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉండగా.. నిజామాబాద్‌కు 1974 నాటి ‘ప్రణాళికే’ దిక్కయింది. పదికిపైగా పురపాలికల్లో 1990 కంటే ముందునాటి మాస్టర్‌ప్లాన్‌లే అమల్లో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లో నాలుగేళ్లు పూర్తవుతున్నా బృహత్‌ ప్రణాళికల రూపకల్పన జరగడం లేదు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి రాష్ట్రంలోని అన్ని నగరపాలక, పురపాలక సంస్థలకు కొత్త మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినా కార్యాచరణ మాత్రం ముందుకు సాగడంలేదు. రాష్ట్రంలో 10 ‘అమృత్‌’ పట్టణాలకు కొత్తగా మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించినా అవి అమలుకు నోచలేదు.

పెరుగుతున్న జనాభా, ప్రాంతాల విస్తరణకు అనుగుణంగా కనీసం 20 ఏళ్లకోసారి మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని 141 నగర పాలక సంస్థలు, పురపాలక సంస్థలకు గాను 97 తెలంగాణ రాష్ట్ర టౌన్‌ప్లానింగ్‌ విభాగం పరిధిలో ఉన్నాయి. వీటిలో 32 పురపాలికలకు బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ప్లాన్‌)ల రూపకల్పనకు అనుమతి లభించగా.. 23 ఆ ప్రక్రియను చేపట్టాయి. వీటిలో ఎనిమిది మాత్రం ముసాయిదాలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపించగా.. పెద్దపల్లి పురపాలక సంఘం మాస్టర్‌ప్లాన్‌కు మాత్రం ఆమోదం లభించింది.

అలాగే పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 44 పురపాలికలు ఉండగా.. 17 తెలంగాణ పురపాలక అభివృద్ధి కార్యక్రమం ద్వారా మాస్టర్‌ప్లాన్‌ల రూపకల్పన చేపట్టినా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. కొన్ని ప్రాథమిక మ్యాప్‌ల తయారీ వద్దే ఉండగా మరికొన్ని ముసాయిదాల స్థాయిలో ఉండిపోయాయి. సాధారణంగా కొత్త పురపాలక సంఘం ఏర్పాటైతే నాలుగు సంవత్సరాలలోపు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 59 పురపాలక సంఘాలు ఏర్పాటై నాలుగు సంవత్సరాలు దాటినా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

వరంగల్‌లో 50 ఏళ్ల నాటి ప్లాన్‌: 10 లక్షలకు మించిన జనాభా ఉన్న వరంగల్‌లో 50 ఏళ్ల నాటి మాస్టర్‌ప్లానే ఇప్పటికీ అమల్లో ఉంది. రెండేళ్ల క్రితం కొత్తది రూపొందించారు. ముసాయిదా ప్రచురించి కార్పొరేషన్‌ తీర్మానంతో ప్రభుత్వానికి పంపించారు. దానికి ప్రభుత్వ ఆమోదం ఇప్పటికీ రాలేదు. నిజామాబాద్‌ నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌ కూడా 48 ఏళ్ల నాటిది కావడం గమనార్హం. ఏడాది క్రితమే మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన ప్రక్రియ ప్రారంభించినా ముసాయిదా స్థాయిని దాటి ముందుకు వెళ్లలేదు.

ఆ ప్రణాళికలు ఎందుకు?:

  • ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి
  • భవిష్యత్‌లో విస్తరణను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం
  • నిర్దేశించుకున్న మార్గంలో పట్టణాభివృద్ధి
  • ఆర్థికాభివృద్ధికి మార్గం
  • మెరుగైన రవాణా, సేవలు.పర్యావరణ హితంగా ప్రగతి. ప్రత్యేక జోన్ల ఆధారంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.