ETV Bharat / state

అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు ధరలు.. అన్నదాతకు అడుగడుగునా కష్టాలే..

author img

By

Published : Jan 25, 2022, 4:00 AM IST

అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు ధరలు.. అన్నదాతకు అడుగడుగునా కష్టాలే..
అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు ధరలు.. అన్నదాతకు అడుగడుగునా కష్టాలే..

Mirchi Farmers Protest: మిర్చి రైతుకు కాలం కలసి రావట్లేదు. గతంలో ఎప్పడూ లేనట్లుగా తామర, ఇతర తెగుళ్లు మిరప చేనును నాశనం చేస్తే ఆ బాధను దిగమింగుకున్నాడు. ఇంకా మిగిలిన తోటలను అకాల వర్షాలు ముంచెత్తితే ఆ బాధనూ పంట బిగువున అణుచుకున్నాడు. సగానికన్నా తక్కువ దిగుబడి వచ్చిన పంటను తీరా మార్కెట్ తీసుకువస్తే అక్కడా సరైన ధర రాక దగాపడుతున్నాడు.

అప్పుడు తెగుళ్లు.. ఇప్పుడు ధరలు.. అన్నదాతకు అడుగడుగునా కష్టాలే..

Mirchi Farmers Protest: సరైన దిగుబడి లేక చేతికందివచ్చిన పంటకూ ధర లేక వరంగల్ మిరప రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంట వేసిన రోజు నుంచి విక్రయం వరకూ అన్ని కష్టాలే. గతఏడాది నవంబర్ నుంచి తామర పురుగు... మిరప రైతుల పాలిట శాపంగా మారింది. కళ్ల ముందే పంటను తామర పురుగులు తినేస్తుంటే వేలకు వేలు పురుగు మందుల కోసం వెచ్చించారు. అయినా ఫలితం లేకపోగా.. పెట్టుబడి ఖర్చు రెట్టింపైంది. ఎకరానికి 20 క్వింటాళ్ల మేరకు దిగుబడి చూసిన రైతుకు ఈసారి నాలుగైదు క్వింటాళ్లు కూడా రావడం గగనమైంది. కొద్దోగొప్పో మిగిలిన పంటను చూసి సంతృప్తి పడుతుంటే సంక్రాంతి పండగ రోజుల్లో వచ్చిన అకాల వర్షాలు మిరప రైతును కోలుకోలేని దెబ్బ తీశాయి.

ధర రూపంలో నిరాశే..

నష్టపోగా మిగిలిన పంటను మార్కెట్ తీసుకొచ్చిన రైతుకు మళ్లీ ధర రూపంలో నిరాశే ఎదురవుతోంది. జెండా పాట పేరుతో మిరప రైతు దోపిడీకి గురవుతున్నాడు. ధర చూస్తే క్వింటాలుకు 17 వేలకు పైగా ఉంటున్నా.... ఆ ధర ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే వస్తోంది. మిగిలిన రైతులందరికీ మళ్లీ పది వేలు.. ఎనిమిది వేలే. ఇదేమని ప్రశ్నిస్తే నాణ్యత బాగోలేదన్న సమాధానమే వ్యాపారస్తుల నుంచి ఎదురవుతోంది. సోమవారం ఎనుమాముల మార్కెట్ మొత్తం మిరప బస్తాలతో కళకళలాడింది. 20 వేలకు పైగా బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయి. తీరా ధర చూసేసరికి రైతుకు కన్నీరే మిగిలింది.

అన్నదాతల ఆగ్రహం

వ్యాపారుల మోసాన్ని సహించలేని రైతులు మూకుమ్మడిగా ఆందోళన చేపట్టారు. మార్కెట్ అధికారులు దళారులతో కుమ్మక్కయ్యారంటూ ప్రధాన పరిపాలనా కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. పలుమార్లు కార్యాలయం ఆవరణలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. నిర్ణయించిన ధర కన్నా రెండు వేలు అదనంగా ఇవ్వాలని పట్టుబట్టారు. ఓ వైపు అధికారుల చర్చలు జరుపుతుంటే.. కాంటాలు జరిపేందుకు మరోవైపు సన్నద్ధకావడంతో రైతులకు ఆగ్రహం తెప్పించింది. కాంటాలను అడ్డుకుని మిర్చి బస్తాలను పడేశారు. ఓ వాహన అద్దాలు ధ్వంసం చేశారు. ఓ దశలో గేట్లు తోసుకుని మార్కెట్ పరిపాలన ఆవరణలోకి వచ్చేశారు.

అధికారుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ

జిల్లా కలెక్టర్ జోక్యంతో దిగివచ్చిన అధికారులు.. తెచ్చిన పంటను ఇవాళ కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. నిర్ణయించిన ధర అంగీకారమైన రైతులకు కాంటా వేయనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు. 27న తరువాత కొనుగోళ్లలోనే ఇదే సమస్య ఉత్పన్నమైతే.... మళ్లీ ఆందోళనకు సిద్ధమని రైతులు తెగేసి చెపుతున్నారు. ఇదే విషయంపై అధికారులతో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్దతు ధర వచ్చే విధంగా పర్యవేక్షించాలన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.