ETV Bharat / state

అక్కడి రైతుల ఖాతాల్లోకి నగదు.. ఎవరు వేశారో తెలీదు..

author img

By

Published : Oct 31, 2022, 7:03 PM IST

Viral News: ఆ మండల పరిధిలోని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఎక్కడి నుంచో నగదు జమ అవుతోంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎలా వస్తున్నాయో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. మరోవైపు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినట్లు సందేశాలు వస్తున్నాయి. దీంతో వారు నగదు తీసుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Viral News in Warangal District
Viral News in Warangal District

Viral News: ఆ అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి ఎక్కడి నుంచో డబ్బులు జమవుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎవరు వేస్తున్నారో తెలియకుండానే రూ.10వేల నుంచి రూ.50వేల వరకు డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమయ్యాయి. కొందరికి వారి ఖాతాలోకి డబ్బులు జమైనట్లు చరవాణులకు సమాచారం రాగా మరి కొంత మందికి రాకుండానే డబ్బులు పడ్డాయి. దీనిపై ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, అటు బ్యాంకు అధికారులు సైతం ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వరంగల్ అర్బన్ జిల్లా రాయపర్తి మండలంలోని మూడు గ్రామాల రైతుల బ్యాంకు ఖాతాలోకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నగదు జమ అవుతోంది. ఊకల్, గట్టికల్, జగన్నాథపల్లి గ్రామాల రైతులకు ఏపీజీవీబీ, కెనరా, బ్యాంక్​ ఆఫ్ బరోడా బ్యాంకులలోని వారి ఖాతాల్లోకి సుమారు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు నగదు జమ అయినట్లు చరవాణులకు సమాచారం వస్తోంది. నగదు ఎక్కడి నుంచి ఎవరు జమ చేస్తున్నారో తెలియక వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

వెంటనే తమ ఖాతాల నుంచి నగదు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మరికొంత మంది రైతులు వారి వారి బ్యాంకుల వద్దకు వెళ్లి ఖాతాలు చూసుకుంటున్నారు. నగదు జమ కాని అన్నదాతలు తీవ్ర నిరాశకు గురువుతున్నారు. అయితే భూమి లేని వారి ఖాతాల్లోకి నగదు పడటంతో పరిహారం కాకపోవచ్చని వారు అంటున్నారు. ఈ ఘటనపై సదరు బ్యాంక్ అధికారులను వివరణ కోరగా వారూ ఎటూ చెప్పలేక పోతున్నారు. దీనిపై సంబంధిత జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా దయాళ్​ను సంప్రదించంగా చాలాకాలం కింద పంట బీమా చేసుకున్న వారికి ఇన్సూరెన్స్ రూపంలో ఈ డబ్బులు వస్తున్నాయో.. లేక ఏ ఇతర కారణాల వల్ల వస్తున్నాయో తెలియడం లేదని చెప్పారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.

ఇవీ చదవండి: 'తెరాసతో పొత్తు ప్రసక్తే లేదు.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు'

పూజలు చేస్తుండగా వంతెన కూలి ఐదుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.